
భారత బ్యాంకింగ్ రంగంలో మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరమని ప్రముఖ ఆర్థికవేత్త, ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విరాల్.వి.ఆచార్య అన్నారు. భారత బ్యాంకింగ్ విధానాలను రూపొందించడంలో ఆర్థిక అవసరాలు, రాజకీయ అంశాలపై పరస్పర చర్చ జరగాలని చెప్పారు. ఐఐఎం బెంగళూరులో జరిగిన ఐఎంఆర్ డాక్టోరల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన్ పాల్గొని మాట్లాడారు.
‘దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం ఆర్థిక కారకాల ద్వారా మాత్రమే కాకుండా రాజకీయ వ్యవస్థ ద్వారా కూడా ప్రభావితమవుతోంది. కొన్నేళ్ల కొందట జరిగిన బ్యాంకుల జాతీయకరణ కేవలం ఆర్థిక సమ్మిళితం కోసమే కాకుండా రాజకీయ లక్ష్యాలను కూడా నెరవేర్చింది. జనాకర్షక వ్యయాలను సాధించడానికి ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ విధానం వల్ల మార్కెట్ ఆధారిత సంస్కరణలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా వ్యవస్థలు తేరుకుని సంస్కరణల దిశగా అడుగులు వేయాలి. డిజిటల్ ఫైనాన్స్ పెరుగుదల, బ్యాంకింగేతర రుణదాతల నుంచి నెలకొన్న పోటీ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. డిజిటల్ ఫైనాన్స్‌లో ఇండియా చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ, ముఖ్యంగా కోవిడ్ అనంతరం కార్పొరేట్ సంస్థల లాభాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక ప్రయోజనాలు తగ్గడానికి దారితీసింది’ అన్నారు.
ఇదీ చదవండి: రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
నిర్మాణాత్మక సంస్కరణలు..
దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే నిర్మాణాత్మక సంస్కరణల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ఆచార్య నొక్కి చెప్పారు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన సంస్కరణలు రావాలన్నారు. సంస్థలకు అనుకూలంగా ఉండే స్నేహపూర్వక సంస్కరణలకు బదులుగా మార్కెట్‌కు అనుకూలంగా ఉండే విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.