కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: కేసీఆర్‌  | BRS Leader KCR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: కేసీఆర్‌

Published Mon, Apr 1 2024 1:04 AM | Last Updated on Mon, Apr 1 2024 12:22 PM

BRS Leader KCR Fires On Congress Govt - Sakshi

సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో ఎండిన వరి పొలాలను పరిశీలించి మహిళా రైతు సరోజనమ్మతో మాట్లాడుతున్న కేసీఆర్‌, రైతులను పరామర్శించేందుకు ధరావత్‌ తండాకు వస్తున్న కేసీఆర్‌. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్, పల్లా తదితరులు

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పంటలు ఎండిపోయాయి 

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మండిపాటు 

వంద రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్యలు.. ఉన్నట్టుండి నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? 

విద్యుత్‌ కోతలు ఎందుకు మొదలయ్యాయి? 

రాష్ట్రం ఇంత దుర్భర పరిస్థితికి వస్తుందనుకోలేదు.. సీఎంకు ఏ పట్టింపూ లేదు.. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి 

ఎండిన పంటల లెక్కలన్నీ తీయాలి.. 

ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి.. ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. 

వరికి బోనస్‌ కోసం రేపు జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు.. 6వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు 

జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌ 

ఇది పాలకుల అసమర్థత కాదా? 
రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎందుకు? కేసీఆర్‌ గడప దాటగానే కట్టేసినట్టుగా బంద్‌ అవుతదా? ఇది పా­ల­కుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేం టెక్నో­క్రాట్లను పెట్టి విద్యుత్‌ శాఖను నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టే సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్‌ను నియమించారు. వారికి విషయం పట్టుబడదు.. మంత్రులు పట్టించుకోరు. తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కో­సం తీరిక ఉందిగానీ.. ప్రజల కోసం తీరిక లేదు. 

సీఎం ఎక్కడ పడుకున్నరు? 
గత డిసెంబర్‌ 9వ తేదీనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్‌ 9 పోయి ఎన్నాళ్లయింది? నాలుగు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నరు? ఎక్కడ పడుకున్నరు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8 శాతం ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమికొడతాం. నిద్రపోనియ్యం. వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసమర్థ, తెలివిలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్‌ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడుతామన్నారు.

ధర్నాలు చేస్తామని.. అవసరమైతే ఎక్కడికక్కడ మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు వరికి బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఏప్రిల్‌ 2, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు.  ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 
 
‘‘జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించా. చాలాచోట్ల రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసి పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే నమ్మి పంటలు వేశామని.. మొదటే ఇవ్వబోమని చెప్పి ఉంటే వేసుకునే వాళ్లం కాదని వాపోయారు. ప్రభుత్వం మొదట ఇచ్చి తర్వాత బంద్‌ చేసి నష్టం చేకూర్చిందని బాధపడ్డారు.

మేం ఏడెనిమిదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణతో, స్పష్టమైన విధానాలతో రైతులు బాగుపడేలా చేశాం. ఇన్నాళ్లూ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో వంద రోజుల్లోనే దుర్భరమైన పరిస్థితిని చూస్తామనుకోలేదు. రైతులు ఇంతగా ఏడ్చే పరిస్థితి వస్తుందనుకోలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. 

విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తం.. 
మేం రూ.35వేల కోట్లు వెచ్చించి అగ్రగామిగా నిలిపిన విద్యుత్‌ రంగం.. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఉన్న వ్యవస్థను ఉన్నట్టు నడిపించలేని ఈ అసమర్థత ఏందీ? ఉన్న దాన్ని ఉన్నట్టు నడిపించే తెలివిలేకపోతే ఎలా? ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యమే. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్‌. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది.

మేం పవర్‌గ్రిడ్‌కు అనుసంధానించి.. కరెంట్‌ సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ తీసుకునే విధంగా చేశాం. 7వేల మెగావాట్ల ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీని 18 వేల మెగావాట్లకు పెంచాం. అదనంగా 1,600 రామగుండంలో, 4 వేలు యాదాద్రి థర్మల్‌ స్టేషన్‌లో కలిపి 5,600 మెగావాట్లు అదనంగా వచ్చే పరిస్థితి కల్పించాం. ఈ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్‌ను పట్టించుకోవడం లేదు. పట్టించుకుని ఉంటే రెండు యూనిట్ల ద్వారా సొంతంగా మరో 1,500 మెగావాట్లు వచ్చేది. ఇంత ఉజ్వలమైన పవర్‌ సిస్టం ఉన్నా ఎందుకు ఇబ్బంది అవుతోంది? 

అవసరమైనప్పుడు కరెంటు కొనాలె.. 
రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వం అప్పులు చేయాలె. పీక్‌ అవర్స్‌లో ఎంత షార్టేజ్‌ ఉంటే అంత కరెంటు కొనాలి. రైతులకు ఇవ్వాలి. మేం అదే చేశాం. అందుకే ఆనాడు రెప్పపాటు కూడా కరెంట్‌ పోలేదు. మేం ఉన్నప్పటికంటే ఇప్పుడు లోడ్‌ ఐదారు వందల మెగావాట్లు డిమాండ్‌ పెరిగింది. కానీ ప్రభుత్వం అవసరమైనంత కొంటలేదు. అందుకే కరెంటు వస్తలేదు. ఎనిమిదేళ్లుగా కాలిపోని మోటార్లు ఇప్పుడు కాలిపోతున్నాయని చాలా మంది రైతులు చెప్పారు. రోజుకు ఆరేడుసార్లు వస్తోంది, పోతోంది. అయినా సర్కారుకు చీమ కుట్టినట్టు లేదు. మేం రైతుల గురించి రూ.20, 30 వేల కోట్లు అయినా పెట్టాం. గట్టిగా పంటలు పండితే అవి నాలుగేళ్లలో తీరిపోయాయి. 

పంటలు ఎందుకు ఎండుతున్నాయి 
రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లానే లేదు. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. ప్రతి ఊళ్లో 200 నుంచి 400 ఎకరాల దాకా ఎండిపోతోంది. సాగర్‌ ఆయకట్టు ఎందుకు ఎండుతోంది? ఈ రోజు కూడా సాగర్‌లో మినిమమ్‌ డ్రాడౌన్‌ లెవల్‌ (ఎండీడీఎల్‌) కంటే పైన 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కింద మరో ఏడెనిమిది టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 14, 15 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ తెలివి హీనంగా సాగర్‌ ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించి, సాగర్‌ కట్టమీదకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చారు. 

ప్రభుత్వం మెడలు వంచుతాం 
ఖమ్మం, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. రూ.500 కోట్లను రైతులకు అందించాం. అప్పుడు అది సరిపోదని, రూ.20 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్‌ వాళ్లు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అదే వడగళ్ల వాన పడి నష్టపోతే అడిగే దిక్కులేదు. అకాల వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్నా.. మాట్లాడేవాళ్లు లేరు. మంత్రి పోడు, ఎమ్మెల్యే పోడు.. ఎంపీలు పోరు, అధికారుల బృందాలు పోవు.. దొంగల్లా ముఖం చాటేస్తారు. ముఖ్యమంత్రికి పట్టింపే లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. 

ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.. 
ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఏయే జిల్లాల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతెంత పంట ఎండిపోయిందనే లెక్కలు తీయాలి. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం.

ఎక్కడికక్కడ మంత్రులు, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. బీఆర్‌ఎస్‌ దళాలు తిరుగుతున్నాయి. కచ్చితంగా లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజారుకీడుస్తాం. హామీ ఇచ్చినట్టుగా వరికి రూ.500 బోనస్‌ కూడా ఇవ్వాలి. ఇందుకోసం కోసం ఏప్రిల్‌ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాం. హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మేము ఇస్తాం. 6వ తేదీన నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేస్తాం. కళ్లాల వద్ద నిలదీస్తాం. 

ఆత్మహత్యలు చేసుకోవద్దు 
నేను రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్‌ఎస్‌ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. మీ తరపున పోరాడుతాం. నేను మీ వెంటే ఉంటా. హక్కులను సాధించుకుందాం..’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.  
 
కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు 
చిల్లర రాజకీయాలతో కాళేశ్వరంలోని నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీల్లో నీటిని వదిలిపెట్టి, సీపేజీలో పోయే నీటిని ఫొటోలు తీసి, వీడియోలు తీసి, ప్రాజెక్టు ఖతం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. నిన్న యూపీలోనో, బిహార్‌లోనో బ్రిడ్జి కూలిపోయింది. ప్రపంచం మునిగిపోయిందా? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాట్లాడుతున్నరు.

నాగార్జునసాగర్‌ కుడివైపు కుంగలేదా? పునరుద్ధరించలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలో ఓ డ్యాం నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వారు విడిచిపెట్టారా? కొందరు ఇంజనీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన సమస్యతోనో, జియాలజీ సమస్యతోనో ఓ పిల్లర్‌ కింద ఇసుక కొట్టుకపోతే.. ప్రపంచం బద్ధలైనట్టు, ప్రళయం వచ్చినట్టు చిల్లర కథలు చెప్పి నీళ్లివ్వడం లేదు. మరి సమ్మక్క బ్యారేజీకి ఏమైంది. దేవాదుల నుంచి ఎందుకు పంప్‌ చేయట్లేదు. 
 
ఒక్కసారిగా నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? 

ప్రపంచ దేశాలు కొనియాడిన మిషన్‌ భగీరథ ఉండగా ఎందుకు మంచి నీళ్ల కొరత వచ్చింది? ఐదేళ్లు బ్రహా్మండంగా నడిచిన పథకంలో ఎందుకు లోపం వస్తుంది? ఎందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్‌? ఎందుకు నీటి సమస్య వస్తోంది. హైదరాబాద్‌ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది? ఇందుకు కారణం సీఎం, మంత్రులే.

రాష్ట్రంలో ఏం జరుగుతోందనే సమీక్ష చేయడం లేదు. వారికి పట్టింపు లేదు. పథకాన్ని వాడుకునే తెలివి లేదు. ఏదైనా పాడైతే ఇప్పుడు 15 రోజులైనా పట్టించుకోవడం లేదు. మిషన్‌ భగీరథ నీళ్లు సరిగా రావాలంటే నాణ్యమైన విద్యుత్‌ 24 గంటల సరఫరా ఉండాలి. దానిపై దృష్టి లేదు. జూన్‌ దాకా అంటే మరో మూడు నెలల వరకు వానలు పడే అవకాశం లేదు. ఇంకా నీటి సమస్య తీవ్రం కాకుండా మిషన్‌ భగీరథను పునరుద్ధరించాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement