
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్ సింగ్. ఆర్థికశాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేసినా, ఆర్‌బీఐ గవర్నర్(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
ప్రధాన ఆర్థిక సలహాదారుగా..
1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.
వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.
పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.
ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.
ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.
ఆర్‌బీఐ గవర్నర్‌గా..
1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.
బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.
అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్‌మెంట్: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.
ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.
రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.
ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్‌బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
ఆర్థిక మంత్రిగా..
1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.
సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.
ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.
విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.
పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం.