India economy
-
ఎకానమీ స్పీడ్ 6.4 శాతమే..
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిసెంబర్ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.కీలక రంగాలపై అంచనాలు..తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం. ఎకానమీ లెక్కలు ఇలా... ⇒ 2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) ⇒ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం. ⇒ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి, 2023–24లో ఈ రేటు 2.5 శాతం. తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205. ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి. తగిన అంచనాలు... 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్ క్రెడిట్ వృద్ధి మందగించింది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్ఎస్బీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... ‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి. అయితే జూన్ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. జూలై–సెపె్టంబర్ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది. వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.అయితే, వినియోగ విద్యుత్ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది. నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అరశాతం రెపో రేటు కోత అంచనా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం ఫిబ్రవరి, ఏప్రిల్ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది. -
అభివృద్ధా? అంతరమా?
సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి. 2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్లో ఆహారేతర అంశాలదే సింహభాగం. ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది. ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి. సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట. ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత. -
ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్ సింగ్. ఆర్థికశాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేసినా, ఆర్బీఐ గవర్నర్(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.ప్రధాన ఆర్థిక సలహాదారుగా..1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.ఆర్బీఐ గవర్నర్‌గా..1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?ఆర్థిక మంత్రిగా..1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం. -
సాఫీగానే ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు నెలకొన్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా సాగిపోతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించారు. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారకం నిల్వలు పటిష్టంగా ఉండడం, నియంత్రణలో కరెంటు ఖాతా లోటు, వస్తు, సేవల ఎగుమతుల వృద్ధిని ప్రస్తావించారు. 682 బిలియన్ డాలర్ల విదేశీ మారకంతో (అక్టోబర్ 31 నాటికి) ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తు చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రేట్ల కోతకు ఇచ్చిన పిలుపుపై స్పందించలేదు. డిసెంబర్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశం కోసం తన వ్యాఖ్యలను రిజర్వ్ చేస్తున్నట్టు దాస్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా అక్టోబర్ పాలసీ సమీక్షలో తటస్థ విధానానికి మారినట్టు దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం మధ్యమధ్యలో పెరిగినప్పటికీ మోస్తరు స్థాయికి దిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతం మించిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 4 శాతానికి ప్లస్ 2 లేదా మైనస్ 2 శాతం మించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్నది ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యం కావడం గమనార్హం. దీర్ఘకాలం పాటు అంతర్జాతీయంగా ఎన్నో సంక్షోభ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు చూపించినట్టు దాస్ చెప్పారు. కాకపోతే అంతర్జాతీయంగా ప్రస్తుతం కొన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ.. బాండ్ ఈల్డ్స్, కమోడిటీ ధరల పెరుగుదలను ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లోనూ ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్టు చెప్పారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని.. ఇందుకు ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్న స్వీయ అభిప్రాయాన్ని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇదే సభలో వ్యక్తం చేశారు. రూపాయికి లక్ష్యం లేదు.. రూపాయి మారకం విషయంలో ఆర్బీఐకి ఎలాంటి లక్ష్యం లేదని, అస్థిరతలను నియంత్రించేందుకు అవసరమైనప్పుడే జోక్యం చేసుకుంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ 2022, 2023లో ద్రవ్య కఠిన విధానాలను చేపట్టిన తరుణంలోనూ రూపాయి స్థిరంగా ఉండడాన్ని ప్రస్తావించారు. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) కార్యాచరణకు సంబంధించి ముసాయిదాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. -
వృద్ధి పటిష్టం.. రేటింగ్ యథాతథం: ఫిచ్
న్యూఢిల్లీ: పటిష్ట వృద్ధి తీర, ద్రవ్య విశ్వసనీయత నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు ‘స్టేబుల్ అవుట్‌లుక్‌తో బీబీబీమైనస్’ ను కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ స్పష్టం చేసింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనావేసిన ఫిచ్, 2025–26లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.2023–24లో దేశం సాధించిన 8.2 శాతంతో పోల్చితే ఒక శాతంపైగా వృద్ధిరేటు తగ్గుతుండడం గమనార్హం. ఈ ఏడాది మేలో మరో రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ దేశ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు’ పెంచింది. అయితే ‘బీబీబీమైనస్’ను కొనసాగించింది. రెండు సంస్థల రేటింగ్‌లూ ‘జంక్ స్టేటస్’కు ఒక అంచె ఎక్కువ. మూడీస్ కూడా ఇదే స్థాయి రేటింగ్‌ను దేశానికి ఇస్తోంది.మూడీస్ వృద్ధి అంచనాల పెంపు మూడీస్ తాజాగా ఒక నివేదికను విడుదల చేస్తూ, దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను పెంచింది. 2024లో జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 7.2 శాతానికి, 2025లో 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. -
2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
కోల్‌కతా: డాలర్ ప్రాతిపదికన వార్షిక వృద్ధి రేటు 12 శాతంగా ఉంటే, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. 2018 నుండి 2021 వరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.2020–2021 కోవిడ్ సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టత చెక్కుచెదరకుండా కీలకపాత్ర పోషించిన ఆయన, మహమ్మారిపై దేశం ప్రతిస్పందన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..» 2016 నుండి ద్రవ్యోల్బణం కట్టడికి దేశం పటిష్ట చర్యలు తీసుకుంది. దీనితో దేశం సగటు ధరల పెరుగుదల రేటును ఐదు శాతం వద్ద కట్టడి జరిగింది. 2016 ముందు ఈ రేటు 7.5 శాతంగా ఉండేది. » ద్రవ్యోల్బణం కట్టడితో దేశం ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందని విశ్వస్తున్నాం. దీనిని పరిగణనలోకి తీసుకోని నామినల్ గ్రోత్‌రేట్ 13 శాతంగా ఉంటుంది. ఐదు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడి కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. » పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, ప్రైవేటు రుణ వ్యవస్థ పురోగతి ఎకానమీకి మూడు కీలక స్తంభాలు. ఇవి ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధికి సహాయపడతాయి. » దీర్ఘకాలంలో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ తరుగుదల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండటంతో, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతున్నాయి. » డాలర్లో భారత్ వాస్తవ వృద్ధి రేటు 12 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రతి ఆరు సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత 3.8 ట్రిలియన్ డాలర్ల భారత్ ఎకానమీ 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. » అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడులతో సంబంధం లేకుండా, ఉత్పాదకత మెరుగుదల మాత్రమే వృద్ధికి కారణమవుతుంది. » ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా సగం నుంచి రెండు వంతులు ఇంకా అనధికారిక (అన్‌ఫార్మల్) రంగంలోనే ఉంది. » ఆర్థిక వ్యవస్థ ఎంత అధికారికంగా మారితే (ఫార్మల్గా) అది అంత అధిక ఉత్పాదకతకు దారి తీస్తుంది. ప్రపంచ సహచర దేశాలతో పోలిస్తే భారత్ ఫార్మల్ సెక్టార్లో ఉత్పాదకతను పెంచడానికి ఇంకా ఎంతో అవకాశం ఉంది. » భారతదేశ ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల చారిత్రక సగటు కంటే తక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ‘సానుకూల ఫలితాల సాధన సాధ్యమేనన్న’ విశ్వాసంతో ఆర్థిక విధానాలను రూపొందించగలిగింది. ప్రస్తుత జీడీపీ తీరిది.. భారత్‌ను 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించుకుని ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే వృద్ధి మందగమనం, అనిశ్చితమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధికి సవాళ్లుగా ఉన్నాయి. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి.కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు. ఇక ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
విధాన పాపం... ప్రజలకు శాపం...
