కాంగ్రెస్‌కు 20 సీట్లే!  | CM KCR Fires On Congress Party In BRS Public Meeting | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు 20 సీట్లే! 

Published Wed, Nov 22 2023 4:20 AM | Last Updated on Wed, Nov 22 2023 4:20 AM

CM KCR Fires On Congress Party In BRS Public Meeting - Sakshi

డోర్నకల్‌లో మాట్లాడుతున్న కేసీఆర్‌ , వైరాలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వాళ్లు కొత్త డ్రామా మొదలుపెట్టారని.. ఆ పారీ్టకి గతంలోలా 20 సీట్లకన్నా ఎక్కువ రావని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల కంటే ఈసారి మరో నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వందశాతం ఖాయమని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆగమాగం, గత్తర గత్తర చేస్తుందని.. వాళ్ల మాటలు విని ఓటేస్తే ఐదేళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను ఆగం చేసిన దరిద్రపు కాంగ్రెస్‌ను గంగలో పడేసి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర, వైరా, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని మరిపెడలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం.. ఇక్కడి ప్రజల కోసం. నాడు ఉన్న తెలంగాణను ప్రజలు వద్దని మొత్తుకున్నా ఆంధ్రాలో కలిపారు. 58 ఏళ్లు గోసపడ్డాం. 1969లో ఉద్యమం వస్తే 400 మందిని పిట్టల్లా కాల్చి చంపేశారు. మళ్లీ ఉద్యమం మొదలుపెడితే.. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తామని పొత్తుపెట్టుకుని ధోకా చేసింది. కేసీఆర్‌ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అని మొండిగా ముందుకు పోయిన. సకల జనుల సమ్మెతో రోడ్లపై పడి ఆందోళనలు చేసి, ఎన్నో బాధలు పడినం. దిక్కులేక కాంగ్రెస్‌ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్‌ది మొత్తం మోసాల చరిత్రనే. అలాంటి కాంగ్రెస్‌ కావాలా? 

రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా కేసీఆర్‌దే.. 
తెలంగాణ రాకముందు పేదలు, దళితుల బతుకులు ఎట్లా ఉండె, రైతుల బాధలు ఎట్లా ఉండె ఆలోచించాలె. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నయంటే.. ఎండిపోయిన వరి పట్టుకుని వచ్చేవారు. గత పదేళ్లలో 24 గంటలు కరెంటు వస్తోంది. ఎక్కడా ఒక ఎకరం పొలం ఎండుతలేదు. ఇంతకుముందు రెండుసార్లు మధిరలో మీరు మమ్మల్ని గెలిపించలేదు. అయినా నేను మీ మీద అలగలేదు. మధిర నాది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్‌దే. ప్రతీ ఇంచు బాగుపడాల్సిందే. 

మోదీ రాష్ట్రంలో దళితులపై దాడులు 
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో దళితుల పరిస్థితి దారుణంగానే ఉంది. ఇది దేశానికి క్షేమం కాదు. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దాడులు, తీవ్ర వివక్ష కొనసాగుతున్నాయి. ఇది పోవాలి. తెలంగాణ దళితబంధు దేశ దళితజాతికి మార్గదర్శకం చేయాలి. దళితుల బాగు కోసం రూ.10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు.

బార్లు, వైన్‌షాపులు, ప్రభుత్వ పనుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టాం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమల్‌రాజ్‌ను గెలిపిస్తే మధిర నియోజకవర్గమంతా దళితబంధు అమలు చేస్తాం. భట్టి విక్రమార్కతో వచ్చేదేమీ లేదు. మిమ్మల్ని మాయామశీ్చంద్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు. ఆ పార్టీ గెలుస్తదా? ఇంకెక్కడి సీఎం? 

కాంగ్రెస్‌ది భూమాత కాదు.. భూమేత! 
కాంగ్రెస్‌ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇప్పటిదాకా అమ్మను చూడు, బొమ్మను చూడు అంటూ మస్తుగ ఓట్లు గుద్దుకున్నరు. కానీ ఏం జరిగింది? కరెంట్‌ వచ్చిందా.. నీళ్లు వచ్చాయా? తెలంగాణకు అయితే మరీ అన్యాయం. ఉత్త కథలు, సొల్లు పురాణాలు చెప్పి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా కార్యక్రమాల్లో మానవీయ కోణం ఉంటే కాంగ్రెస్‌ రాజ్యంలో రాక్షసకోణం ఉంది.

కాంగ్రెస్‌ మూడు గంటలే కరెంట్‌ ఇవ్వాలంటోంది. రైతుబంధు ఇవ్వొద్దంటోంది. వాళ్లకు వాళ్లు పంచుకుతినాలనే ఈ మాట అంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూమాత పెడతామని అంటున్నారు. అది భూమాతనా.. భూమేతనా? రైతుబంధు కొనసాగాలన్నా, బీమా అందాలన్నా, భూములకు రక్షణ కావాలన్నా ధరణి ఉండాలి. ఇది జీవన్మరణ సమస్య. బీఆర్‌ఎస్‌ సర్కారు మళ్లీ రావాలి. 

గిరిజనబంధు అమలు చేస్తాం 
మేం మళ్లీ గెలవగానే రాష్ట్రంలో గిరిజన బంధు అమలు చేస్తాం. ఆటోరిక్షాల పర్మిట్, ఫిట్‌నెస్‌ ఫీజులు రద్దుచేస్తాం. ప్రభుత్వం వచ్చిన తెల్లారే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తాం. పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతాం. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతాం’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 
 
బీజేపీ మన నోట్లో మట్టి కొట్టింది 
బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ అంటే.. నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్లు ఇవ్వలేదు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మన నోట్లో మట్టి కొట్టామని సిగ్గులేకుండా చెప్పారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు పెట్టినా మనకు ఒక్కటీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఓట్లు వేస్తే మోరీలో పడేసినట్లే. ఆ ఓట్లన్నీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వేస్తే మెజారిటీ అయినా పెరుగుతుంది. 
 
నోట్ల కట్టల ఆసాములకు ఓటుతో బుద్ధి చెప్పాలి 
ఇక్కడ (ఖమ్మం జిల్లాలో) అహంకారంగా మాట్లాడే కొందరి నోట్ల కట్టలు హైదరాబాద్‌లో దొరికాయి. బీఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గడప తొక్కనీయమని కొందరు అన్నారు. అసెంబ్లీకి ఎవర్ని పంపాలో నిర్ణయించేది ప్రజలు. నోట్ల కట్టల ఆసాములకు ఓటుతో బుద్ధి చెప్పాలి. మాజీ మంత్రి ఒకాయన (తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి) మాటలు నరుకుతుండు కదా? ఈ నరికినోళ్లు గోదావరి నది నీళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదో నిలదీయండి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement