కెప్టెన్‌ మోదీ.. వరాల ‘సిక్సర్‌’!? | Interim Budget might go beyond vote-on-account, hints Finance Minister Arun Jaitley | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ మోదీ.. వరాల ‘సిక్సర్‌’!?

Published Wed, Jan 23 2019 12:07 AM | Last Updated on Wed, Jan 23 2019 12:21 PM

Interim Budget might go beyond vote-on-account, hints Finance Minister Arun Jaitley - Sakshi

వన్డే... టెస్ట్‌... టీ20... అన్న తేడా లేకుండా ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ ఏడాది అసలు సిసలు పరీక్ష ఎదుకానుంది. అదే నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే  వరల్డ్‌కప్‌. ఇక్కడ భారత్‌ పొలిటికల్‌ గేమ్‌లో కూడా  అనేకరాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తు చేసిన కెప్టెన్‌ మోదీకి ఎన్నికల ప్రపంచకప్‌లో ఈ సారి చాలా టఫ్‌ ఫైట్‌ ఎదురవుతోంది. బీజేపీ చేతికి మరోసారి ఘన విజయాన్ని అందించేందుకు అస్త్రాలతో సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రత్యర్ధులకు  చెక్‌ చెప్పేందుకు కెప్టెన్‌ మోదీ ఇప్పటికే అగ్రకులాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు.. చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ మినహాయింపును రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచటం వంటి బాణాలను సంధించారు. అయితే, ఎన్నికలకు ముందు  వస్తున్న కీలక బడ్జెట్‌లో టీమ్‌ మోదీ గురి ఎలా ఉండబోతోంది? టీమ్‌ ఇండియా సారథి కోహ్లీలా ఫ్రంట్‌ఫుట్‌ గేమ్‌తో ఎన్నికల కప్‌ను మళ్లీ ఒంటి చేత్తో కైవసం చేసుకుంటారా? ఎన్నికల పిచ్‌లో  కీలకమైన మధ్యతరగతి, రైతులు ఇతరత్రా వర్గాల  నాడి పట్టుకొని వారికి తగిన తాయిలాల సిక్సర్లను కురిపిస్తారా? ఈ పొలిటికల్‌ వరల్డ్‌కప్‌లో గెలుపే లక్ష్యంగా బడ్జెట్‌ ప్రణాళిక ఉంటుందా? జనం ఏం ఆశిస్తున్నారు.. కెప్టెన్‌ మోదీకి ఉన్న బలాలు,  బలహీనతలు ఏంటి.. ఇవన్నీ వివరించే ‘బడ్జెట్‌ కౌంట్‌ డౌన్‌’ నేటి నుంచి సాక్షి పాఠకుల కోసం...  

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌:సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తన చివరి ఆదాయ, వ్యయాల చిట్టాను ఫిబ్ర వరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆఖరి ప్రయత్నం లో అయినా ప్రజలను ఆకర్షించే నిర్ణయాలపై ప్రకటన ఉంటుందా...? లేక గత నాలుగేళ్లలాగే ఆశలపై నీళ్లు చల్లుతుం దా..? ఇదే ఇప్పుడు చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. ఎన్నికల ముందు ప్రభుత్వం కేవలం ఆదాయ, వ్యయాలతో కూడిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ సంప్రదాయాన్ని ఎందుకు బ్రేక్‌ చేయకూడదు? అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీయే స్వయంగా వ్యాఖ్యానించడంతో అందరి దృష్టి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పైకి వెళ్లింది. గత నవంబర్, డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కీలకమైన మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలయింది. అనంతరం జనరల్‌ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకోవడమే కాకుండా, దానికి పార్లమె ంటు ఆమోదముద్ర వేయించుకుంది. దీంతో గత సంప్రదాయాలను బ్రేక్‌ చేసి... పన్ను మినహాయింపులు, రైతుల కోసం ఆర్థిక ప్రయోజనాల వంటి తాయిలాలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో చోటు కల్పిస్తుందన్న అంచనాలు పెరిగాయి. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో విధానపరమైన ముఖ్యమైన నిర్ణయాలకు చోటు కల్పించకూడదన్న నిబంధనలు ఏవీ లేవనేది గమనార్హం. 

ఏం చేయవచ్చు...? 
రైతులకు సబ్సిడీలకు బదులు నేరుగా నగదును అందించే ప్రతిపాదనను కేంద్ర సర్కారు పరిశీలిస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఎరువులు సహా అన్ని రకాల సబ్సిడీలను కలిపి ఆ మొత్తాన్ని రైతులకు నేరుగా నగదును అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీన్ని కనుక అమల్లోకి తెస్తే కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ.70,000 కోట్ల భారం పడుతుందని అంచనా. రెండోసారి కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టాలనుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, నిరాశ, నిస్పృహలతో ఉన్న రైతాంగాన్ని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. మరోసారి రైతుల రుణమాఫీ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీసుకొస్తుండటంతో ఏదో ఒకటి చేయక తప్పనిసరి పరిస్థితులు మోదీ సర్కారు ముందున్నాయి. వ్యవసాయ రంగానికి రుణాల లక్ష్యాన్ని 10 శాతం పెంచి రూ.12 లక్షల కోట్లు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగాల రుణ లక్ష్యాలు పెరుగుతూ వస్తున్నాయి. 2017–18లో రూ.11.68 లక్షల కోట్ల రుణాలను రైతులకివ్వడం జరిగింది. నిజానికి పెట్టుకున్న లక్ష్యం రూ.10 లక్షల కోట్ల కంటే ఇది ఎంతో ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  (2018–19) సర్కారు రూ.11 లక్షల కోట్ల లక్ష్యం విధించుకుంది. పైగా స్వల్ప కాలం కోసం తీసుకునే సాగు రుణాలను 3% సబ్సిడీ రేటుపై 7%కే అందిస్తోంది. సకాలంలో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 3% శాతం రాయితీ కూడా ఇస్తోంది. దీంతో అసలు వడ్డీ రేటు 4 శాతమే పడుతోంది.  

ఆదాయపు పన్ను కూడా..! 
ఇక మధ్యతరగతి వర్గాలు ఆదాయపన్ను పరంగా మినహాయింపులు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయపన్ను ప్రామాణిక మినహాయింపు రూ.2.5 లక్షలను పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. సెక్షన్‌ 80సీ కింద వివిధ సాధనాల్లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఆదాయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో దీన్ని రూ.2–2.5 లక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఆర్థిక సాధనాలకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని బ్యాంకుబజార్‌ సీఈవో ఆదిల్‌శెట్టి అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో ఇళ్ల కొనుగోలుదారులకు ఆదాయపన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు చేయాలన్న డిమాండ్‌ కూడా ఉంది. ఇతర డిమాండ్లలో... కేవలం ఈక్విటీ ఫండ్స్‌కే కాకుండా, డెట్, హైబ్రిడ్‌ ఫండ్స్‌ కూడా సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు కల్పించడం... దీర్ఘకాలిక మూలధన లాభం రూ.లక్ష దాటితే పన్ను పరిమితిని పెంచడం వంటివి కూడా ఉన్నాయి. 

గతంలో మధ్యంతర బడ్జెట్లు... 
2014: గత లోక్‌సభ ఎన్నికల ముందు అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం 2014–15 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో... వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యయాలను పెంచే ప్రతిపాదనలకు చోటివ్వలేదు. ద్రవ్యలోటు లక్ష్యానికే కట్టుబడ్డారు. అయితే, క్యాపిటల్‌ గూడ్స్, ఆటోమొబైల్‌ రంగం, మరికొన్ని ఇతర ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించడం చేశారు.  

2009: ఈ ఏడాది కూడా పి.చిదంబరమే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా ఆయన భారీ ప్రకటనలకు దూరంగానే ఉన్నారు. ‘‘కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం 2009–10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను, వ్యయ విధానాలను నిర్ణయించే రాజ్యాంగ హక్కు కలిగి ఉంటుంది’’ అంటూ ఆ సందర్భంలో పేర్కొన్నారు. అయితే, రైతులకు రుణాల మాఫీని అప్పటికే ప్రకటించడంతో ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏకి కలిసొచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చింది.   

2004: నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్‌సింగ్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పన్ను మినహాయింపుల పరంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. అప్పటికే అమలవుతున్న పథకాల ప్రయోజనాలు మరింత మందికి చేరే నిర్ణయాలు ప్రకటించారు. పన్ను విధానాల సరళతరంపై నిర్ణయాలు తీసుకున్నారు. విమానాశ్రయాల్లోకి ఉచిత బ్యాగేజ్‌ను అనుమతించడం, దానిపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించడం చేశారు.   

‘పిచ్‌’ పరిస్థితి ఇదీ....
జీడీపీలో ద్రవ్యలోటును 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3%కి కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం. అయితే, ఈ లక్ష్యాన్ని డిసెంబర్‌ నాటికే దాటిపోయింది. దీంతో మిగిలి ఉన్న కాలానికి వ్యయాల పరంగా చాలా పరిమితులే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపులు, ఇతర ప్రోత్సాహకాలకు తాత్కాలిక బడ్జెట్‌లో చోటు కల్పిస్తే... అవి 2019–20 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలపై భారం పడుతుంది. విత్తమంత్రి ముందున్న సవాళ్లు ఇవే. 2014లో ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు స్వీకరించే నాటికి ద్రవ్యలోటు 5%. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలను నాటి యూపీఏ సర్కారు ప్రవేశపెట్టింది. కానీ, వీటిని సకాలంలో ఉపసంహరించుకోలేదు. దీని కారణంగా 2009–10 ఆర్థిక సంవవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 6.5 శాతానికి పెరిగిపోయింది. దీన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు గట్టి ప్రయత్నాలనే చేసింది. చమురు ధరలు కనిష్ట స్థాయిలకు చేరడం కూడా ఇందుకు సాయపడింది. అయితే, జీఎస్టీని అమల్లోకి తేవడం, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ సాయం అంచనాలను మించడంతో ద్రవ్యలోటు ప్రణాళికలపై ఒత్తిడికి దారితీశాయి. దీంతో 2017–18లో 3.2 లక్ష్యాన్ని చేరడంలో వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5% స్థాయిలో స్థిరపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018–19లో ద్రవ్యలోటు 3.3% లక్ష్యం కాగా, డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలల కాలానికే ఈ లక్ష్యం 115 శాతానికి చేరిపోయింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతం లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement