జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థకు మలుపు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై ఒకటి నుంచి జీఎస్టీ అమలు నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని సోమవారం సమీక్ష నిర్వహించారు. దేశ చరిత్రలో ఇది ఓ అపూర్వ ఘట్టమని.. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానంతో సామాన్యుడికి ప్రయోజనం కలగనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జీఎస్టీకి సంబంధించిన సైబర్ భద్రతపై ముఖ్యంగా దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.
సమాచార భద్రతా వ్యవస్థలపై కూడా ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. జీఎస్టీపై ప్రశ్నలకు వెనువెంటనే సమాధానాలిచ్చేందుకు ప్రారంభించిన @ askGst_GOI ట్వీటర్ హ్యాండిల్, టోల్ ఫ్రీ నంబర్ 1800–1200–232లపై ప్రధాని సమీక్ష చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, కేబినెట్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కొన్ని ధరలపై జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 11న మరో దఫా సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.
జీఎస్టీఎన్‌పై కాగ్ ఆడిట్: జైట్లీ
వస్తుసేవల పన్ను నెట్‌వర్క్ (జీఎస్టీఎన్)పై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఓ టీవీ చానల్‌కు ఇంటర్వూ్య ఇస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జీఎస్టీఎన్‌లో కేవలం 49 శాతం ప్రభుత్వం చేతిలో, 51 శాతం ప్రైవేటు వారి చేతిలో ఉండటంపై బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామితో పాటు పలువురి నుంచి వచ్చిన విమర్శలపై జైట్లీ స్పందించారు. ఇందులో తప్పేం లేదని అన్నారు. ‘జీఎస్టీఎన్ నిర్మాణం తీరుతెన్నులను యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించారు. దీన్ని నేను స్వయంగా పరిశీలించాను. ఆయనతో విభేదించడానికి ఏ కారణమూ కనబడలేదు’ అని అన్నారు.
అందరి దృష్టి మన పైనే..
పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోం దని ప్రధాని మోదీ అన్నారు. భారత సంగీతం, సంస్కృతి ప్రోత్సాహక సొసైటీ 5వ అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పు పెద్ద సవాల్‌గా మారిందని.. ఈ విషయంపై యువత మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. మూడేళ్లలో పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని దీంతో ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు చూస్తోందని ఆయన అన్నారు. సామాజిక అడ్డుగోడలు తొలగించటం ద్వారా దేశాన్ని ఏకం చేయటంలో భారత సంగీతం క్రియాశీలకమని మోదీ తెలిపారు.