న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఉర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం కోరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలోను, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలోనూ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల రాజీనామాలను జైట్లీ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో నెలకొన్న నిధుల కొరత (లిక్విడిటీ సమస్య), ఇతర అంశాలను ఆర్‌బీఐ పరిష్కరించాలని మాత్రం తాము కోరామని చెప్పారు. దాన్ని సమర్థించుకున్నారు కూడా. ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఈ నెల 11న రాజీనామా చేయటం తెలిసిందే. ప్రభుత్వ ఒత్తిడులే దీనికి దారితీసినట్టు ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తల నుంచి మోదీ సర్కారు విమర్శలను కూడా ఎదుర్కొంది. దీనిపై ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ స్పందించారు.
ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్న పలు అంశాలపై చర్చ కోసం ఆర్‌బీఐ గవర్నర్‌కు కేంద్రం ఆదేశించే నిబంధనను ప్రభుత్వం ఉపయోగించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఆ తర్వాత రెండు బోర్డు సమావేశాలూ సుహృద్భావపూర్వకంగా జరిగాయి. మూడు నాలుగు అంశాలపై నిర్ణయం జరిగింది. కొన్నింటిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఆర్‌బీఐ వద్దనున్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో కొంత మేర తగ్గించుకునే విషయాన్ని నిపుణుల కమిటీ మరికొన్ని రోజుల్లో తేల్చనుంది’’ అని జైట్లీ వివరించారు. ఈ అంశాలను పరిష్కరించాలని కోర డం ఆర్‌బీఐ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకోవడంగా పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఆర్‌బీఐ వద్దే అధిక నిధులు
‘‘ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు సెంట్రల్ బ్యాంకులు స్థూల ఆస్తుల్లో 8 శాతాన్నే రిజర్వ్‌లుగా అమలు చేస్తున్నాయి. సంప్రదాయ దేశాల్లో ఇది 13– 14 శాతంగా ఉంది. కానీ, ఆర్‌బీఐ మాత్రం 28 శాతాన్ని రిజర్వ్‌లుగా కొనసాగిస్తోంది. 2013లో రూ.1.4 లక్షల కోట్లను ఆర్‌బీఐ అదనంగా ఇవ్వాలని నాటి ప్రభుత్వం కోరింది. కానీ, దీన్ని ఆర్‌బీఐపై స్వారీ చేయడమని ఎవరూ మాట్లాడలేదు’’ అని జైట్లీ గుర్తుచేశారు. ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులను విడుదల చేస్తే వాటితో ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయంతోపాటు, పేద ప్రజల సంక్షేమ పథకాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు. అంతేకానీ, ఈ నిధులు ద్రవ్యలోటు భర్తీకి, ప్రభుత్వ ఖర్చులకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్లుగా పనిచేసిన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్ ఇద్దరితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని, పదవుల నుంచి తప్పుకున్న తర్వాత కూడా వారితో అవే స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయని జైట్లీ చెప్పారు.
ఐబీసీ, పరిష్కార పథకాల విలీనం తర్వాత
రుణ భారంతో ఉన్న కంపెనీల విషయంలో పరిష్కారం కోసం అనుసరిస్తున్న దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ), ఇతర పరిష్కార పథకాలను ఒక్కటి చేయడాన్ని భవిష్యత్తులో పరిశీలిస్తామని జెట్లీ చెప్పారు. ‘‘పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కంపెనీలు ఎన్‌సీఎల్‌టీ ముందుకొస్తున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ రద్దీ తగ్గి.. వ్యాపారాలు సాధారణ స్థితికి వస్తే అప్పుడు పునరాలోచిస్తాం. నిజాయతీతో కూడిన రుణదాత, రుణ గ్రహీత అనుబంధం ఐబీసీ కారణంగా ఎర్పడాల్సి ఉంది. అప్పుడే ఐబీసీ, ఇతర పథకాలను ఒక్కటి చేయడమన్న పరిస్థితి ఏదురవుతుంది’’ అని ఆర్థిక మంత్రి వివరించారు. రుణ బకాయిల పరిష్కారం, పునరుద్ధరణకు సంబంధించి ఆర్‌బీఐ పథకాలతో పెద్దగా ఫలితాలు రాలేదన్నారు.
ఆర్‌బీఐ అందరితో కలిసే పనిచేయాలి...
నియంత్రణ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ.. ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా పనిచేయడం కుదరదని, అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా ఆర్‌బీఐని ఉద్దేశించి జైట్లీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన లిక్విడిటీ మొదలుకుని రుణ వితరణ దాకా పలు విషయాల్లో ఆర్‌బీఐని చర్చలకు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పారాయన. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య సంబంధాలెప్పుడూ దెబ్బతినలేదని, ప్రధాని నరేంద్ర మోదీ సహా అన్ని స్థాయిల్లోనూ సమావేశాలు సామరస్యంగానే సాగేవని తెలియజేశారు.
నిర్దిష్టంగా ఆర్‌బీఐని ప్రస్తావించకుండా .. నియంత్రణ సంస్థలన్నీ సంబంధిత వర్గాలందరితో చర్చించాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే మార్కెట్ మనోభావాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచి సంక్షోభంలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు వంటి పరిశ్రమ వర్గాలను కలిసేందుకు ఉర్జిత్ పటేల్ నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్‌బీఐని దారికి తెచ్చుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ ప్రయోగించని ఆర్‌బీఐ చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 7ని కూడా మోదీ సర్కార్ ప్రయోగించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment