
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ సమావేశం వలన ఎటువంటి ప్రయోజనం లేకపోగా, తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా మరచిపోయిందని, రాష్టంలోని కాంగ్రెస్ నేతలు గాలి మోటార్‌పై తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తాము ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారని, అది తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, దీనిపై క్యాబినెట్‌లో ఐదు గంటలపాటు చర్చించడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నిట్ట నిలువునా ముంచుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి, గ్రామాభివృద్ధికి పాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో సీఎం రెవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడిన అబద్ధమేనని, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్‌లు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని హరీష్ రావు ఆరోపించారు.
రైతులను దెబ్బతీసేలా క్రాఫ్ హాలీడేను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అలాగే చంద్రబాబు ఎదురించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్లనున్నదని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. శ్రీశైలం రైడింగ్ పాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెబుతున్న సీఎం రెవంత్ రెడ్డి గంగమళ్లకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల