గజ్వేల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం. ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షిప్రతినిధి, వరంగల్/ సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలిప్పుడు? అప్పుడు ఏం సక్కదనం వెలగబెట్టారని పదేపదే ఆ పేరు ఉచ్చరిస్తున్నారు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ.. కాలిన కడుపులు, కాల్చి వేతలు, కూల్చివేతలేగా. ఆ కష్టాలు మనకు అవసరమా? ఎన్‌కౌంటర్లు, రక్తపాతం, తెలంగాణ ఉద్యమ సమయంలో 1969లో 400 మంది కాల్చి వేత.. ఇవన్నీ మరిచిపోలేదు.
కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లీ పాత చరిత్ర తెస్తామంటున్నారు. కానీ మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలి..’ అని సీఎం, బీఆర్‌ఎస్ అధినేత, పార్టీ గజ్వేల్ అభ్యర్థి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు మంగళవారం గజ్వేల్‌లో, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన భారీ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదు: ‘ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో వందలాది మంది పిల్లలను, ఉద్యమకారులను పొట్టన బెట్టుకున్న ఘన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. 1956లో తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ తర్వాత నా ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడం, 33 రాష్ట్రాలు మద్దతు లేఖలు ఇవ్వడంతో దిగొచి్చన కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది.
బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు, హక్కులను పరిరక్షించుకునేందుకు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? అప్పటివరకు రాష్ట్రం ఆకలి కడుపుతో ఉన్నందుకేగా? కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయను ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయని కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలి?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
మీరు సీఎం చేస్తేనే నేను కష్టపడ్డా..
‘గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తేనే నేను కష్టపడ్డా. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరించే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. ఆకాశం అంత కీర్తి వచ్చింది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు 30–40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, రాష్ట్రం ఏర్పడ్డాక సాగు నీరు, ఉచిత విద్యుత్ అందించడం వలన 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. ధరణి పోర్టల్ రాకముందు రైతు భూమిపై వీఆర్‌ఓ నుంచి సీసీఎల్‌ఏ అధికారుల వరకు 10 మందికి అధికారం ఉండేది. ఇప్పుడు రైతు బొటన వేలికి వారి భూమికి సంబంధించిన హక్కులు ఇచ్చాం. ధరణి ఉంది కాబట్టే ఎవరి భూమి వారికి ఉంది. లేకపోతే ఇబ్బంది ఉండేది.
గత పాలకుల పరిపాలనను తలదన్నే విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల చేత భేష్ అనిపించుకుంటున్నాం. కాంగ్రెస్ రాజ్యంలో రూ.200 పింఛన్ ఇస్తే, ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేలు ఇవ్వబోతున్నాం. నెహ్రూ, ఇందిరమ్మ కాలంలో దళిత వర్గానికి మేలు చేస్తే ఇంత దరిద్రంలో ఉండేవారు కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దళితబంధును ఏర్పాటు చేశాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 80 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించాం.
అమ్మఒడి వాహనాలు, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మితో పేదింట్లో ఆర్థిక భారం తగ్గించాం. అన్ని వర్గాలకు పెద్దన్నగా నిలిచాం. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కరోజు కూడా కర్ఫ్యూ, మతకల్లోలాలు, గొడవలు లేని వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో వరంగల్‌లో అజాంజాహీ మిల్లును మూసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు అమ్ముకుంటే వేలాది మంది కార్మీకులు రోడ్డున పడ్డారు. వారికి తిరిగి ఉపాధి కల్పించేందుకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు.
సరికొత్త చరిత్ర సృష్టిద్దాం
‘నా వయసు ఫిబ్రవరిలో 70 ఏళ్లకు చేరుతుంది. పదవుల కాంక్ష లేదు.. తెలంగాణను సక్కదిద్దాలనే ఉంది. మనసు పెట్టి సంక్షేమం అందిస్తున్న బీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి మూడవసారి పాలన తెచ్చుకుందాం. సరికొత్త చరిత్రను సృష్టిద్దాం. సమైక్యవాదులతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు వచ్చి ఓటు వేయాలని అడుగుతారు. అభ్యర్థుల గుణగణాలు, గతంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి.
50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర, 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ అభ్యర్థులు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment