మోదీ, జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ
బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మిషన్ భగీరథ పనులు, నీటి పారుదల ప్రాజెక్టుల పనులను జీఎస్టీ నుంచి మినహాయించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి జైట్లీకి లేఖలు రాశారు. రాష్ట్రంలో వేలాదిమంది బీడీలు చుట్టి బతుకుతున్నారని, బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేయడం వల్ల వారి ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2వేలకు పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయని వివరించారు.
వీటిలో 2లక్షల మంది ప్రత్యక్షంగా, ఐదు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఎక్కువ పన్ను వేయడం వల్ల గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. రా బ్లాక్స్, ఫినిష్డ్ ఉత్పత్తులపై 12 శాతం పన్ను విధించాలని సీఎం కోరారు. అలాగే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా తలపెట్టిన మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులపై విధించిన పన్నును ఓ సారి పునరాలోచించాలని లేఖలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.