కేంద్రానికి ఆర్‌బీఐ 28 వేల కోట్లు! | RBI to pay Rs 28000 crore as interim dividend to government | Sakshi
Sakshi News home page

కేంద్రానికి ఆర్‌బీఐ 28 వేల కోట్లు!

Published Tue, Feb 19 2019 6:03 AM | Last Updated on Tue, Feb 19 2019 6:03 AM

RBI to pay Rs 28000 crore as interim dividend to government - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి) కేంద్రం ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) ఇబ్బంది నుంచి కొంతమేర బయటపడే కీలక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్‌బీఐ బోర్డ్‌ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. క్లుప్తంగా వివరాలివీ...

► ఆర్‌బీఐ జూలై – జూన్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. దీనిప్రకారం 2018 జూలై నుంచి 2019 జూన్‌ నెలాఖరు వరకూ ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది.  
     2018 ఆగస్టులో (తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిధిలోనికి వచ్చే) ఆర్‌బీఐ ఒక ప్రకటన చేస్తూ, 2017–18కి సంబంధించి కేంద్రానికి రూ.50,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 40 వేల కోట్లు మిగులు నిధులుకాగా, 10 వేల కోట్లు మధ్యంతర డివిడెండ్‌.  

► ఇక తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  (2018 జూలై–2019 జూన్‌) సంబంధించి  రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఇస్తున్నట్లు తాజాగా సోమవారం పేర్కొంది.  
     
► దీనితో కేంద్రానికి సంబంధించినంతవరకూ ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్‌–2019 మార్చి) ఆర్‌బీఐ నుంచి మొత్తం రూ.78,000 కోట్లు అందినట్లవుతోంది.  

    ► ఇలా మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్‌బీఐ ఇవ్వడం ఇది వరుసగా రెండవ సంవత్సరం. 2017–18లో ప్రభుత్వానికి ఆర్‌బీఐ నుంచి అందిన మొత్తం డివిడెండ్‌ రూ.30,663 కోట్లు.  
     
► ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2018 జూలై–2019 జూన్‌) 2018 డిసెంబర్‌కి 6 నెలలు పూర్తయ్యింది. పరిమిత ఆడిట్‌ సమీక్ష, అందుబాటులో ఉన్న మిగులు నిధులు (ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌) వంటి అంశాల ప్రాతిపదికన కేంద్రానికి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని ఆర్‌బీఐ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది... అని సెంట్రల్‌ బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటన ఒకటి తెలిపింది.   

► 1934 ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 47 కింద కేంద్రానికి ఆర్‌బీఐ తన మిగులు నిధులను అందిస్తోంది. మొండిబకాయిలు, మొండిబకాయిలుగా మారేందుకు అవకాశమున్న బకాయిలకు కేటాయింపులు, సిబ్బంది, పదవీ విమరణ నిధికి వాటా, ఇతర కేటాయింపులుపోను మిగిలిన లాభాలను కేంద్రానికి ఆర్‌బీఐ బదలాయించాలని ఈ సెక్షన్‌ పేర్కొంటోంది.   


ద్రవ్యలోటు... వివాదాల నేపథ్యం...
2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్‌ లేదా మిగులుగా రూ.82,911.56 కోట్లను పొందాలని బడ్జెట్‌ నిర్దేశించింది. ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో కేంద్రానికి ఇదొక మార్గం. 2018–19  ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని సంబంధిత వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్‌ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట.

దీనితో మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలను 3.3 శాతంకాకుండా, 3.4 శాతానికి కేంద్రం పెంచింది. అయితే  ద్రవ్యలోటును 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రం పేర్కొంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి.

నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్‌ 10వ తేదీన   వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు.  ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.  ఇందుకు అనుగుణంగా జలాన్‌ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి.

వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్‌ కమిటీ మాత్రం దీనిని 18 శాతంగా పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం మిగులు నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

మెగా బ్యాంకులు కావాలి: జైట్లీ
ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాల్లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు, తత్సబంధ ఫలితాలను ప్రస్తావించారు. భారత్‌లో బ్యాంకుల సంఖ్య తగ్గాలనీ, మెగా బ్యాంకులు ఏర్పాటవ్వాలని ఆర్థికమంత్రి సూచించారు. తద్వారా ఈ రంగం దేశాభివృద్ధిలో మరింత కీలకపాత్ర పోషించగలుగుతుందన్నారు. ఎస్‌బీఐలో భారతీయ మహిళాబ్యాంక్‌ సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీనాన్ని జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇదే సానుకూల అనుభవంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంక్, విజయాబ్యాంక్‌ విలీన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ బ్యాంకుల విలీనంతో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 18కి తగ్గుతోంది.

రేటు కోతపై బ్యాంకర్లతో 21న దాస్‌ భేటీ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్‌ చీఫ్‌లతో సమావేశం కానున్నారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బ్యాంకర్లు బదలాయించడంపై ఈ సమావేశంలో దాస్‌ దృష్టి సారించనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్‌బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ఆర్‌బీఐ గవర్నర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘రేట్ల కోత ప్రయోజనం బదలాయింపు చాలా ముఖ్యమైన అంశం.

ఇదే విషయాన్ని పాలసీ సమీక్ష ప్రకటన సందర్భంగా చెప్పాం. 21న కూడా ఇదే అంశంపై దృష్టి సారించనున్నాం’’ అని తెలిపారు. లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.25 కోట్ల వరకూ రుణంపై ప్రకటించిన పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని దాస్‌ ప్రస్తావిస్తూ, ఇక ఈ పథకం అమలు బ్యాంకుల పరిధిలో ఉందని అన్నారు. కొటక్‌ మహీంద్రా బ్యాంక్, యస్‌బ్యాంకులపై రెగ్యులేటరీ చర్యల గురించి అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానం ఇస్తూ,  నియంత్రణా నిబంధనల పాటింపు విషయంలో తగిన చర్యలన్నింటినీ ఆర్‌బీఐ తీసుకుంటుందన్నారు. రుణ వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారు.   

జవాన్లకు నివాళులు
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తూ, ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement