సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా.. రైతులకు అపాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కుందన్నారు. ఆయన సిద్దిపేట కలెక్టరేట్‌లో మాట్లాడారు.
‘నాడు ఉద్యమాల ద్వారా మెల్కొంది బీఆర్ఎస్. కేసీఆర్ పర్యటన తర్వాత నిన్న(సోమవారం) నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 25 వేల నష్ట పరిహారం అందించాలి.100 రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారు. డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తామని చేయలేదు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.
...బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమే.. భారత రైతు సమితి. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కూడవెళ్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలి. 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. లో వోల్టేజీ కరెంట్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి.
..బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.కాంగ్రెస్ పార్టీ వచ్చినంక నీళ్లు తగ్గినయి, కన్నీళ్లు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల కష్టాలు పట్టవు. రైతులను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు తీరిక లేదా?. బీఆర్ఎస్ పార్టీ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంది’ అని హరీశ్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment