అడ్డగోలు రుణాల పాపం ఆర్‌బీఐదే | India's finance minister Arun Jaitley criticises RBI for lending excess | Sakshi
Sakshi News home page

అడ్డగోలు రుణాల పాపం ఆర్‌బీఐదే

Published Wed, Oct 31 2018 12:21 AM | Last Updated on Wed, Oct 31 2018 8:24 AM

India's finance minister Arun Jaitley criticises RBI for lending excess - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఆర్‌బీఐ  స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే పెను విపత్తు తప్పదంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ అచార్య వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఘాటుగా స్పందించారు. 2008 – 2014 మధ్య కాలంలో బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్‌ బ్యాంక్‌ చోద్యం చూస్తూ కూర్చుందని వ్యాఖ్యానించారు. ఈ రుణాలే పెరిగి, పెద్దవై ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో మొండిబాకీల సంక్షోభానికి దారితీశాయని ఆక్షేపించారు.

అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం నిర్వహించిన ఇండియా లీడర్‌షిప్‌ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. విరాల్‌ ఆచార్య వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ, పరోక్షంగానే జైట్లీ కౌంటర్‌ ఇచ్చారు. ‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత 2008–2014 మధ్య కాలంలో చూస్తే.. ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా పటిష్టపర్చడానికి భారీగా రుణాలిచ్చేలా బ్యాంకులకు ఆదేశాలివ్వడం జరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ పట్టించుకోకుండా ఊరుకోవడంతో అవి విచక్షణారహితంగా రుణాలిచ్చాయి‘ అని జైట్లీ చెప్పారు.

అప్పటి ప్రభుత్వ తీవ్ర ఒత్తిళ్ల కారణంగా బ్యాంకులు ఎడాపెడా రుణాలిచ్చేయడంతో.. సగటున 14 శాతంగా ఉండే రుణ వృద్ధి ఒకే ఏడాదిలో ఏకంగా 31 శాతానికి ఎగిసిందని పేర్కొన్నారు. మరోవైపు, తమ సర్కార్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నట్లు జైట్లీ వివరించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య నాలుగేళ్లలో 6.8 కోట్లకు పెరిగిందన్నారు. ఈ ఏడాది 7.5–7.6 కోట్లకు చేరొచ్చని, దీంతో రెట్టింపయినట్లవుతుందని తెలిపారు. పాలనాపరమైన పారదర్శక సంస్కరణలతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు.

విరాల్‌ వ్యాఖ్యలతో ఆజ్యం..
మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై విధించిన కఠిన ఆంక్షలను సడలించాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌పై కేంద్రం ఒత్తిడి తెస్తోందన్న వార్తల నేపథ్యంలో గత శుక్రవారం సీసీ ష్రాఫ్‌ స్మారకోపన్యాసం సందర్భంగా విరాల్‌ ఆచార్య కేంద్రంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆయన చెప్పారు.

స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వ సాధన కోసం రిజర్వ్‌ బ్యాంక్‌కు మరింత స్వయంప్రతిపత్తి అవసరమని, లేకపోతే విపత్తులు తప్పకపోవచ్చన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ స్వయం ప్రతిపత్తిని గౌరవించని ప్రభుత్వాలు ఏదో ఒకరోజున మార్కెట్ల ఆగ్రహం చవిచూడక తప్పదని, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు .. ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ అవి పశ్చా త్తాప పడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.

స్వయంప్రతిపత్తికి విభేదాలే నిదర్శనం.. మోర్గాన్‌ స్టాన్లీ
రిజర్వ్‌ బ్యాంక్‌ స్వయం ప్రతిపత్తి గతంలో కన్నా ప్రస్తుతం మరింత పెరిగిందని అమెరికా బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ భారత విభాగం రీసెర్చ్‌ హెడ్‌ రిధమ్‌ దేశాయ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో బాహాటంగా విభేదించేంతగా స్వేచ్ఛ ఉండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారాయన. ‘గతంలో కన్నా ఆర్‌బీఐ ప్రస్తుతం మరింత స్వతంత్రంగా ఉంది. విభేదాలు బయటికొచ్చి, మీడియాలో కూడా వస్తున్నాయంటే రిజర్వ్‌ బ్యాంక్‌ స్వతంత్రత విషయంలో మునుపటి కన్నా పురోగతి ఉన్నట్లే భావించవచ్చు. ఆర్‌బీఐ ఉన్నతాధికారులు బాహాటంగా విమర్శించగలుగుతూ ఉండటమే సెంట్రల్‌ బ్యాంక్‌కు చాలా స్వతంత్రత ఉందనడానికి నిదర్శనం ‘ అని దేశాయ్‌ చెప్పారు.

మార్కెట్లు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా స్పందిస్తాయని, దీర్ఘకాల దృష్టి కోణంతో ఆచార్య ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని దేశాయ్‌ చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మార్కెట్లు ఇంకా డిస్కౌంట్‌ చేసుకోలేదని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్‌ నుంచి ఇన్వెస్టర్లు తమ వ్యూహా లు అమలు చేయడం మొదలుపెట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడవచ్చన్న అభిప్రాయాలు కలిగిన పక్షంలో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు.

నిధుల కొరతపై ఎఫ్‌ఎస్‌డీసీ సమీక్ష
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత అంశాలను ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమీక్షించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్, సెబీ చైర్మన్, ఐఆర్‌డీఏఐ.. పీఎఫ్‌ఆర్‌డీఏ తదితర నియంత్రణ సంస్థల చీఫ్‌లు పాల్గొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల నిధుల కొరత అంతా అనుకుంటున్నంత తీవ్ర స్థాయిలో ఏమీ లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు. 

అయినప్పటికీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆర్థిక సంక్షోభం ఇతర రంగాలకు కూడా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం సూచించినట్లు వివరించాయి. ఆర్‌బీఐకి స్వయంప్రతిపత్తి విషయంలో విరాల్‌ ఆచార్య ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో జరిగిన ఎఫ్‌ఎస్‌డీసీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఎఫ్‌ఎస్‌డీసీ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు హాజరవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement