Viral Acharya
-
ఎన్డీఏ సర్కార్‌పై బాంబు పేల్చిన ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా 2018లో కేంద్రం, ఆర్బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం మేలని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు అడిగిని ఎన్డీఏ సర్కార్ ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి అప్డేట్ ప్రిల్యూడ్ బుక్‌లో దీనికి సంబంధి చాలా విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రికార్డు లాభాలు బదిలీ గత ప్రభుత్వాల హయాంలో ఆర్బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వంలోని క్రియేటివ్ మైండ్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రతీ ఏడాది ఆర్బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే 2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్ లోన్స్ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే సాధ్యమైందన్నారు. ఆర్బీఐ సెక్షన్ -7 వివాదం నిధుల బదిలీలో ఆర్బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్‌ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే ఆప్పటి ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒత్తిడి క్రమంలోనే పటేల్ రాజీనామా అని అంతా భావించారు. కాగా 2022లో రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. .2019లో ఆర్బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. -
ఆర్బీఐ ప్యానెల్ సూచనలు : రాజన్, ఆచార్య విమర్శలు
సాక్షి, ముంబై : దేశీయ బ్యాంకింగ్ రంగంలోకార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రమోటర్లు గైడ్ లైన్స్, కార్పొరేట్ సిస్టమ్ సమీక్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ నియమించిన అంతర్గత కమిటీ తాజాగా కీలక ప్రతిపాదను చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలోని కఠిన ఆంక్షలు సవరణలు చేయాలంటూ సూచించింది. తద్వారా కార్పొరేట్లకు మార్గం సుగమం చేసింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామిక సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు నిబంధనలు సడలించేలా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. ఫలితంగా టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ లాంటి పలు కార్పోరేట్ బిజినెస్ టైకూన్లు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ బ్యాంకింగ్ రంగంలో అనుమతించాలంటూ ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యుజి) సిఫారసు చేసింది. పదిహేనేళ్లలో ప్రైవేట్ బ్యాంక్‌ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలి. ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న పెద్దపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రైవేట్ బ్యాంక్‌లుగా మారేందుకు అవకాశం కల్పించాలి. కనీసం 10 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, రూ.50,000 కోట్లు.. అంతకు మించి ఆస్తులున్న ఎన్‌బీఎఫ్‌సీలకు అర్హత ఉండేలా నిబంధనలు అమలు చేయాలి. కొత్తగా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతమున్న రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలి. ప్రభుత్వ బ్యాంకుల పనితీరును మెరుగుపరచేందుకు అనేక చర్యలు, బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ సూచనలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువగా ఉండాలి మరోవైపు ఐడబ్ల్యుజీ సిఫారసులపై ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య విమర్శలు గుప్పించారు. పారిశ్రామిక వర్గాలను బ్యాంకింగ్‌లోకి అనుమతించకూడదని గట్టిగా వాదించారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వారు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు, ప్రశ్నలు లేకుండానే కార్పొరేట్ సులువుగా రుణాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. కొన్ని వ్యాపార సంస్థలలో ఆర్థిక, రాజకీయ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుంది. అక్రమాలు అధికార దుర్వనియోగం పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తులుపెరగడానికి క్రోనీయిజం కారణమని గుర్తుచేశారు. లైసెన్సులు న్యాయంగా కేటాయించినప్పటికీ, అవినీతికి అవకాశం ఏర్పడుతుందనీ, ఇప్పటికే ప్రారంభ మూలధనం ఉన్న పెద్ద వ్యాపార సంస్థలకు అదనపు ప్రయోజనాలు చేకూరతాయని, రాజన్, ఆచార్య అభిప్రాయపడ్డారు.సోమవారం విడుదల చేసిన ఇండియన్ బ్యాంక్స్: ఎ టైమ్ టు రిఫార్మ్ అనే పరిశోధనా పత్రంలో బ్యాంకింగ్ రంగ ప్రస్తుత యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదు, బ్యాంకింగ్ పరిశ్రమను సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక సేవల విభాగాన్ని మూసివేయడం, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తగదని పేర్కొన్నారు. -
వివాదాల ‘విరాళ్’... గుడ్‌బై!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాళ్ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉండడం గమనార్హం. ప్రభుత్వంతో పొసగకే ఆయన రాజీనామా చేశారన్న పుకార్లు షికారు చేయడం మరో విశేషం. బాధ్యతలు పూర్తవడానికి దాదాపు 9 నెలల ముందే వ్యక్తిగత కారణాలతో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినప్పుడూ, ఇదే విధమైన విశ్లేషణలు రావడం గమనార్హం. కాగా, ఉర్జిత్ పటేల్ రాజీనామా నాటినుంచే విరాళ్ ఆచార్య కూడా అదే బాటన పయనిస్తారన్న వార్తలు కొనసాగాయి. 45 సంవత్సరాల విరాళ్ ఆచార్య, ఆర్బీఐ గవర్నర్లలో అతి చిన్నవారు. మోదీ ప్రభుత్వం రెండవదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన తొలి రాజీనామా ఇది కావడం మరో విశేషం. ఆర్బీఐ ప్రకటన ఏమి చెప్పిందంటే.. ఆర్బీఐ సోమవారంనాడు విడుదల చేసిన ప్రకటనను చూస్తే, ‘‘అనివార్యమైన వ్యక్తిగత పర్యవసానాల వల్ల తాను జూలై 23 తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగలేనని కొద్ది వారాల క్రితం డాక్టర్ విరాళ్ ఆచార్య ఒక లేఖను సమర్పించారు’’ అని ఒక క్లుప్తమైన ప్రకటన వెలువడింది. డాక్టర్ ఆచార్య రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ఇక ముగ్గురు – ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు ఉంటారు. కేంద్రం ఏరికోరి... ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ విరాళ్ ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి నిబంధనలనూ తరచూ మార్చుతూ ఆర్బీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన డిప్యూటీ గవర్నర్ బాధ్యతలను చేపట్టారు. ద్రవ్యఅంశాల విభాగాన్ని ఆయన ఆర్బీఐలో పర్యవేక్షించారు. రాజీనామా అనంతరం విరాళ్ ఆచార్య ఏమిచేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రానున్నప్పటికీ, ఆయన తిరిగి ప్రొఫెసర్‌గానే వెళ్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. పాలసీపై విభేదాలు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాళ్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాకేష్ మోహన్ తరువాత... ‘ఫారిన్ ట్రైన్డ్’ ఎకనమిస్ట్‌గా రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసి బాధ్యత కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య. ఇంతక్రితం 2009 మే నెలలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది. జలాన్ కమిటీ నివేదిక నేపథ్యం... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల అదనపు నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రానికి బదలాయించాలన్న విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన ఆరుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మరో నెల రోజుల్లో సమర్పించనున్న నేపథ్యంలో విరాళ్ రాజీనామా మరో విశేషం. నిజానికి జూన్ చివరికల్లా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉన్నా, అది అసాధ్యమని వార్తలు వస్తున్నాయి. పలు అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వివాదాల్లో... స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాళ్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి. అందులో కొన్ని అంశాలు చూస్తే... ► గత ఏడాది అక్టోబర్‌లో ఆయన ఏడీ షరోఫ్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయ రూపకల్పన దీర్ఘకాలం దృష్టితో కాకుండా, స్వల్పకాల ప్రయోజనాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడుకుని ఉంటోందని పేర్కొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయన ఈ ప్రసంగంలో పేర్కొన్నారు. ► మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని తక్కువచేస్తే, అది క్యాపిటల్ మార్కెట్లలో విశ్వాస సంక్షోభాన్ని తీసుకువస్తుందని అన్నారు. అలాగే సెంట్రల్‌బ్యాంక్ సమర్థతపైనా ఆయా అంశాల ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ► మొండిబకాయిలకు సంబంధించి కొన్ని బ్యాంకులపై ప్రయోగించిన ‘దిద్దుబాటు చర్యల ప్రక్రియ’ (పీసీఏ)ను కూడా ఆయన పలు సందర్భాల్లో గట్టిగా సమర్థించారు. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య రాజీనామా
-
అడ్డగోలు రుణాల పాపం ఆర్బీఐదే
ముంబై: రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే పెను విపత్తు తప్పదంటూ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ అచార్య వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా స్పందించారు. 2008 – 2014 మధ్య కాలంలో బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్ బ్యాంక్ చోద్యం చూస్తూ కూర్చుందని వ్యాఖ్యానించారు. ఈ రుణాలే పెరిగి, పెద్దవై ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సంక్షోభానికి దారితీశాయని ఆక్షేపించారు. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం నిర్వహించిన ఇండియా లీడర్షిప్ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. విరాల్ ఆచార్య వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ, పరోక్షంగానే జైట్లీ కౌంటర్ ఇచ్చారు. ‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత 2008–2014 మధ్య కాలంలో చూస్తే.. ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా పటిష్టపర్చడానికి భారీగా రుణాలిచ్చేలా బ్యాంకులకు ఆదేశాలివ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోకుండా ఊరుకోవడంతో అవి విచక్షణారహితంగా రుణాలిచ్చాయి‘ అని జైట్లీ చెప్పారు. అప్పటి ప్రభుత్వ తీవ్ర ఒత్తిళ్ల కారణంగా బ్యాంకులు ఎడాపెడా రుణాలిచ్చేయడంతో.. సగటున 14 శాతంగా ఉండే రుణ వృద్ధి ఒకే ఏడాదిలో ఏకంగా 31 శాతానికి ఎగిసిందని పేర్కొన్నారు. మరోవైపు, తమ సర్కార్ ప్రవేశపెట్టిన సంస్కరణలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నట్లు జైట్లీ వివరించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య నాలుగేళ్లలో 6.8 కోట్లకు పెరిగిందన్నారు. ఈ ఏడాది 7.5–7.6 కోట్లకు చేరొచ్చని, దీంతో రెట్టింపయినట్లవుతుందని తెలిపారు. పాలనాపరమైన పారదర్శక సంస్కరణలతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. విరాల్ వ్యాఖ్యలతో ఆజ్యం.. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై విధించిన కఠిన ఆంక్షలను సడలించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌పై కేంద్రం ఒత్తిడి తెస్తోందన్న వార్తల నేపథ్యంలో గత శుక్రవారం సీసీ ష్రాఫ్ స్మారకోపన్యాసం సందర్భంగా విరాల్ ఆచార్య కేంద్రంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆయన చెప్పారు. స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వ సాధన కోసం రిజర్వ్ బ్యాంక్‌కు మరింత స్వయంప్రతిపత్తి అవసరమని, లేకపోతే విపత్తులు తప్పకపోవచ్చన్నారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని గౌరవించని ప్రభుత్వాలు ఏదో ఒకరోజున మార్కెట్ల ఆగ్రహం చవిచూడక తప్పదని, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు .. ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ అవి పశ్చా త్తాప పడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. స్వయంప్రతిపత్తికి విభేదాలే నిదర్శనం.. మోర్గాన్ స్టాన్లీ రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి గతంలో కన్నా ప్రస్తుతం మరింత పెరిగిందని అమెరికా బ్రోకరేజి సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత విభాగం రీసెర్చ్ హెడ్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో బాహాటంగా విభేదించేంతగా స్వేచ్ఛ ఉండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారాయన. ‘గతంలో కన్నా ఆర్బీఐ ప్రస్తుతం మరింత స్వతంత్రంగా ఉంది. విభేదాలు బయటికొచ్చి, మీడియాలో కూడా వస్తున్నాయంటే రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రత విషయంలో మునుపటి కన్నా పురోగతి ఉన్నట్లే భావించవచ్చు. ఆర్బీఐ ఉన్నతాధికారులు బాహాటంగా విమర్శించగలుగుతూ ఉండటమే సెంట్రల్ బ్యాంక్‌కు చాలా స్వతంత్రత ఉందనడానికి నిదర్శనం ‘ అని దేశాయ్ చెప్పారు. మార్కెట్లు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా స్పందిస్తాయని, దీర్ఘకాల దృష్టి కోణంతో ఆచార్య ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని దేశాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మార్కెట్లు ఇంకా డిస్కౌంట్ చేసుకోలేదని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ నుంచి ఇన్వెస్టర్లు తమ వ్యూహా లు అమలు చేయడం మొదలుపెట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడవచ్చన్న అభిప్రాయాలు కలిగిన పక్షంలో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. నిధుల కొరతపై ఎఫ్ఎస్డీసీ సమీక్ష నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత అంశాలను ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమీక్షించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, సెబీ చైర్మన్, ఐఆర్డీఏఐ.. పీఎఫ్ఆర్డీఏ తదితర నియంత్రణ సంస్థల చీఫ్‌లు పాల్గొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల నిధుల కొరత అంతా అనుకుంటున్నంత తీవ్ర స్థాయిలో ఏమీ లేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. అయినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఆర్థిక సంక్షోభం ఇతర రంగాలకు కూడా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐకి ప్రభుత్వం సూచించినట్లు వివరించాయి. ఆర్బీఐకి స్వయంప్రతిపత్తి విషయంలో విరాల్ ఆచార్య ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో జరిగిన ఎఫ్ఎస్డీసీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఎఫ్ఎస్డీసీ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్‌తో పాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు హాజరవడం గమనార్హం. -
‘రుణ’ ఫలాలు అందరికీ అందాలి
ముంబై: సమాజంలోని అన్ని వర్గాలకూ సకాలంలో తగిన రుణ లభ్యత అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ విరాల్ వీ ఆచార్య స్పష్టం చేశారు. ఈ దిశలో దోహదపడే విధంగా ‘‘పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ’’ (పీసీఆర్) పేరుతో ఒక ప్రత్యేక చట్టం అవసరమని కూడా ఆయన ప్రతిపాదించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రుణ నిష్పత్తి పెరుగుదల ప్రాధాన్యతను విశ్లేషించారు. ఫలప్రదమయ్యే రీతిన వ్యవస్థీకృతంగా సమాజంలోని అన్ని వర్గాలకూ తగిన, సకాలంలో రుణ లభ్యత వల్ల బ్యాంకింగ్ మొండి బకాయిలు తగ్గడమే కాకుండా, దేశ ఆర్థిక అభివృద్ధీ సాధ్యమవుతుందని అన్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో అసమానత్వ సమస్య పరిష్కారమూ జరుగుతుందన్నారు. రుణ గ్రహీతల చరిత్ర మొత్తాన్ని బ్యాంకింగ్ పొందగలుగుతుందని అన్నారు. ఫిక్కీ–ఐబీఏ సోమవారం ఇక్కడ నిర్వహించిన జాతీయ బ్యాంకింగ్ సదస్సులో స్కైప్ కాల్ ద్వారా డిప్యూటీ గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...భారత్‌లో క్రెడిట్ టూ జీడీపీ రేషియో (స్థూల దేశీయోత్పత్తిలో రుణ వాటా) 55.7 శాతం మాత్రమే. ఆర్థిక అవకాశాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) 2017 నాల్గవ త్రైమాసిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. చైనా విషయంలో ఈ నిష్పత్తి 208.7 శాతం. బ్రిటన్‌లో 170.5 శాతం. అమెరికాలో 152.2 శాతం. నార్వేలో అత్యధికంగా 245.6 శాతంగా ఉంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మార్కెట్ల నుంచి కార్పొరేట్ బాండ్లు లేదా డెబెంచర్లు, విదేశీ వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్, మసాలా బాండ్స్, ఇంటర్ కార్పొరేట్ రుణాలు ఇలా ఎన్నో మార్గాల ద్వారా రుణాలను పొందడం జరుగుతోంది. అయితే ఈ సమాచారం అంతా పొందడానికి ఏకైన డేటా కేంద్రం ఏదీ లేదు. ఈ లోటును పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ తీరుస్తుంది. కన్సార్షియం లెండింగ్ తగ్గాలి: ఎస్బీఐ చైర్మన్ కన్సార్షియం లెండింగ్పై (కొన్ని బ్యాంకులు కలసి ఉమ్మడిగా జారీ చేసే రుణం) ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఫిక్కీ–ఐబీఏ సదస్సులో అభిప్రాయపడ్డారు. దీనిపై ఎక్కువగా ఆధారపడడం ఎన్పీఏలు పెరిగేందుకు దారితీసిందని, రుణ మదింపుల జాప్యానికి కారణమైందని చెప్పారాయన. చిన్న రుణాలకు ఎక్కువ బ్యాంకులు జతకట్టడం అర్థవంతం కాబోదన్న ఆయన, కన్సార్షియం సైజును పరిమితం చేయాల్సి ఉందన్నారు. రూ.500 కోట్ల రుణం వరకూ ఎస్బీఐ మరో బ్యాంకుతో జతకట్టబోదని (కన్సార్షియం) రజనీష్ కుమార్ చెప్పారు. -
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్
ముంబాయి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదోన్నతి పొందడంతో, అప్పటినుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ గవర్నర్ పోస్టులోకి కొత్త వ్యక్తిని ప్రభుత్వం ఎంపిక చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా చేస్తున్న బిరాల్ వీ.ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఉర్జిత్ పటేల్ డిప్యూటీ గవర్నర్ స్థానంలోకి బిరాల్ వీ. ఆచార్య వచ్చేశారు. ఆర్బీఐకి మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. నలుగురిలో ఒకరిగా ఆచార్యను ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. అయితే ఆచార్యకు ఏ పోర్ట్‌ఫోలియో ఇస్తున్నారో ప్రభుత్వం తెలుపలేదు. ఉర్జిత్ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నంతవరకు ఆర్బీఐకి ఎంతో కీలకమైన ద్రవ్యపరపతి విధానానికి బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మరో డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పర్యవేక్షిస్తున్నారు. బ్యాంక్స్ రెగ్యులేషన్, కార్పొరేట్ ఫైనాన్స్, క్రెడిట్ రిస్క్, అసెట్ ప్రైసింగ్లపై ఆచార్య ఎక్కువగా రీసెర్చ్‌లు చేస్తూ ఉంటారు.