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. వాస్తవంలో పేరు గొప్ప... ఊరు దిబ్బ లాగా దేశ ప్రజల స్థితిగతులున్నాయి. ఒక పక్కన నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. మరో పక్కన నింగినంటే ద్రవ్యోల్బణం, అంతంత మాత్రపు ప్రజల కొనుగోలు శక్తిని మరింతగా దిగజారుస్తోంది. మోదీ ప్రభుత్వం దేశం మీద వరుసగా రుద్దిన పెద్ద నోట్ల రద్దు, అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు, కోవిడ్ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాలే ఈ దుఃస్థితికి కారణం. ఫలితంగా లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయి ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడింది.నేడు వెలువడుతోన్న అనేక ఆర్థిక సంబంధిత గణాంకాలు చితికిపోతోన్న ప్రజల వాస్తవ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉదాహరణకు 2023 –24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల రుణభారం, వారి మిగులు ఆదాయంలో (కనీస అవసరాల తాలూకు ఖర్చుల అనంతరం మిగిలే ఆదాయం) 52 శాతానికి చేరుకుంది. ఇది 2022–23లో 48 శాతంగా ఉంది. కాగా, 2019–20 ప్రాంతంలో ఇది 40 శాతమే. ఇక 2012 –13లో అయితే ఈ మిగులు ఆదాయంలో, కుటుంబాల రుణభారం కేవలం 32 శాతం. అంటే, గడిచిన సుమారు దశాబ్ద కాలంలో ప్రజల రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా, కుటుంబాలు తమ ఆదాయాలలో అధిక భాగాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగించవలసి వస్తోంది. ఈ కారణం వలన, కనీస అవసరాలకు పోను... ఆ పైన ఖర్చులు పెట్టగల స్థోమత దిగజారిపోయింది. ఈ స్థితిలోనే 2023–24కాలంలో, బ్యాంకుల రిటైల్ రుణాలు 27.5 శాతం మేరకు పెరగగా, ఈ రుణాలు తీసుకున్నవారు, ఆ రుణంలో వినియోగ ఖర్చులకు వాడే మొత్తం కేవలం 8.5 శాతం పెరిగింది. అంటే, కుటుంబీకులు తాము తీసుకున్న రుణం తాలూకు పూర్తి మొత్తాన్ని వినియోగానికి వాడు కోలేకపోతున్నారు. దీనికి కారణం, వారు ఇందులోంచి కొంత భాగాన్ని పాత అప్పులు తీర్చేందుకు వాడటం. ప్రజల ఈ ఆర్థిక దుఃస్థితి వలన 50 వేల రూపాయల లోపు రిటైల్ రుణ గ్రహీతలు వాటిని సరైన సమయంలో చెల్లించలేని పరిస్థితి పెరుగుతోంది. ఫలితంగానే క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాల తాలూకు బకాయిల మొత్తం 2018–19 లోని జీడీపీలో 3.6 శాతం నుంచి 2023–24 నాటికి 5.6 శాతానికి పెరిగిపోయింది. ఈ విధంగా రిటైల్ రుణాలలో మొండి బకాయిగా మారుతున్నవి 8.2 శాతానికి పెరిగాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ రుణాలు మొండి బకాయిలుగా మారడం కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి తాలూకు ప్రభావం ఏమిటంటే, 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసి కంలో (ఏప్రిల్–జూన్ ) భారత కార్పొరేట్ల లాభాల పెరుగుదల, దాని ముందరి ఏడాది త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్కె ట్లో డిమాండ్ లేక ఈ కార్పొరేట్ల అమ్మకాల స్థాయి కూడా పడి పోయింది. మొత్తంగా ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో డిమాండ్ పతనం కావడం వల్ల, ప్రైవేట్ పెట్టుబడిదారులు కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టే పెట్టుబడులు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ పెట్టుబడుల స్థాయి 2009 సెప్టెంబర్ త్రైమాసికం నాటి అనంతరం కనిష్ఠ స్థాయిలో ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, కొత్త ప్రాజెక్ట్‌లలో ప్రైవేట్ రంగం తాలూకు వాటా 2023–24 లోని చివరి త్రైమాసికం లోని 85.4 శాతం నుంచి, 2024–25 మొదటి త్రైమాసికంలోని 66.7 శాతానికి పడిపోయింది. మరి, ఈ ఆర్థిక పతనానికి కారణం ఏమిటి? ఇతరత్రా కారణాలు ఏవైనా... మోదీ ప్రభుత్వ విధానాల తాలూకు ప్రభావమే ప్రధానంగా ఈ దుఃస్థితికి కారణం. వరుస పరంపరగా మోదీ ప్రభుత్వం దేశం మీద రుద్దిన 1) పెద్ద నోట్ల రద్దు 2) అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు 3) కోవిడ్ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాల వంటివి దీనికి కారణం. ఉదాహరణకు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన దేశంలోని లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయారు. అసంఘటిత రంగంగా ఉండే వీరు తమ వ్యాపారాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్ లైన్లో నిర్వహించుకోగల అవకాశం లేక వ్యాపారాల నుంచి వైదొలగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే, తమ అమ్మకాలకు డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీక రించగల పెద్ద రిటైల్ మార్టులు, మాల్స్ వ్యాపారాలు పెరిగాయి. చితికిపోయిన ఈ చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారం పెద్ద కార్పొరేట్ సంస్థలకు బదలాయించబడింది. అదీ కథ. పెద్ద నోట్ల రద్దు అనేది అంతిమంగా కాకులను కొట్టి గద్దలకు వేసేదిగా పరిణమించింది.ఇక, జీఎస్టీ అమలు క్రమంలో కూడా లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, ఉత్పత్తిదారులు చితికిపోయారు. అసంఘటిత రంగంలోని వీరంతా, బలవంతంగా జీఎస్టీ పరిధిలోకి లాగబడి, పెరిగి పోయిన ఖర్చులతో (అదనపు పన్నుల భారం వచ్చి పడింది కనుక) వ్యాపారాలు, ఉత్పత్తి చేయలేక చేతులు ఎత్తేశారు. ఈ విధంగా జీఎస్టీ అమలు దేశంలోని అసంఘటిత రంగానికి చావు దెబ్బ అయ్యింది. కోవిడ్ కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా, మరెన్నో లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చితికిపోయాయి. స్థూలంగా ఈ విధానాల అన్నిటి ఫలితంగా 2022–23 నాటికి దేశంలోని సరుకు ఉత్పత్తి రంగంలో ఉన్న, అసంఘటిత రంగ పరిశ్రమల సంఖ్య 9.3 శాతం తగ్గి, 17.82 మిలియన్లకు పరిమితమయ్యింది.దాంతో, ఈ పరిశ్రమలలో 15 శాతం మేర కార్మికులు ఉపాధిని కోల్పోయారు. సాధారణ స్థితిలో, ఈ అసంఘటిత సరుకు ఉత్పత్తి రంగ పరిశ్రమల సంఖ్య దేశంలో సాలీనా 2 మిలియన్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. అవకతవక విధానాలు లేకుంటే ఈ అసంఘటిత రంగ సరుకు ఉత్పత్తి పరిశ్రమల సంఖ్య మరింతగా పెరిగి ఉండాలి. స్థూలంగా, మోదీ విధానాల ఫలితంగా సుమారు 10 మిలియన్ల మేర కొత్త సంస్థల ఆవిర్భావానికి ఆస్కారం లేకుండా పోయింది. దీనికిమించి, ఈ సంస్థలు ఒకొక్క దానిలో 2.5 నుంచి 3 ఉపాధి అవకాశాల కల్పనను మనం కోల్పోయాము. ఫలితంగా సుమారు 25–30 మిలియన్ల ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం మూసుకుపోయింది. అంటే, ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగాన్ని... సంఘటిత రంగం దిశగా మళ్ళించే పేరిట, మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఈ విధానాలు తొలుత కొంత పెద్ద కార్పొరేట్లకు అనుకూలించినా, అంతిమంగా నేడు అవి కూర్చున్న కొమ్మను నరుక్కున్న తీరుగా, కార్పొరేట్ల లాభాలకు కూడా గండి కొడు తున్నాయి. ఈ క్రమంలోనే, మార్కెట్లో డిమాండ్ దిగజారిపోయి నేడు రిటైల్ రంగంలోని రిలయన్ ్స, టైటాన్, రేమాండ్ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవ త్సరం కాలంలోనే సుమారుగా 26 వేల మందిని ఈ సంస్థలు ఇంటికి పంపాయి.మోదీ ప్రభుత్వ విధానాల ప్రతికూల ప్రభావాన్ని అర్థం చేసు కొనేందుకు ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలకు ముందర ఎయిర్ కూలర్ల తయారీలో బ్రాండెడ్ సంస్థలతో పాటుగా, స్థానికంగా చవకగా తయారయ్యే కూలర్లు కూడా ఉండేవి. ధర తక్కువ ఉన్న ఈ కూలర్లకు భారీ మార్కెట్టే ఉండేది. కానీ, ఇవి తమ ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, పెరిగిన పన్ను భారాల వల్ల మూసివేత బాట పట్టాయి. మార్కెట్ నుంచి వైదొలగిన ఈ లోకల్ సంస్థల అమ్మకాలు బ్రాండెడ్ కంపెనీలకు బదలాయించబడ్డాయి. ఫలితంగా తొలుత ఈ పెద్ద సంస్థల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. కానీ, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బ తినడంతో దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం వలన ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పతనమై అంతిమంగా అది పెద్ద సంస్థల అమ్మకాలూ... లాభాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకు తిన్న విధానాల కథ ఇది. లాభాల దురాపేక్ష తప్ప, దూరదృష్టి లేని కార్పొరేట్ల గుడ్డితనం నేడు మోదీ విధానాల రూపంలో దేశ ప్రజలకు అశనిపాతంగా మారుతోంది!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
Raghuram Rajan: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్ ఎకానమీ ప్రస్తుతం ఉద్యోగాల కల్పనలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న సమస్యల్లో ఉద్యోగాల కల్పన ప్రధానమైందని ఆయన అన్నారు. నైపుణ్యాల పెంపు ద్వారా మానవ వనరుల అభివృద్ధి తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా రాజన్ పనిచేస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ లాంబా, తాను (రాజన్) సంయుక్తంగా రాసిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ అనే పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ భారత్ ఎకానమీ గురించి కీలక విశ్లేషణ చేశారు. ‘‘భారత్ ప్రస్తుతం ఒక క్రాస్ రోడ్ వద్ద ఉంది‘ అన్న ముగింపు అభిప్రాయంతో ముగిసిన పుస్తకం గురించి వివరించిన సందర్భంగా రాజన్ ఏమన్నారంటే... ► భారతదేశం అతిగొప్ప బలం 140 కోట్ల జనాభా. అయితే ఈ జనాభాకు సంబంధించి ‘మూలధనం’ ఎలా బలోపేతం చేయాలన్నది ప్రశ్న. దేశం అభివృద్ధి పథంలో పయనించే ప్రతి స్థాయిలో ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. ► ప్రైవేట్ రంగ ఉద్యోగాల విషయంలో ‘రిజర్వేషన్ల’ ఆందోళనలు ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు తమ నివాసితులకు మాత్రమే ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ప్రయతి్నస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన ధోరణి. ఇలాంటి ధోరణి పోవాలి. దీనివల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశం మొత్తం విస్తరించడానికి వీలవుతుంది. ► గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ కలి్పస్తే రాబోయే ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో దేశంలో భారీ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పించడానికి 10 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ► భారత్ మానవ ‘మూలధనాన్ని’ మెరుగుపరుచుకుంటే... అవసరమైన ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి. శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరుస్తే, కంపెనీలు భారతదేశానికి వస్తాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు లభించడం లేదని కంపెనీలు తరచూ చెబుతుండడాన్ని మనం గమనిస్తున్నాం. ► సామాన్యునికి సైతం సైవలు అందేలా పాలనా సంస్కరణలు జరగాలి. ప్రత్యేకించి పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి సారించాలి. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మదింపు సరిగా జరగాలి. భారత్ తన బలహీనతలపై కాకుండా బలాలపై ఆధారపడిన మార్గాన్ని ఆవిష్కరించాలి. -
8 శాతం వరకూ ఎకానమీ వృద్ధి
న్యూఢిల్లీ: వృద్ధి ఊపందుకోవడం, సానుకూల సెంటిమెంట్లు, పెరుగుతున్న ప్రైవేట్ పెట్టుబడుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ ఎకానమీ 7.5 నుండి 8 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నట్లు భారత్ వాణిజ్య పరిశ్రమల మండళ్ల సమాఖ్యకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ అనిష్ షా విశ్లేషించారు. 2025 ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే భారత్ వృద్ధి అవకాశాలపై భౌగోళిక రాజకీయ ఒత్తిడి ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న షా ఈ మేరకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. ► మనం ఇప్పటివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో వరుసగా 7.8 శాతం, 7.6 శాతం వద్ద మంచి వృద్ధి రేటులను చూశాము. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ వరకూ 7.7 శాతం పురోగతి నమోదయ్యింది. వృద్ధి ఊపందుకుంటోంది కాబట్టి... ఇదే చక్కటి ఎకానమీ ఫలితాలు కొనసాగుతాయని నేను భావిస్తున్నాను. ► మన ఎకానమీకి ప్రస్తుత సవాలు అంతర్జాతీయ పరిణామాలే. మన ఎకానమీ ఇజ్రాయెల్–గాజాకు సంబంధించిన ప్రభావాలను చూస్తోంది. ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో మనకు తెలిసిందే. ఆయా ఉద్రిక్తతలు విస్తరించకూడదని మన కోరిక. ప్రతి ఒక్కరి పురోగతి కోసం శాంతి అవసరం. ► ఇక రెండవ సమస్య విషయానికి వస్తే... పాశ్చాత్య దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు. అక్కడ సమస్యలు తగ్గాయని మేము అనుకోవడం లేదు. భారతదేశంలో మనం చూసిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆయా దేశాల్లో వడ్డీ రేటు ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ఎక్కువ ఆర్థిక సంక్షోభ ప్రభావాలు ఉంటే, అవి తప్పనిసరిగా భారతదేశంపై కూడా ప్రభావాన్ని ఊపుతాయి. ► విదేశాల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం వృద్ధి జోరును కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, అనేక భారతీయ కంపెనీలు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే రీతిలో తమ బ్యాలెన్స్ సీట్లను పటిష్టం చేసుకోవాలి. ► భారతీయ కంపెనీలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి చూస్తే, సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. సామర్థ్యాల మెరుగుదల కొనసాగుతోంది. డిమాండ్ పరిస్థితులు కూడా బాగున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతోంది కాబట్టి పెట్టుబడుల వేగం మరింత పెరుగుతోంది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి తర్వాత వరుసగా ఐదవసారికూడా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6.5 శాతం)ను యథాతథంగా కొనసాగించడం సరైనదే. ఈ విషయంలో ఆర్బీఐ ప్రో–యాక్టివ్‌గా ఉండడం హర్షణీయం. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ ముందస్తు చర్యలు తీసుకుంది. ఇది కీలకమైన అంశం. రేట్లు తగ్గించడం కంటే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడమే ముఖ్యమైన అంశం. ఇది ఇప్పటివరకు పనిచేసింది. ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ఆర్బీఐ చక్కటి చర్యలు తీసుకుందన్న నిపుణుల విశ్లేషణను నేను సమరి్థస్తాను. అయితే దీర్ఘకాలిక దృక్పథంతో ఆర్థిక వ్యవస్థను మంచి మార్గంలో ఉంచిన తర్వాత రేటు తగ్గింపుకు అవకాశం ఉండి, ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటే పరిశ్రమ దానిని స్వాగతిస్తుంది. ► 2047 నాటికి దేశాన్ని ‘వికసిత భారత్’ లక్ష్యం వైపు నడిపించేందుకు ఫిక్కీ తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతి, సుస్థిరతలకు సంబంధించి వృద్ధి లక్ష్యాల సాధనకు ఫిక్కీ తగిన కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. 2024–25లో వృద్ధి 6.5 శాతమే: యాక్సిస్ బ్యాంక్ అమెరికాలో మాంద్యం ఖాయమని సూచన 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితమవుతుందని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంత్ మిశ్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. దేశీయంగా ఎకానమీ క్రియాశీలత బాగున్నప్పటికీ, అంతర్జాతీయ అంశాలే ప్రతికూలతలని మిశ్రా పేర్కొన్నారు. అమెరికా ఎకానమీ ఇంకా సమస్యలోంచి బయటపడలేదని, దీర్ఘకాలంగా భయపడుతున్న మాంద్యపు భయాల అంచనా వాస్తవమని పేర్కొన్నారు. అమెరికాకు ద్రవ్యలోటు ప్రధాన సమస్యని పేర్కొన్న ఆయన, ‘‘అమెరికాలో మాంద్యం ఆలస్యం అయింది. వాయిదా పడలేదు’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక సవాళ్లను అన్ని వర్గాలు తక్కువగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ, ఈ క్లిష్టమైన అంశంపై చర్చ లేకపోవడంపై తాను ఆందోళన చెందుతున్నానని ఆర్థికవేత్త పేర్కొన్నారు. భారతదేశం వంటి దేశాలు అనుసరించే వివేకవంతమైన ఆర్థిక చర్యలకు బదులుగా, అమెరికా సాంప్రదాయక ‘ప్రో సైక్లికల్ పాలసీ’ని అనుసరించినట్లు ఆయన విశ్లేషించారు. భారతదేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు విధాన నిర్ణయాల దిశలో పెద్దగా మార్పుకు దారితీయబోవని పేర్కొన్నారు. తాను కార్పొరేట్ అయినట్లయితే, తక్షణ డిమాండ్ కారణంగా త్వరగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుని ఉండే వాడినని మిశ్రా అన్నారు. విద్యుత్‌కు సంబంధించి బొగ్గు ఆధారిత, పునరుత్పాదక ఇంధన ఆధారిత రంగాల్లో పెట్టుబడులు చక్కటి ఫలితాలను ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయా విభాగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయనీ వివరించారు. అస్థిర ఆహార ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును 2024లో తగ్గించే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే 2024లో ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ద్రవ్యలోటు సవాళ్లు తగ్గినప్పటికీ విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం లేదని పేర్కొన్న ఆయన, ఇందుకు తొలుత భారత్ అధిక రుణ–జీడీపీ నిష్పత్తిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
భారత్ ఎకానమీ వృద్ధి 6.8 శాతం
-
కొత్త ఎఫ్‌టీఏలతో ఎగుమతులకు ఊపు
న్యూఢిల్లీ: దేశాలతో కొత్త సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), వ్యయం తగ్గింపునకు చర్యలు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటు, లాజిస్టిక్స్ పురోగతి, భూ సంస్కరణలు వంటి చర్యలు 2030 నాటికి భారతదేశం వస్తువులు– సేవల ఎగుమతులను 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికి దోహదడతాయని పరిశ్రమ చాంబర్– పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) నివేదిక గురువారం తెలిపింది. ‘ఇండియాస్ ఎమర్జింగ్ ఎక్స్పోర్ట్ డైనమిక్స్: విజన్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు’’ అన్న శీర్షికతో ఆవిష్కృతమైన ఈ నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►సముద్ర ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, కొన్ని రసాయనాలు, ఫార్మా, పత్తి, అల్యూమినియం, ట్యాంకర్లతోసహా తొమ్మిది రంగాల్లోని 75 కీలక ఉత్పత్తుల ఎగుమతులకు స్కీమ్‌లు అవసరం. ఈ ఉత్పత్తులు వార్షికంగా చూస్తే మొత్తం ఎగుమతుల విలువలో 222 బిలియన్ల వాటా కలిగిఉన్నాయి. ►భారత్ మొత్తం ఎగుమతుల్లో ఈ విలువ 50 శాతం. ప్రపంచ స్థాయి వాణిజ్యంలో చూస్తే... ఈ 75 ఉత్పత్తులు ఎంతో కీలకంగా ఉన్నాయి. అయితే ఈ ఉత్పత్తులలో భారతదేశం వాటా మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో 6 శాతం మాత్రమే. ►ఈ 75 ఉత్పత్తుల విషయంలో భారత్ తన అవకాశాలను పెంపొందించుకోడానికి అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారు–విక్రేత సమావేశాలలో పాల్గొనడం, ఈ వస్తువుల కోసం ఎగుమతి ప్రోత్సాహక పథకాలను పొడిగించడం వంటి చర్యలు అవసరం. ►భారతదేశం సేవా రంగం ఎగుమతులు సాంప్రదాయకంగా ఉత్తర అమెరికా, ఐరోపాలో కేంద్రీకృతమై ఉన్నాయి, అయితే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ఖండాల్లో పురోగమిస్తున్న దేశాలుసైతం భారత్ ఎగుమతుల వృద్దికి అవకాశాలను పుష్కలంగా అందిస్తాయి.టోగో, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్ ఎగుమతుల వృద్ధికి దోహదపడే గమ్యస్థానాల్లో కొన్ని . ►కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సమగ్రంగా ఉండాలి. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.భారత్ ఎగుమతుల రంగానికి ఈ విభాగం కీలకమైనది కావడమే దీనికి కారణం. ►రెపో రేటును తగ్గించడం (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6.5 శాతం) వల్ల బ్యాంకింగ్ రుణ రేట్లు తగ్గుతాయి. ఇది వ్యాపారాలకు మూలధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశీయంగా డిమాండ్ పెరగడానికీ ఈ చర్య దారితీస్తుంది. దేశీయ మార్కెట్లో ఉత్పత్తిదారులు– అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతిదారుల పోటీతత్వాన్ని పెంచుతుంది. ►ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కొన్నేళ్లుగా విద్యుత్తు ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ, యూనిట్ విద్యుత్ ఛార్జీలు ఇప్పటికీ గణనీయంగా ఎక్కువగానే ఉన్నాయి. ►ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో భూమి ఒకటి. ప్రభుత్వం భూసంస్కరణలపై దృష్టి సారించాలి. ఇది భూమిని కొనుగోలు చేయడంలో సంక్లిష్టతలను తగ్గిస్తుంది. అలాగే వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. ►సామర్థ్యం, ఉత్పాదకతను పెంచే మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇది అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో కంపెనీల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడే అంశం. ►ఎగుమతులకు సంబంధించి మౌలిక వనరుల పురోగతి మరింత మెరుగుపడాలి. దేశంలో లాజిస్టిక్ వ్యయాలను తగ్గించడానికి రైలు, ఓడరేవులను మరింత అభివృద్ధి చేయాలి. భారతదేశంలోకి పేపర్ దిగుమతులు పరిమాణం పరంగా 2023–24 ప్రథమార్థంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 43 శాతం పెరిగాయి. ఆసియన్ దేశాల నుండి దిగుమతులు రెండు రెట్లు పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) డేటా ప్రకారం, కాగితం– పేపర్‌బోర్డ్ దిగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 672,000 టన్నులు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఈ పరిమాణం 959,000 టన్నులకు పెరిగింది. ఇదే కాలంలో ఆసియన్ దేశాల నుంచి దిగుమతుల పరిమానం 81,000 టన్నుల నుంచి 2,88,000 టన్నులకు ఎగసింది. విలువ పరంగా చూస్తే, పేపర్ దిగుమతుల బిల్లు సమీక్షా కాలంలో రూ.5,897 కోట్ల నుంచి రూ.6,481 కోట్లకు ఎగసింది. ఆసియన్ దేశాలకు సంబంధించి విలువ రూ.715 కోట్ల నుంచి రెట్టింపై రూ.1,509 కోట్లకు చేరింది. పేపర్ దిగుమతుల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. కాగా, ముడిసరుకు, ఇన్పుట్ వ్యయాల్లో గణనీయమైన పెరుగుదల దృష్ట్యా కాగితం– పేపర్‌బోర్డ్‌ను ఉత్పత్తి చేసే పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ)అధ్యక్షుడు పవన్ అగర్వాల్ పేర్కొన్నారు. దిగుమతుల వల్ల మరింత పోటీ పూర్వక పరిస్థితిని దేశీయ పరిశ్రమ ఎదుర్కొంటోందని అన్నారు. కొనసాగుతున్న అనిశ్చితి... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో చరిత్రాత్మక రికార్డు స్థాయిలో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7 శాతం క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95 శాతం క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ వస్తు వాణిజ్య పరిమాణం 2021–22 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో వస్తు ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి భారత్ వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో 2023–24లో భారత్ వార్షిక వాణిజాభివృద్ధి అంచనాలపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు సేవల రంగం ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలంలో ఈ విలువ 181.37 బిలియన్ డాలర్ల నుంచి 192.65 బిలియన్ డాలర్లకు ఎగసింది. పురోగతి సాధ్యమే.. ఎగుమతుల పురోగతికి ప్రభుత్వం చక్కటి విధాన నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు ఎగుమతిదారులు కూడా తమ ఎగుమతులకు మంచి ధరను రాబట్టుకునే మార్గాలతో అనుసంధానమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎగుమతుల రంగం క్రమంగా పురోగమిస్తోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ -
4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్?
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) మైలురాయిని అధిగమించేసిందన్న వార్తలు ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ .. కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. భారత్ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు చూపుతూ ఓ స్క్రీన్‌షాట్ వైరల్ అయ్యింది. దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి పోర్టల్‌లో వివిధ దేశాల జీడీపీ గణాంకాల లైవ్ ఫీడ్ నుంచి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అటుపైన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ, మహారాష్ట్ర డిప్యుటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. అయితే, వార్తలపై అధికారిక స్పందన వెలువడలేదు. -
వృద్ధి బలపడుతుంది...
ముంబై: భారతదేశంలో ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశీయంగా ఉన్న అంతర్గత పరిస్థితులు, వివేకవంతమైన పాలసీ విధానాలతో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తోందని భరోసాను ఇచ్చారు. టోక్యోలో ట్యోక్యో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత్ ఎకానమీపై ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ అన్ని సవాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉందని, ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం కట్టడికి, వృద్ధికి తోడ్పడుతుందని కూడా చెప్పారు. 2 శాతం ప్లస్ లేదా మైనస్లతో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగేలా చర్యలు ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. సుపరిపాలన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నైతిక ప్రవర్తన, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం భారత్ దృష్టి సారించడం జరిగిందన్నారు. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ద్వారా ఫిన్‌టెక్‌లు తమకుతాము స్వీయ–నియంత్రణను పాటించేలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతోందన్నారు. -
Vision 2047: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ప్రణాళిక!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల (29.2 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన విజన్ ప్లాన్ సిద్ధమవుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. రూపకల్పనలో ఉన్న ఈ విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. ఈ ముసాయిదా విజన్ డిసెంబర్ 2023 నాటికి సిద్ధమవుతుందని, వచ్చే మూడు నెలల్లో విజన్ దేశ ప్రజల ముందుకు వస్తుందని వెల్లడించారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశం అంటే... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
భారత్ వృద్ధిపై భరోసా.. వరల్డ్ బ్యాంక్ అంచనా
ఢిల్లీ: భారత్ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న తన అంచనాలను ప్రపంచ బ్యాంక్ పునరుద్ఘాటించింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ సేవల రంగం పటిష్టంగా ఉంటుందని ఇండియా డెవలప్మెంట్ తాజా అక్టోబర్ అవుట్‌లుక్‌లో స్పష్టం చేసింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం మెజారిటీ వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2022–23 భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, దక్షిణాసియా వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ అంచనావేసింది. ఇతర వర్థమాన మార్కెట్, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎకానమీ (ఈఎండీఏ)ల వృద్ధి రేటు 2023–24లో 6.3 శాతం, 2024–25లో 6.4 శాతం నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల ప్రకారం... 2023–24లో వ్యవసాయ రంగం 3.5 శాతం పురోగమిస్తుంది. పరిశ్రమల రంగం 5.7 శాతం, సేవల రంగం 7.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయి. పెట్టుబడుల్లో వృద్ధి 8.9 శాతంగా ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దిగివస్తుంది. ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు జీడీపీలో లక్ష్యాల మేరకు 6.4 శాతం నుంచి (2022–23లో జీడీపీతో పోల్చి) 5.9 శాతానికి దిగివస్తుంది. ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 83 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ స్థూల రుణం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.159.54 లక్షల కోట్లుగా నమోదయ్యింది. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే (రూ.156.08 లక్షల కోట్లు) ఈ పరిమాణం 2.2 శాతం పెరిగింది. మొత్తం రుణాల్లో పబ్లిక్ డెట్ 89.5 శాతంగా ఉంది. భారత్ విదేశీ రుణ భారం జూన్ ముగిసే నాటికి 629.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.52 లక్షల కోట్లు) చేరింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ కరెన్సీ అకౌంట్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) జీడీపీలో దేశం భరించగలిగిన స్థాయిలోనే 1.4 శాతంగా ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల రుణ నాణ్యత మెరుగుపడుతుంది. అధిక రుణ వృద్ధి, మొండిబకాయిలు తగ్గడం, చక్కటి రికవరీలు, మొండి బకాయిల రైటాఫ్స్ దీనికి కారణం. 2022 మార్చిలో 5.9 శాతంగా ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల స్థూల మొండిబకాయిల నిష్పత్తి, 2023 మార్చి నాటికి 3.9 శాతానికి తగ్గడం గమనార్హం. కొన్ని సంస్థల అంచనా ఇలా.. (వృద్ధి శాతాల్లో) సంస్థ 2023–24 ఆర్బీఐ 6.5 ఎస్అండ్పీ 6.0 ఫిచ్ 6.3 మూడీస్ 6.1 ఏడీబీ 6.3 ఇండియా రేటింగ్స్ 6.2 ఓఈసీడీ 6.3 -
స్థూల ఆర్థిక నిర్వహణ భేష్: కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అసాధారణ సవాళ్ల మధ్య భారత్ బలమైన రికవరీ బాటలో నడవడానికి దేశ స్థూల ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉండడమేనని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. ఇతర దేశాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొంది. మౌలిక సదుపాయాల సరఫరా వైపు చేసిన పెట్టుబడులతో భారత్ దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేసింది. ‘‘గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఊహించని సవాళ్లు నెలకొన్నాయి. దీనికితోడు భారత బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేట్ రంగంలో బ్యాలన్స్ షీటు సమస్యలు వెలుగు చూశాయి. అయినా కానీ, భారత్ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉండడం వీటిని అధిగమించేలా చేసింది’’అని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంతక్రితం ఆర్థిక సంవత్సంతో పోలిస్తే తగ్గడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సంక్షేమంపై వ్యయాలను పెంచొచ్చని పేర్కొంది. అలాగే, గరిష్ట స్థాయిలో మూలధన వ్యయాలను కొనసాగించొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల పనితీరు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన అంచనా 7 శాతం మించి, 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడానికి, చివరి త్రైమాసికంలో బలమైన పనితీరును కారణంగా పేర్కొంది. -
792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశీయంగా యాప్ ఎకానమీ 2030 నాటి కి 792 బిలియన్ డాలర్లకు చేరనుంది. తద్వారా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 12 శాతం వాటాను దక్కించుకోనుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బీఐఎఫ్ తరఫున ఐసీఆర్ఐఈఆర్ సీనియర్ విజిటింగ్ ప్రొఫెసర్ రేఖా జైన్, ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్లు విశ్వనాథ్ పింగళి, అంకుర్ సిన్హా దీన్ని తయారు చేశారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) మొబైల్ అప్లికేషన్ల చుట్టూ తిరిగే యాప్‌ల అభివృద్ధి, విక్రయం, ఇన్-యాప్ కొనుగోళ్లు, సబ్్రస్కిప్షన్లు, ప్రకటనల మొదలైన వాటి వ్యవస్థను యాప్ ఎకానమీగా నివేదిక వివరించింది. దీని ప్రకారం .. ప్రస్తుతం జీడీపీ 3,820 బిలియన్ డాలర్లుగా ఉండగా యాప్ ఎకానమీ 145 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీ 6,590 బిలియన్ డాలర్లకు చేరినప్పుడు ఇది 791.98 బిలియన్ డాలర్లకు చేరనుంది. జీడీపీ వృద్ధి కన్నా నాలుగు రెట్లు అధికంగా యాప్ ఎకానమీ 32 శాతం స్థాయిలో వృద్ధి చెందనుందని జైన్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ యూజర్ల పెరుగుదల, ఎకానమీ వృద్ధి ఇందుకు దోహదపడగలవని వివరించారు. (ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా) -
ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా?
ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్డౌన్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది. ఈ ఇంటర్నెట్ షట్డౌన్లు దాదాపు 118 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 968 కోట్లు) విదేశీ పెట్టుబడుల నష్టానికి కారణమయ్యాయని, 21,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ లాభాపేక్షలేని ఇంటర్నెట్ సొసైటీ తన నివేదిక 'నెట్‌లాస్'లో పేర్కొంది. ఇంటర్నెట్ నిషేధ ప్రభావం ఉత్పత్తి నష్టానికే పరిమితం కాదని, నిరుద్యోగ రేటులో మార్పు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోల్పోవడం, భవిష్యత్తులో షట్డౌన్ల ప్రమాదాలు, పని చేసేవారి జనాభా మొదలైన అంశాలపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ఇంటర్నెట్ షట్డౌన్లు అశాంతిని అణచివేస్తాయని, తప్పుడు సమాచార వ్యాప్తిని ఆపివేస్తాయని లేదా సైబర్ సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తాయని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. కానీ ఇంటర్నెట్ షట్డౌన్లు ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని అని నివేదిక పేర్కొంది. అల్లర్లను నియంత్రించడానికి భారత్ ఇంటర్నెట్ షట్డౌన్లను ఒక సాధనంగా ఉపయోగించడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశానికి 16 శాతం షట్‌డౌన్ రిస్క్ ఉందని, ఇది 2023 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని తెలిపింది. ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల ఈ-కామర్స్ వ్యాపారాలు స్తంభిస్తాయి. తద్వారా కాలాధారమైన లావాదేవీలు నష్టాలను మిగుల్చుతాయి. నిరుద్యోగాన్ని పెంచుతాయి. వ్యాపార సంస్థలు, కస్టమర్ల కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగిస్తాయి. కంపెనీలకు ఆర్థికంగా నష్టాలను మిగిల్చడమే కాకుండా పరపతికి భంగం కలిగిస్తాయని నివేదిక ఉద్ఘాటించింది. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
సానుకూలమైనా... సవాళ్లూ ఉన్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 మొదటి నెల– ఏప్రిల్‌లో శుభారంభం చేసిందని ఆర్థికశాఖ ఏప్రిల్ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. అయితే భారత్ వృద్ధి బాటకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. వినియోగం స్థిరంగా ఉండడం విస్తృత ప్రాతిపదికన వృద్ధి నమోదుకావడానికి దోహదపడే అంశమైనా, పెట్టుబడుల్లో సామర్థ్యం సృష్టి, రియల్టీలో పెట్టుబడులు వంటి అంశాలపై అనిశ్చితి ఉందని పేర్కొంది. దేశీయంగా అన్నీ సానుకూల అంశాలేనని పేర్కొంటున్న నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ఆర్థిక సంవత్సరం శుభారంభం మొత్తం సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను అంచనా వేయడానికి ఏప్రిల్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అయితే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను తీసుకుంటే, ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలతోనే ప్రారంభమైందని భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని పరిగణనలోకి తీసుకోవాలి. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. అన్ని పరోక్ష పన్నులనూ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలైలో కొత్త పన్ను విధానం ప్రారంభంమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. 2022 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 12 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ప్రశంసనీయం. ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ వార్త. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ, పన్నుల వసూళ్లు నెలవారీగా ఈ స్థాయికి పెరగడం జీఎస్టీ పట్ల వ్యవస్థలో పెరిగిన విశ్వాసాన్ని, ఆమోదనీయోగ్యతను, సమ్మతిని సూచిస్తోంది. భారత్ ఎకానమీ పటిష్ట పురోగతిని ఇది సూచిస్తోంది. ఐఐపీ భరోసా గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసింకంలో (2022–23 జనవరి–మార్చి) పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ) అందులో దాదాపు 44 వెయిటేజ్ ఉన్న ఎనిమిది పరిశ్రమల కీలక గ్రూప్ ( క్రూడ్ ఆయిల్, విద్యుత్, సిమెంట్, బొగ్గు, ఎరువులు, స్టీల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టŠస్ ) స్థిరమైన వృద్ధి తీరును కనబరిచాయి. అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోల్చితే (జూలై–డిసెంబర్) వినియోగ సామర్థ్యం 75 శాతం పెరిగింది. కార్యకలాపాలలో స్థిరమైన వృద్ధి, సామర్థ్య వినియోగం పెరుగుదల సానుకూలతలతో కార్పొరేట్లు కొత్త పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. భారీ యంత్రసామాగ్రి డిమాండ్, ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగాలు 4వ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. మూలధన వస్తువుల దిగుమతుల్లోనూ పెరుగుదల నమోదయ్యింది. సేవలు, తయారీ, వ్యవసాయమూ.. ప్లస్సే... తయారీ, సేవల రంగం మాదిరిగానే వ్యవసాయ రంగానికి కూడా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సాధారణ రుతుపవనాల అంచనా, మిగులు నీటి నిల్వ స్థాయిలు, విత్తనాలు– ఎరువులు తగినంత లభ్యత, పటిష్టమైన ట్రాక్టర్ విక్రయాలు జూన్ 2023 నుండి ప్రారంభమయ్యే ఖరీఫ్ విత్తన సీజన్‌కు శుభసూచికలు. అకాల వర్షాలు నమోదవుతున్నప్పటికీ, గోధుమల సేకరణ సజావుగా సాగుతోంది. ఇది ఆహార భద్రతకు ఊతమిస్తోంది. గ్రామీణ డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలలో అంకెల వృద్ధి నమోదయ్యింది. ఖరీఫ్ సీజన్‌కు మంచి అవకాశాలు, పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) పెరగడం, ప్రభుత్వం బడ్జెట్లో పెంచిన వ్య యం రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రా మీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి... 18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్ మినహా 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఎగుమతులు భేష్... తీవ్ర పోటీ, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్ ఎగుమతులు మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. ప్రొడక్ట్ లింక్డ్ స్కీమ్ (పీఎల్ఐ) మద్దతుతో భారత్ నుండి వస్త్ర, రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల పునరేకీకరణ, కొత్త మార్కెట్లకు అనుగుణంగా శుద్ధి చేసిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. -
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ►క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ►మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ►అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ►భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
కోవిడ్–19 తర్వాత భారత్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తర్వాత భారత్ ఎకానమీ మరింత శక్తివంతంగా మారిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. పారిశ్రామిక వేదిక– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాకన్నా ఈ వేగం రెట్టింపు ఉందని అన్నారు. మహమ్మారి కాలంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించిందని, దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసిందని అన్నారు. ఒప్పందాల సమర్థవంతమైన అమలు, జైలు సంస్కరణలు కేంద్రం తదుపరి సంస్కరణ ఎజెండాగా ఉండాలని పేర్కొన్నారు. -
2022–23లో భారత్ వృద్ధి 6.5 శాతమే!
వాషింగ్టన్: భారత్ ఎకానమీ 2022–23 వృద్ధి అంచనాలకు ప్రపంచబ్యాంక్ ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. జూన్‌లో వేసిన తొలి అంచనా 7.5 శాతాన్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలను దీనికి కారణంగా చూపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో దక్షిణ ఆసియా ఆర్థిక అంశాలపై విడుదలైన నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. అయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. మహమ్మారి సవాళ్ల నుంచి, తీవ్ర క్షీణత నుంచి ఎకానమీ బయటపడిందని ప్రశంసించారు. దక్షిణాసియాకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిలో కొన్ని... ►భారీ అంతర్జాతీయ రుణ భారాలు లేవు. అటువైపు నుంచి సవాళ్లు ఏమీ లేవు. పటిష్ట ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తోంది. ►సేవలు, సేవలు రంగాల ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మంచి మద్దతును ఇస్తున్నాయి. ►అంతర్జాతీయ ప్రతికూల అంశాలే వృద్ధి రేటు తాజా తగ్గింపునకు కారణం. ►ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ►డిజిటల్ ఆలోచనలన ఉపయోగించుకుని సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడంలో మిగిలిన ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. ►గోధుమల ఎగుమతిపై నిషేధం, బియ్యం ఎగుమతులపై అధిక టారిఫ్‌ల విధింపు వంటి ప్రభుత్వ చర్యలను సమర్థింలేం. స్వల్పకాలంలో అవి దేశీయంగా ఆహార భద్రతకు దారితీసినా, దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విధానాలు ప్రతికూలతకు దారితీయవచ్చు. ►కార్మిక మార్కెట్, ఎకానమీలో మరింతమంది ప్రజలను భాగస్వాములుగా చేయడం భారత్ తక్షణ అవసరం. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
కష్టకాలంలోనూ ఎగురుతున్న గుర్రాలు
కనీసం వందకోట్ల డాలర్ల విలువను సాధించగలిగిన స్టార్టప్ సంస్థలను యూనికార్న్‌లు అంటున్నారు. 2022 నాటికి భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవి ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ యూనికార్న్‌లను కలిగిన దేశం మనదే. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను వీటి అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ వ్యాప్తి గురించి అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. ఉక్రెయిన్‌లో సైనిక సంఘర్షణ, పెరుగుతున్న అంతర్జాతీయ వడ్డీరేట్లు అనే ద్వంద్వ తాకిడి నుంచి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థ మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ, ఒక రంగం మాత్రం శరవేగంగా పెరుగుతోంది. బాహ్య పరిణామాలకు ఈ రంగం ఏమాత్రం ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. ఆ రంగం ఏదో కాదు, యూనికార్న్‌లు అని పేరొందిన భారీ స్టార్టప్ సంస్థలు. ఈ సంవత్సరం భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. 2011లో దేశంలో తొలి స్టార్టప్ వెంచర్ యూనికార్న్‌గా మారి దశాబ్దం గడిచింది. ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత యూనికార్న్ సంస్థలు అధికంగా ఉన్న మూడో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఉమ్మడిగా చూస్తే ఈ వంద స్టార్టప్ సంస్థలు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి మొత్తం విలువ ఇప్పుడు 333 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువను మార్కెట్లో సాధించిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అని పిలుస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి వెంచర్లు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి పూర్వకాలపు పౌరాణిక ఒంటికొమ్ము రెక్కల గుర్రాల్లాగా వీటిని వర్ణించేవారు. కానీ ఇప్పుడు, అమెరికా 487 యూనికార్న్ సంస్థలనూ, చైనా 301 సంస్థలనూ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యూనికార్న్ అనే పదం డెకాకార్న్ వరకు విస్తరిస్తోంది. అంటే కనీసం 10 బిలియన్ డాలర్ల విలువ గల సంస్థలుగా ఇవి ఎదుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫ్లిప్‌కార్ట్, నైకా, బైజూస్, స్విగ్గీ వంటి కొన్ని స్టార్టప్ సంస్థలు 10 బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన వెంచర్లుగా నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2020 సంవత్సరం నుంచే యూనికార్న్ వెంచర్లు బాగా పెరుగుతూండటమే. మరో మాటలో చెప్పాలంటే, మహమ్మారి తర్వాతే ఇవి విస్తరిస్తున్నాయి. ఆ సంవత్సరం దేశంలో 11 యూనికార్న్ సంస్థలు ఆవిర్బవించాయి. 2021లో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 44. ఈ ఏడాది గత ఆరునెలల కాలంలో 16 ఏర్పడటం విశేషం. ‘ఇంక్42’ సంస్థ ప్రకారం, 2025 నాటికి దేశంలో 250 యూనికార్న్‌లు ఏర్పడతాయని అంచనా. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల యూనికార్న్‌లలో ఫండింగ్ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ, 2022లో కూడా ఇన్నోవేషన్, స్టార్టప్‌ల ఎకో–సిస్టమ్ ఇప్పటికీ వికాస దశలోనే సాగుతోంది. ఫండింగ్‌కి సంబంధించి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ అనేక స్టార్టప్‌లు ఈ సంవత్సరం కూడా యూనికార్న్ క్లబ్లో చేరనున్నాయి. మహమ్మారి కాలంలో ఆఫీసుకు నేరుగా వెళ్లి పనిచేసే పద్ధతి నుంచి, ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ప్రపంచం మారిపోయింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి... ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లవైపు సృజనాత్మక ఆవిష్కరణలను మళ్లించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లడంలో అవరోధాలు ఏర్పడటంతో ప్రజాజీవితంలో ఇంటర్నెట్ మరింత పెద్ద పాత్ర వహించే స్థాయికి పరిణమించింది. కాబట్టి రిటైల్ కొనుగోళ్లు చేయడం, ఆర్థిక లావాదేవీలను సాగించడం, బిజినెస్‌ను నిర్వహించడంతో పాటు విద్య సైతం ఆన్లైన్ యాక్టివిటీగా మారిపోయింది. పేటీఎం, మొబివిక్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీల ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్ వంటి తాజా స్టార్టప్‌లు దేశంలోని 2వ, 3వ శ్రేణి నగరాల్లో వేగంగా విస్తరించాయి. యూనికార్న్ ప్రపంచం విస్తరణకు మరొక కారణం సులభమైన ఫండింగ్. దేశంలో డిజిటల్ ఎకో సిస్టమ్ విస్తరణకు అపారమైన అవకాశం ఉంటుందని మదుపుదారులు గ్రహిస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువ స్థాయిలో, అంటే 41 శాతంగానే కొనసాగుతోంది. అంటే ఈ రంగంలో పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క. అయితే ఆన్లైన్ స్పేస్‌లో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది. వాట్సాప్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్న వారు సైతం ఫిజికల్ రిటైల్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారని తాజా డేటా చెబుతోంది. దేశంలోని 44 కోట్లమంది వాట్సాప్ యూజర్లలో 15 శాతంమంది మాత్రమే ఆన్లైన్లో కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే అయిదు లేదా పది సంవత్సరాల కాలంలో వెంచర్ కేపిటల్ ఫండ్స్ దీర్ఘకాలిక అంచనాల ప్రాతిపదికపై మదుపు పెట్టడానికి సిద్ధపడటం ఖాయం అని తేలుతోంది. గత సంవత్సరం నుంచి చైనాలో టెక్ కంపెనీలపై రెగ్యులేటరీ నిబంధనలను పెంచుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో వెంచర్ కేపిటలిస్టులు మన దేశంలోని పరిణామాలపై తాజాగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద చూస్తే, లాభదాయకమైన ఐడియాలపైనే మదుపుదారులు డబ్బు పెడతారన్నది నిజం. గత కొన్ని సంవత్సరాల్లో ప్రారంభమైన అనేక స్టార్టప్ సంస్థలు ఫిన్‌టెక్, ఈ–కామర్స్ లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ కేటగిరీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. కొన్ని సమస్యలను ఎంపిక చేయడం కష్టమే అవుతుంది గానీ, నైకా సంస్థ ఆన్లెన్ మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల విషయంలో గ్యాప్ ఉన్నట్లు కనుగొన్నది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మీషో సంస్థ కనుగొంది. దేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లను (33) కలిగి ఉన్న ఫిన్ టెక్ సంస్థలు రిటైల్ వినియోగదారులతోపాటు వ్యాపార సంస్థల డిజిటల్ చెల్లింపుల అవసరాలను కూడా పూరించడంలో అధిక కృషి చేస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్‌లలో ఉన్న ఖాళీలను పూరించడంలో సాయపడేందుకు ‘సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్’ స్టార్టప్‌లు ముందుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్ లేదా ఎడ్టెక్ వెంచర్లుగా పేరొందిన సంస్థలు బైజూస్ వంటి డెకాకార్న్‌ల వికాసానికి దారితీశాయి. మహమ్మారి కాలంలో ఆరోగ్య సంరక్షణ మరో ప్రాధాన్య రంగంగా ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల ఇన్నోవస్సెర్, ఫార్మియాసీ, క్యూర్‌ఫిట్, ప్రిస్టిన్ కేర్ వంటి శైశవదశలోని యూనికార్న్‌ల ఆవిర్భావానికి తావిచ్చాయి. యూనికార్న్‌లు ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయనడంలో సందేహమే లేదు. ప్రత్యేకించి ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను యూనికార్న్‌ల అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ అభివృద్ధి గురించి మరీ అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. కొన్ని యూనికార్న్‌లు హైరింగ్ రంగంలో అడుగుపెట్టాయి. అయితే మొత్తం ఉపాధిరంగంలో తమదైన పాత్ర పోషించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఇలాంటి వెంచర్లకు నిధులు లభ్యం కావడం లేదన్నది వాస్తవం. అదే సమయంలో, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, డెకాకార్న్‌ల వంటి వెంచర్లను దీర్ఘకాలిక దృష్టితోనే అంచనా వేయాలి. కాలం గడిచేకొద్దీ ఈ తరహా వెంచర్లు దేశాన్ని మరింత వేగంగా డిజిటల్ యుగంలోకి తీసుకెళతాయి. అంతే కాకుండా అంతిమంగా అసమానతలను తగ్గించడం వైపు దేశాన్ని నడిపిస్తాయి. అంతిమంగా, యూనికార్న్‌లను ఒంటరి ద్వీపాల్లాగా చూడకూడదు. దేశ వాణిజ్య వాతావరణంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే ఉత్ప్రేరకాలుగా ఇవి పనిచేస్తాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు వేటికవి విడివిడిగా ఉంటాయి కానీ సాంప్రదాయికమైన ఇటుకలు, ఫిరంగి తయారీ పరిశ్రమల్లో సైతం ఇవి సృజనాత్మకతను పెంచుతున్నాయి. ‘బిగ్ టెక్’ కంపెనీ విదేశాల్లోనూ స్టార్టప్‌ల నుంచే ఆవిర్భవించింది. ప్రపంచమంతటా ఇప్పుడు స్టార్టప్‌ల రాజ్యం నడుస్తోంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఫైనాన్షియల్ జర్నలిస్టు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)