సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్య మాటల యుద్ధం నెలకొంది. కృష్ణా జలాలు, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ మాజీ సీఎం-సీఎం రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి-కడియం శ్రీహరి, హరీష్ రావు, కేటీఆర్ మధ్య జరుగుతున్న మాటలు మంటలు రేపుతున్నాయి.
పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరంటూ కాంగ్రెస్‌పై నల్గొండ సభలో కేసీఆర్ సైటైర్లు వేశారు. తాజాగా కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తీసుకొచ్చారంటూ పంచ్‌లు వేశారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు. నన్ను చంపుతారా అని కేసీఆర్ అంటుండు.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సంతకం..రైతుల పాలిట శాపం: రేవంత్
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తానని చాలెంజ్ చేశారు. పదేళ్లు తామే అధికారంలో ఉంటామని, ప్రజలు ఆమోదిస్తే మరో పదేళ్లు సీఎంగా ఉంటానని తెలిపారు. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని ప్రశ్నించారు. ఆకేసీఆర్ ఆడే డ్రామాలను అందరూ చూశారని తెలిపారు. కొత్తగా ఎంపికైనా పోలీసులే కేసీఆర్‌ను లాకప్‌లో వేస్తారని అన్నారు. కృష్ణా జలాలపై గత సీఎం పెట్టిన సంతకమే.. రైతుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు.
చదవండి: 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది: సీఎం రేవంత్
రేవంత్‌కు చేతగాక పోతే దిగిపోవాలి: హరీష్ రావు
రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా బాధ్యతలు తీసుకుని మేడిగడ్డ ద్వారా నీళ్లను ఎత్తిపొసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రేవంత్ రెడ్డికి చేతగాక పోతే దిగిపోవాలని అన్నారు. కేసీఆర్ త్వరలోనే అసెంబ్లీకి వస్తారని చెప్పారు. ఇవాళ కేసీఆర్ బాష మీద మాట్లాడుతున్న రేవంత్.. గతంలో కేసీఆర్‌ను కాల్చిపారేయాలి, ఉరి తీయాలన్నారని గుర్తు చేశారు. అలాంటి పదాలు శాసనసభలో ఉపయోగించవచ్చా అని ప్రశ్నించారు.
మేడిగడ్డను బూతద్దంలో పెట్టి చూపుతున్నారు
పార్లమెంట్ సీట్ల కోసం కాళేశ్వరంపై రాజకీయం చేస్తున్నారని హరీష్ రావు ద్వజమెత్తారు. మేడిగడ్డ వెళ్లినవాళ్లు ఇతర రిజర్వాయర్లు కూడా చూడాల్సిందని హితవు పలికారు. మేడిగడ్డను బూతద్దంలో పెట్టి చూపుతున్నారని, మేడిగడ్డపై ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలోనే తాము చెప్పామని తెలిపారు. వెంటనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని కోరామని అన్నారు. చరిత్రలో జరగనిదేదో జరిగిందని చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ బురద రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని అన్నారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. మేడిగడ్డ పునరుద్దరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment