
విశ్లేషణ
హైదరాబాద్ మురికివాడల్లో నివసిస్తున్న కార్మికులతో నా ఇంటర్వ్యూల సందర్భంగా, ఒక సాధారణ విషయం బయటపడింది: అదేమిటంటే వేతనాలు పెరగనందువల్ల రోజు వారీ ఖర్చులను తీర్చుకోవడం వారికి కష్టతరం అవుతోంది. జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవడం గురించి ఇక చెప్పనవసరం లేదు.
అనధికారిక కార్మికులు అంటే వారు పెద్ద బహుళజాతి సంస్థలు లేదా మధ్య తరహా సంస్థలలో పనిచేసేవారు అయినా సరే... వారి వేతన పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది లేదా అసలు కనిపించడం లేదు. మరోవైపు జీవన వ్యయం పెరుగుతూనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు 8 శాతం మించిపోవడంతో, ప్రాథమిక అవసరాలు తీర్చు కోవడం కూడా కష్టంగా మారుతోంది.
ఈ పరిస్థితి విస్తృత స్థాయి ఆర్థిక సవాలును ప్రతిబింబిస్తుంది. వేతనాలు పెరగనప్పుడు, వృద్ధి నిలిచిపోతుంది. తక్కువ ఆదా యాలు కుటుంబంలో వినియోగాన్ని పరిమితం చేస్తాయి. ఇది తీవ్ర పరిణామాలను కలగజేస్తుంది. మొదటిది, ఇది ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై అవసరమైన ఖర్చును ప్రభావితం చేస్తుంది. తద్వారా నేరుగా శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది.
తక్కువ వేతన పెరుగుదల ఉన్న వినియోగదారులు తక్కువ ఖర్చు చేస్తారు, ఇది డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది. రెండవది, వినియోగదారుల వైపు నుంచి పడిపోయిన డిమాండ్, వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహపరుస్తుంది. మందగించిన ఆర్థిక కార్యకలాపాల చక్రాన్ని బలోపేతం చేస్తుంది. ఈ స్తబ్ధత ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవ నెత్తుతుంది. అదేమిటంటే భారతదేశ ప్రస్తుత వృద్ధి నమూనా స్థిరమై నదా, లేదా దానిపై తీవ్రమైన పునరాలోచన అవసరమా?
ప్రత్యామ్నాయం ఏమిటి?
వేతనాల ఆధారంగా సాగే వృద్ధి వ్యూహం సరళమైనదే కానీ, అది శక్తిమంతమైన సూత్రంపై పనిచేస్తుంది. కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు, వారు ఎక్కువ ఖర్చు చేస్తారు. డిమాండును, ఆర్థిక విస్తరణను నడిపిస్తారు. కార్పొరేట్ లాభాలు చివరికి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని భావించే ‘ట్రికిల్ డౌన్’ నమూ నాల మాదిరిగా కాకుండా, వేతన ఆధారిత వృద్ధి తక్షణ, విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది.
భారతదేశ ఆర్థిక పథం ఒక వైరుధ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవైపు అధిక జీడీపీ వృద్ధి, మరోవైపు స్తబ్ధుగా ఉన్న నిజ వేతనాలు తీవ్రమైన ఆదాయ అసమానతకు దారితీస్తున్నాయి. ఇది ముఖ్యంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం వంటి పరిశ్రమలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉత్పాదకత పెరిగింది, అయినప్పటికీ వేతనాలు స్తబ్ధుగా ఉన్నాయి. బలమైన వేతన వృద్ధి లేకపోతే, దేశీయ డిమాండ్ బలహీ నంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది.
ఈ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ రంగ జోక్యమే కీలకమైన మార్గం. ఇటీవలి ఆర్థిక విధానాలు ప్రైవేట్ వ్యాపార సంస్థ లకు, వ్యక్తులకు క్రెడిట్ లీడ్ (రుణ ప్రాధాన్యతా) వ్యూహం రూపంలో మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దీంట్లో రైతులు, వ్యాపా రస్తులు మొదలైన వివిధ రంగాలవారికి క్రెడిట్ కార్డుల రూపంలో సులభమైన రుణ కల్పన చేయడం జరుగుతోంది.
కానీ డిమాండ్‌ను తక్షణమే పెంచడానికి ఏకైక ప్రత్యామ్నాయం ప్రభుత్వరంగ పెట్టుబడే. వేతన వృద్ధి కంటే ఖర్చు తగ్గింపునకు, ముఖ్యంగా చౌక శ్రమకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యమిస్తాయన్నది తెలిసిందే. దీనికి బదులుగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కార్యక్రమా లలో ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు నేరుగా ఆదాయాలను పెంచు తాయి; ఇవి ఉద్యోగాలను సృష్టిస్తాయి; దీర్ఘకాలిక ఆర్థిక స్థితిస్థాపక తను పెంచుతాయి.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ తన పునర్నిర్మాణంలో గానీ లేదా దక్షిణ కొరియా తన అభివృద్ధి నమూనాలోగానీ వేతన ఆధారిత వ్యూహాలను విజయవంతంగా అవలంబించిన దేశాలు. ఇవి వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడ్డాయి. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా, ఆర్థిక విస్తరణను అనుసరించిన స్వీడన్ వంటి దేశాలు, పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చిన వాటి కంటే వేగంగా కోలుకున్నాయి.
భారతదేశం అమలుపర్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కూడా ఒక గొప్ప కేస్ స్టడీని అందిస్తుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమం అయినప్పటికీ, ఇది గ్రామీణ గృహా లలో వేతనాలను ప్రవేశపెట్టింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అంతటా తీవ్ర ప్రభావాలను ప్రేరేపించింది.
అధిక గ్రామీణ ఆదాయాలు వృద్ధికి కీలక చోదకాలైన వినియోగదారీ ఉత్పత్తులు, గృహనిర్మాణం, సేవలు వంటివాటికి డిమాండ్‌ను పెంచాయి. ఇలాంటి ఉపాధి కార్య క్రమాలను, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో విస్తరించడం, బలో పేతం చేయడం కూడా ఇదే విధమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
ముందుకు సాగే మార్గం
వేతన ఆధారిత వృద్ధిని విమర్శించేవారు తరచుగా అధిక వేతనాలు ద్రవ్యోల్బణానికీ, ఆర్థిక ఒత్తిడికీ దారితీయవచ్చని వాది స్తారు. అయితే, ముఖ్యంగా పెరుగుతున్న ఉత్పాదకతతో పాటు జీతాల పెంపు ఉన్నప్పుడు, మితమైన వేతన పెరుగుదల తప్పని సరిగా ద్రవ్యోల్బణానికి కారణం కాదు. ఉదాహరణకు, జపాన్‌లో స్తబ్ధతతో కూడిన వేతనాలు ద్రవ్యోల్బణ ప్రమాదాల కంటే ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదపడ్డాయి.
అంతేకాకుండా, ఆర్థిక లోటుపై ఆందోళనలను వేతన ఆధారిత వ్యూహాల దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చి చూడాలి. ప్రభుత్వ రంగ వేతన వృద్ధికి నిధులను అధిక రుణాల ద్వారా కాకుండా, ప్రగతిశీల పన్నులు, మెరుగైన ఆదాయ సమీకరణ ద్వారా వ్యూహాత్మకంగా సమకూర్చుకోవచ్చు. మంచి లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పెట్టుబడి... ఆర్థిక బాధ్యత, ఆర్థిక విస్తరణ రెండింటికీ ఉపకరిస్తుంది.
వేతన ఆధారిత వృద్ధిని వాస్తవం చేయడానికి, భారతదేశం తన పారిశ్రామిక, కార్మిక విధానాలను పునరాలోచించాలి. కార్మిక రక్షణ లను బలోపేతం చేయడం, అర్థవంతమైన కనీస వేతన సంస్కరణ లను అమలు చేయడం, సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడం ముఖ్యమైన చర్యలు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా న్యాయమైన వేతన ప్రమాణాలను నిర్దేశించాలి, తద్వారా ప్రైవేట్ రంగ యజ మానులు కూడా దీనిని అనుసరించేలా చేయాలి.
ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక వ్యూహం ప్రధానంగా క్రెడిట్ విస్తరణ, ప్రైవేట్ ఖర్చులకు ప్రోత్సాహకాల ద్వారా వినియోగాన్ని ప్రేరేపించడం చుట్టూ తిరుగుతోంది. ఇది తాత్కాలికంగా డిమాండ్‌ను పెంచి నప్పటికీ, ఆదాయ స్తబ్ధతకు సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించదు. దీనికి విరుద్ధంగా, వేతన ఆధారిత వృద్ధి... కార్మికులు స్థిరమైన కొనుగోలు శక్తిని కలిగి ఉండేలా, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా మరింత స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది.
భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలని కోరుకుంటున్నప్పుడు, విదేశీ పెట్టుబడులు లేదా కార్పొరేట్ ఆధారిత నమూనాలపై మాత్రమే ఆధారపడటం సరిపోదు. ప్రభుత్వ రంగ చొరవల ద్వారా బలోపేతమైన వేతన ఆధారిత వృద్ధి వ్యూహం, ఆర్థిక విస్తరణను వేగవంతం చేయడమే కాకుండా, దాన్ని సమానంగా, స్థిరంగా ఉండేలా చేస్తుంది. అసమానతలు పెరుగుతున్న ఈ కాలంలో, న్యాయమైన వేతనాలకు, బలమైన ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, నైతిక ఆవశ్యకత కూడా!
బొడ్డు సృజన
వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,
ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment