రాయేదో.. రత్నమేదో తేల్చుకోండి | CM KCR Fires On Congress Party At BRS Public Meeting | Sakshi
Sakshi News home page

రాయేదో.. రత్నమేదో తేల్చుకోండి

Published Wed, Nov 15 2023 4:02 AM | Last Updated on Wed, Nov 15 2023 4:02 AM

CM KCR Fires On Congress Party At BRS Public Meeting - Sakshi

మంగళవారం నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు,తొర్రూరు సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, మహబూబాబాద్‌/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఎలాంటోడని ఆలోచించడమే గాకుండా.. వారి వెనుక ఉన్న పార్టీ గత చరిత్ర ఏంటి? వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు? అన్నది ఆలోచించి ఓటు వెయ్యాలె. కాంగ్రెస్‌ 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది, బీఆర్‌ఎస్‌ కూడా పదేళ్లు పాలించింది. ఎవరి కాలంలో ఏం జరిగిందో, బీఆర్‌ఎస్‌ ఏం అభివృద్ధి చేసిందో బేరీజు వేసుకోవాలి. నా మాటను మన్నించి ఊళ్లలో ఒక్కసారి చర్చ పెట్టండి.

ఏది రాయో, ఏది రత్నమో తెలుసుకుని ఓటేయండి..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు ఓటు. ఇది ఓ వజ్రాయుధం లాంటిది. ఆట కోకిల విషయం కాదు (చిన్నపిల్లల వ్యవహారం కాదు). దానిని ఆషామాషీగా వేయొద్దు. అది మన తలరాతను మార్చుతుంది. భవిష్యత్తును నిర్ణయించేది. కాబట్టి వచ్చే ఐదేళ్లు ఎవరు పాలించాలి? ఎవరి చేతిలో ఉంటే రాష్ట్రం బాగుంటదన్న విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటే ప్రజలు గెలుస్తారు.

హైదరాబాద్‌లో ఏర్పడే ప్రభుత్వం మంచిగుంటే మీకు మంచి జరుగుతది. లేకపోతే చెడు జరుగుతుంది..’ అని చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో, మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధి తొర్రూరు పట్టణంలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. 

సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం 
‘పదేళ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ఎక్కడ చూసినా కరువు కాటకాలు. రైతుల ఆత్మహత్యలు. కడివెడు నీళ్ల కోసం కూడా ప్రజల కష్టాలు పడటం చూసినం. పంటలు పండక హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు. ఈ పరిస్థితి నుంచి మొదలైన బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో మీరు చూడండి. సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసింది. కాళేశ్వరం కట్టుకున్నాం. కాల్వల ద్వారా రైతులకు నీటితీరువా లేకుండా నీళ్లు పారించి కరువును పారదోలాం.

మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ నాపై ఒత్తిడి తెచ్చాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ రావాల్సి ఉండగా, రూ.5 వేల కోట్లు కట్‌ చేస్తామని బెదిరించాడు. అయినా బెదరలేదు. మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశా. మరోవైపు గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా చేసుకున్నాం. ఇప్పుడు వారే పాలకులుగా మారారు. వలసలు ఆగిపోయాయి. పెన్షన్‌ను మొదట వెయ్యి చేసి, ఇవ్వాల రెండు వేలు చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. దాని రూ.5 వేలకు పెంచుకోబోతున్నాం.

దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు, దళితబంధు తీసుకొచ్చాం. తలసరి విద్యుత్‌ వినియోగంలోనే కాదు.. ఆదాయంలోనూ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లాం. ఇవన్నీ చూస్తే ఎట్లున్న తెలంగాణ ఎట్ల మారింది అన్నది కన్పిస్తుంది. పేదలకు ఆనాడు కాంగ్రెస్‌ ఇచ్చిన బియ్యం ఎంత? ఈనాడు ఇస్తున్న బియ్యం ఎంత? ఆలోచించాలి. వచ్చే మార్చి నుంచి రేషన్‌ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే గిరిజనబంధు అమలు చేస్తాం. ..’ అని కేసీఆర్‌ చెప్పారు. 

కాంగ్రెసోళ్ల చేతిలో పడితే పెద్ద పాము మింగినట్లే.. 
‘కాంగ్రెస్‌ పార్టీ గతంలో అధికారంలో ఉన్ననాడు ఏ పేదలనూ చూడలేదు. ఈసారి పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంట్‌ పోవుడు ఖాయం. రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీమ్‌. రాష్ట్రం కాంగ్రెసోళ్ల చేతిలో పడితే వైకుంఠ ఆటలో పెద్ద పాము మింగినట్లే. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ధరణి తీసేసేవాళ్లు, 24 గంటల కరెంటు వద్దని.. 3 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు, 10 హెచ్‌పీ మోటార్‌ పెట్టుకోమనేవాళ్లు రాజ్యానికి వస్తే రైతుల గతి ఏమవుతుందో ఆలోచన చేయండి.

రైతులు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు వాడుతుంటే పీసీసీ అధ్యక్షుడు 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోమంటున్నారు. మరి ఆ మోటార్లు ఎవరు కొనివ్వాలి? 24 గంటల కరెంటు ఇస్తున్న మన రాష్ట్రానికి వచ్చి.. మా కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అంటున్నారు. రైతుబంధుతో డబ్బులు దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

3 గంటల ఉచిత విద్యుత్‌ చాలని ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. రాహుల్, సీఎల్‌పీ నేత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? ఎవరి పాలనలో ఏం చేశారు అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. అంతేకానీ ఓటు వేసేటప్పుడు గాయ్‌ గాయ్‌ అయి అమూల్యమైన ఓటును గంగపాలు చేయొద్దు..’ అని సీఎం సూచించారు.   

నేను మాట నిలుపుకున్నా.. జానారెడ్డి తప్పారు 
‘2014లో మేము అధికారంలోకి రాగానే ఆర్థిక నిపుణులతో చర్చించి కరెంట్‌ విషయంలో స్థిర నిర్ణయం తీసుకున్నాం. రెండేళ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పా. ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కాంగ్రెస్‌ పెద్ద నాయకుడు జానారెడ్డి.. ‘నాలుగేళ్లలో 24 గంటల కరెంట్‌ ఇచ్చినా నేను కాంగ్రెస్‌ కండువాను వదిలి, గులాబీ కండువా కప్పుకుంటా..’ అని అన్నారు. నేను ఏడాదిన్నరలోనే కరెంట్‌ ఇచ్చి మాట నిలబెట్టుకున్నా. కానీ జానారెడ్డి మాత్రం మాట మీద నిలబడలేదు.గులాబీ కండువా కప్పుకోలేదు.ఎన్నిసార్లు గెలిపించినా పెద్ద నాయకుడిని చేసినా ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు.

ఇప్పుడు నేను ముఖ్యమంత్రినవుతా అని పంచరంగుల కల కంటున్నారు..’ అని విమర్శించారు. ‘పోరాటం, దైవభక్తితో విరాజిల్లిన నేల తెలంగాణ ప్రాంతం. పోతన, చాకలి అయిలమ్మ, షేక్‌ బందగి, దొడ్డి కొమురయ్యలు పుట్టిన పురిటి గడ్డ. వారిని స్ఫూర్తిగా తీసుకొని పాలకులను ఎన్నుకోవాలి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి..’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో  బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, మధుసూదనాచారి, పార్టీ నేతలు ఆనంద భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement