ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా
జోగుళాంబ సాక్షిగా మాట ఇస్తున్నా..
హరీశ్ నువ్వు.. నీ మామ నా సవాలును స్వీకరించండి
రేవంత్ మాటిస్తే ఎలా ఉంటదో నీ మామను అడుగు
లోటు బడ్జెట్ ఉన్నప్పుడు అధికారం చేపట్టా
మద్దూరు, బిజినేపల్లి సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే రోజు నువ్వు, నీ మామ బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు. నీ పార్టీ రద్దుకు సిద్ధంగా ఉండండి’అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్‌రావు తన సవాలును స్వీకరించాలని చెప్పారు. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారా యణపేట జిల్లా మద్దూరులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర భారీ బహిరంగసభలో సీఎం మాట్లాడారు.
‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని, రేవంత్‌రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటూందో నీ మామ కేసీఆర్‌ను అడుగు..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, పదవి తీసుకున్న నాలుగు నెలల్లో నీ మామ చేసిన లక్షల కోట్ల అప్పులకు రూ. 26వేల కోట్ల కిస్తీలు చెల్లిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నాం. కావాలంటే లెక్కలతో సహా నీకు, నీ మామకు చూపడానికి మేము సిద్ధంగా ఉన్నాం’అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై మండిపడ్డారు. రుణమాఫీతోపాటు వచ్చే పంటకే వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు.
దొంగలకు సద్ది మోస్తున్నరు..
పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కుర్చీ వేసుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని చెప్పారు. పగోడి చేతులో చురకత్తులుగా మారి, ఇక్కడి నాయకులు దొంగలకు సద్ది మోస్తున్నారని మండిపడ్డారు. తమను రేవంత్‌రెడ్డి తిడుతున్నారని అరుణమ్మ, ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అంటున్నారని.. వారితో తనకేం తగాదా, పంచాయితీ లేదన్నారు.
గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖంగా ఉన్నప్పుటికీ మంత్రిగా ఉన్న డీకే.అరుణ నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా.. మరోమారు నరేంద్రమోదీ చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పోడుస్తున్నావంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఈ ఐదేళ్లు రాజకీయాలకతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో దేశంతో పోటీపడేందుకు తనకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ఆలోచన చేయకుండా కాళ్లలో కట్టెలు పెట్టడం ధర్మమా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు ఓటేస్తే.. మోదీకి అమ్ముకుంటడు..
‘ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేసీఆర్ ఇబ్బందులు పెడితే మేం అండగా ఉన్నాం. ప్రజాజీవితంలోకి వచ్చి దొరలకు వ్యతిరేకంగా ప్రవీణ్‌కుమార్ పోరాటం చేశాడు. ఆరు నెలల్లో ఏం మారింది.. ఎందుకు కేసీఆర్‌ను నమ్ముతుండో సమాధానం చెప్పాలి. 4 కోట్ల మంది తిరస్కరించి కేసీఆర్‌కు గొయ్యి తవ్వితే, ఆ సమాధికి పూలదండలు వేసి భుజాలపై మోస్తున్నవు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశాడు. ఆయనతో చేరిన నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా? ఏనుగు తిరిగి దోమ దగ్గరకు ఎందుకు పోయిందో చెప్పాలి.
దోమకు ఎంతపెద్ద తొండం ఉన్నా ఏనుగు అవుతుందా’అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందుకు తిరస్కరించారో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవీణ్‌కుమార్ డీజీపీ అయ్యేవారని, ముఖ్యమంత్రి స్థాయి పదవితో గౌరవించుకునే వారమని చెప్పారు. సన్’స్ట్రోక్ దెబ్బతో ఎంపీ రాములును ఆయన కొడుకు పదవి కోసం ఇంట్లో పెట్టి తాళం వేస్తే.. బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఓటేస్తే తిరిగి మోదీకే అమ్ముకుంటాడని, గత పదేళ్లలో ప్రతిసారి ఈ కేడీ మద్దతు పలికింది మోదీకే కదా అని వ్యాఖ్యానించారు.
పాలమూరు అభివృద్ధి నా జీవితాశయం..
పాలమూరులో తనకు ఎవరూ శత్రువులు లేరని, తనకెవరూ పోటీ కాదని చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధి తన జీవిత ఆశయమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఖర్చయినా నాలుగున్నర ఏళ్లలోనే పూర్తిచేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులును ఎంపీలుగా గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ గ్రూపులోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే పని కోసం తనకు సహకారం అందించాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.
– మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించి రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాలమూరు ప్రజలు తనను కూడా ఎంపీగా ఆశీర్వదిస్తే.. ముఖ్యమంత్రికి సోదరుడిగా రేవంత్‌రెడ్డి గొంతుకనై ఢిల్లీలో పాలమూరు ప్రజల కోసం పోరాడుతానన్నారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు.
ఆయా సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మనోహర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర పోలీస్ హౌసింస్‌బోర్డు చైర్మన్ గురున్నాథ్‌రెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment