ఆర్థికాంశాల్లో ఇంత అపరిపక్వతా! | Prem Shankar Jha Guest Columns On Government And RBI Issue | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 1:11 AM | Last Updated on Fri, Nov 2 2018 1:11 AM

Prem Shankar Jha Guest Columns On Government And RBI Issue - Sakshi

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ

ఆర్బీఐ పునాదులే కదిలిపోయే ప్రమాదం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కేంద్రం ఇంత అపరిపక్వ దృష్టితో అడ్డుకోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రొఫెషనలిజమూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానపరమైన ఆదేశాలకు అనుగుణంగానే డబ్బు చలామణీ, వడ్డీరేట్లను నిర్వహించాల్సి ఉందని ఆర్బీఐకి స్పష్టం చేయడమూ మాత్రమే. ఇవి మాత్రమే పారిశ్రామిక, ఉపాధి పెరుగుదలకు వీలు కల్పిస్తాయి. ఆర్థికాంశాల్లో అపరిపక్వత దేశానికే హానికరం.

దేశీయ పారిశ్రామిక ప్రగతి 2010–11లో 8.2% నుంచి 2011–12 నాటికి అంటే ఒక్క ఏడాదిలోపే 2.8%నికి దిగజారిపోయినప్పటి నుంచి, ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయాలపై చివరిమాట ఎవరిదై ఉండాలి అనే అంశంపై భారతీయ రిజర్వ్‌ బ్యాంకుకు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు మధ్య గిల్లికజ్జాలు సాగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 2010లో ఆర్బీఐ దేశ ఆర్థిక వ్యవస్థపై విధించిన అధిక వడ్డీరేటు విధానంలో సడలింపు చేయడం వైపుగా 2012 నుంచి అటు పరిశ్రమా ఇటు ప్రభుత్వం ప్రయత్నిస్తూ వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై అలాంటి సడలింపువల్ల కలిగే ప్రభావాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పరిశ్రమా, ప్రభుత్వమూ తమ వైఖరిని నేటివరకూ సమర్థించుకుంటూ వస్తున్నాయి. 

గతవారం ఢిల్లీలో ఎ.డి. ష్రాఫ్‌ స్మారకోపన్యాసంలో ప్రసంగించిన సందర్భంగా డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య..  ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాలను కలిపి తీవ్రంగా హెచ్చరించడం ద్వారా ఆర్బీఐకీ, కేంద్రప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలకు మధ్య సాగుతున్న దోబూచులాట ముసుగు వీడి బయటపడినట్లయింది. ’ఆర్బీఐకి తన విధులను నిర్వహించడంలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ఇవ్వకపోతే, దేశీయ పరిశ్రమలూ, కేంద్రప్రభుత్వం కూడా ద్రవ్యమార్కెట్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనీ, అది ఆర్థిక వ్యవస్థను దహించక మానదనీ, ముఖ్యమైన రెగ్యులేటరీ సంస్థను చిన్నచూపు చూస్తే ఏదో ఒక రోజు అందరూ విచారించక తప్పని పరి స్థితి కలుగుతుంద’ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ తేల్చి చెప్పారు. 

దేశ పాలకవ్యవస్థపై, దేశీయ పరిశ్రమపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎందుకిలా తిరుగుబాటు చేశారో నాలుగురోజుల తర్వాత తేటతెల్లమైంది. ఆర్బీఐ చట్టంలోని 7వ సెక్షన్‌లోని సంప్రదింపుల విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకుకు నేరుగా ఆదేశాలనిచ్చేందుకు అవకాశముంది. ఇంతవరకు అమలు కాని ఈ సెక్షన్‌ని ఇప్పుడు ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనం పేరిట ఆర్బీఐకి నేరుగా ఆదేశాలు ఇవ్వాలని తలపెట్టింది. ఇలాంటి ఆదేశాలను ఆర్బీఐ తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌తో సంప్రదిం పుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐని ఎప్పటికప్పుడు ఆదేశించవచ్చు అని సెక్షన్‌ 7 స్పష్టం చేస్తోంది.

అయితే సి. రంగరాజన్, బిమల్‌ జలాన్‌లు 1992 నుంచి 2003 వరకు ఆర్బీఐ గవర్నర్లుగా ఉన్న కాలంలో సెక్షన్‌ 7తో పనిలేకుం డానే నాటి కేంద్రప్రభుత్వాలు అలాంటి ఆదేశాలు చేస్తూవచ్చాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అప్పట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తోనే ఆర్బీఐ స్వతంత్రవైఖరిపై విభేదించారు కూడా. 2008 డిసెం బర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విరుచుకుపడిన నేపథ్యంలో విధానపరమైన వడ్డీరేట్లను తగ్గించాలని, పరపతి నియంత్రణలను సడలించాలని మన్మోహన్‌ సింగ్‌ దాదాపుగా ఆర్బీఐని ఆదేశించారు. ఈరోజు మోదీ ప్రభుత్వం ఇంతవరకు అరుదుగా ఉపయోగించిన సెక్షన్‌ 7ని అమలు చేయాలని తలపెట్టడం అత్యంత అరుదైన ఘటన. ఆర్బీఐకి వ్యతిరేకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వాగ్వివాదం ద్వారా ప్రభుత్వ వైఖరి ఇప్పటికే తేటతెల్లమై తీవ్ర చర్చలకు దారితీసింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని ద్రవ్య సంక్షోభాన్ని చవి చూస్తున్న తరుణంలో సెక్షన్‌ 7 అమలుకు కేంద్రం పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశ్‌ జాగరణ్‌ మంచ్‌కి చెందిన ఎస్‌ గురుమూర్తి (ఈ ఆగస్టులో తనను ఆర్బీఐ తాత్కాలిక బోర్డ్‌ డైరెక్టర్‌గా నియమించారు), విదేశీమారక ద్రవ్య సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ అట్టిపెట్టుకున్న కొన్ని ద్రవ్య నిల్వలను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాల్సిందిగా చేసిన సూచనతో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య నడుస్తున్న అంతర్గత పోరు బహిరంగమైంది. గురుమూర్తి సూచనను విస్మరించి వదిలేయకుండా విరాళ్‌ 2010లో అర్జెంటైనాలో సంభవించిన ఆర్థిక సంక్షోభంతో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ తీరును వర్ణించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ సందర్భంగా విరాళ్‌ ఆచార్య తన ప్రసంగంలో శ్రోతలకు చెప్పని విషయం ఒకటుంది. అంతకు ముందు వారంలో ఆర్బీఐ బోర్డు నిర్వహిం చిన సుదీర్ఘ సమావేశంలో గురుమూర్తి తన ప్రతిపాదనను చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య సంక్షోభానికి సాహసోపేతమైన పరిష్కారంగా గురుమూర్తి ఆర్బీఐ నిల్వలలో కొంత భాగాన్ని ప్రభుత్వ ఖజానాలోకి మళ్లించాలని సూచించారు. ఇప్పటికే ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తాత్కాలిక రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుని రూ. 1,30,000 కోట్ల రుణాలను తీసుకున్నాయి.

ఇంత భారీ రుణం కూడా ఏమూలకూ సరి పోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్బీఐ తాత్కాలిక బోర్డు సభ్యులు చాలామంది రుణాలపై ఆర్బీఐ నియంత్రణలను సడలించాలని కోరారు. పైగా నిర్దిష్ట దిద్దుబాటు చర్యలో భాగంగా, మొండి బకాయిల సమస్యను తేల్చివేసే ఉద్దేశంతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిట్లను ఆర్బీఐ అట్టిపెట్టుకోవడాన్ని కూడా సడలించాలని వీరు కోరారు. అయితే ఆర్బీఐ వీరి సూచనలకు తలొగ్గలేదు. అలాగని ద్రవ్య సంక్షోభాన్ని ఎలా సడలించాలనే విషయానికి సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలను ఆర్బీఐ ప్రకటించలేదు.

కేంద్రప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని విరాళ్‌ ఆచార్య మరొక స్థాయికి తీసుకెళ్లారు. ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించే స్థాయిలో ఆయన ప్రసంగం సాగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథాన్ని కలిగి ఉంటాయని, అందుకే తాము నిరోధించలేని జనాకర్షక రాజకీయాల ఒత్తిళ్లబారిన పడుతుంటాయని విమర్శించారు. అందుకే ప్రత్యేక జ్ఞానం అవసరమైన విధు లను నిర్వహించే విషయంలో ప్రభుత్వాలను విశ్వసించలేమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు జనాకర్షక ఒత్తిళ్లకులోనై దీర్ఘకాలిక దృక్పథాన్ని విడనాడటమే దీనికి కారణమనేశారు. కొన్ని విధుల నిర్వహణను ప్రజాస్వామ్య వ్యవస్థకు అతీతంగా పనిచేసే నిపుణులతో కూడిన ప్రత్యేక సంస్థలకు మాత్రమే కట్టబెట్టాల్సి ఉంటుంది. దేశ ద్రవ్యోల్బణాన్ని నివారిం చడం, మారకపు రేటు, డబ్బు చలామణి వంటి ప్రత్యేక విధులను కూడా పూర్తిగా ఆర్బీఐకే అప్పగిం చాలి. ఆర్బీఐ ఇలాంటి విధులను నిర్వర్తించాలంటే దానికి స్వతంత్రతను కట్టబెట్టడం తప్పనిసరి అన్నది విరాళ్‌ అభిప్రాయం.

విరాళ్‌ ఆచార్య ప్రసంగం ఒక విషయంలో మాత్రం సరైందేనని చెప్పాలి. ఆధునిక యుద్ధతంత్రంలో పోరాడటం అత్యంత ప్రత్యేకమైన విధి. యుద్ధసన్నద్దత అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి తాత్కాలిక రాజకీయాలు తీసుకొచ్చే ఒత్తిళ్లనుంచి దానికి రక్షణ కల్పించాలి. ఆధునిక సమాజంలో హై స్పీడ్‌ రైళ్ల వ్యవస్థను నడపడం కూడా ప్రత్యేకమైన విధిగానే ఉంటుంది. అలాగని, ఒక సైన్యాధిపతికి, జాయింట్‌ సర్వీసెస్‌ చైర్మన్‌కి సుప్రీం కోర్టు జడ్జి లేక ఎన్నికల కమిషనర్‌కు ఉండే రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వాలని ఎవరూ సూచించలేరు. ఈ సందర్భంగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌ ఆర్‌ ఖాన్‌ మాట్లాడుతూ స్వతంత్రత అనేది స్వయంప్రతిపత్తి లాంటిది కాదని చెప్పారు. అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజాన్ని సాధించాలంటే, పాలసీలో అనూహ్య మార్పులు లేక ఆ ప్రక్రియలో అనవసర జోక్యాలనుంచి సంస్థలకు రక్షణ కల్పించాలి. కానీ ఈ సంస్థలు నేరుగా గానీ, పరోక్షంగా కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం నిర్ణయించిన విధాన చట్రం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అంతేతప్ప పాలసీని తమకు తాముగా రూపొం దించుకునే హక్కును అవి తీసుకోకూడదు.

గతంలో 2007–2008 మధ్య కాలంలో ఆర్బీఐ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా రుణాల లభ్యతను అడ్డుకుంటూ వడ్డీరేట్లను పెంచుతూ పోయింది. కానీ దేశీయ అదనపు డిమాండుతో పనిలేకుండానే ద్రవ్యోల్బణం పెరిగి పెరిగి 9%కి చేరుకుంది. 2008లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆర్బీఐ స్వతంత్రతను ఘోరంగా ఉల్లంఘించి చేసిన ఆదేశాల ఫలితంగా ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగి 9.1%కి చేరుకుంది. వడ్డీరేట్లను పెంచడం, తగ్గించడంలో సమతుల్యత పాటించడంలో ఆర్బీఐ గుణపాఠాలు నేర్చుకోలేదు. అందుకే ఈరోజు ఆర్బీఐ దయలేని స్కూల్‌ మాస్టర్‌లా మారింది. తప్పు చేసిన విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి అది బాదేస్తోంది. వారు చేస్తున్న తప్పులకు తానే కారణమనే వాస్తవాన్ని గుర్తించడానికి కూడా సిద్ధపడటంలేదు. అందుకే ఒక అభిప్రాయం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు ఆర్బీఐపై పట్టు సాధించడానికి ప్రయత్నించటంలో లేదు. కాగా ఆర్బీఐకి మరీ ఎక్కువ స్వతంత్రతను కల్పించి సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోనివిధంగా దాన్ని కేంద్రం స్తంభింపచేసింది. అందుకే ఆర్బీఐ నేడు భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలనే పద్ధతి ప్రకారం దెబ్బతీస్తోందని కొందరి అభి ప్రాయం.

ఆర్బీఐ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు తిరుగుబాటు ప్రకటించింది కానీ వేలాది చిన్న మదుపుదార్లను దెబ్బతీసే జనాకర్షక విధానంతో, ప్రభుత్వేతర డైరెక్టర్లతో పావుకదిపి విమర్శల పాలవుతోంది. అదేసమయంలో విరాళ్‌ ఆచార్య చెప్పింది ఒక కోణంలో సరైనదే. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని ఇంత అపరిపక్వ దృష్టితో అడ్డుకోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది ఆర్థిక మంత్రిత్వశాఖలో ప్రొఫెషనలిజమూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానపరమైన ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే డబ్బు చలామణి, వడ్డీరేట్లను నిర్వహించాల్సి ఉందని ఆర్బీఐకి స్పష్టం చేయడమూ మాత్రమే. ఇవి మాత్రమే పారిశ్రామిక, ఉపాధి పెరుగుదలకు వీలు కల్పిస్తాయి.

వ్యాసకర్త: ప్రేమ్‌ శంకర్‌ ఝా, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement