న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ సోమవారం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఏప్రిల్ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనున్న రానున్న ఆర్థిక సంవత్సరం (2019–2020) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష తత్సంబంధ అంశాలపై వీరిరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఒక మర్యాదపూర్వక సమావేశం. ద్రవ్య విధాన సమీక్ష ముందు ఆర్థికమంత్రితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ సాంప్రదాయకంగా వస్తోంది’’ అని ఈ సమావేశం తరువాత దాస్ విలేకరులతో అన్నారు. ఏప్రిల్ 11 నుంచీ ఏడు దశల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరగనున్న ఆర్‌బీఐ పరపతి సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గుతుందా? లేదా అన్న అంశంపై ప్రస్తుతం అందరిదృష్టీ కేంద్రీకృతమైంది. అయితే ఈ దఫా రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, ఇప్పటికే తగ్గించిన రేటు ప్రయోజనం కస్టమర్లకు అందడంపైనే ఆర్‌బీఐ ప్రస్తుతానికి దృష్టి సారించవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్ ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిపిన విషయం గమనార్హం.
పేమెంట్స్ బ్యాంక్స్ చీఫ్‌లతో త్వరలో...
కాగా ఆర్‌బీఐ గవర్నర్ ఈ వారం చివర్లో పేమెంట్స్ బ్యాంక్స్ చీఫ్‌లతో సమావేశం కానున్నారు. నీతీ ఆయోగ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ఆర్థికరంగంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్న భాగస్వాములందరితో భేటీఅవుతున్నాను. సమస్యలను తెలుసుకుంటున్నాను. అభివృద్ధికి సంబంధించి వ్యవస్థలో లిక్విడిటీ(ద్రవ్య లభ్యత) సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నాను. ఇందులో భాగంగా బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యాను. ఈ వారంలో పేమెంట్ బ్యాంక్ చీఫ్‌లతో కూడా సమావేశం కానున్నాను’’ అని దాస్ పేర్కొన్నారు.
ఆహార ధరలు పెరుగుతాయ్: గోల్డ్‌మన్ శాక్స్
కాగా ఆహార ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల స్పీడ్) 2017 ఏప్రిల్–2018 మార్చితో పోల్చితే 2018–19 ఇదే కాలంలో సగటున కేవలం 0.7 శాతం పెరిగిందని పేర్కొన్న గోల్డ్‌మన్ శాక్స్, 2019–20లో ఈ రేటు 2 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు దీనికి ఒక కారణంగా విశ్లేషించింది. ప్రస్తుతం తమ ఉత్పత్తులకు తక్కువ ధర పలుకుతోందని రైతులు ఆందోళన చేస్తున్నారని, అధిక రిటర్న్ కోసం డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, ఆయా పరిణామాలు రానున్న కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు మ రో కారణమవుతుందనీ వివరించింది. రైతులకు తగి న ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం కూడా హామీ ఇస్తున్న విషయాన్ని తన నివేదికలో గోల్డ్‌మన్ శాక్స్ ప్రస్తావించింది.
ద్రవ్య లభ్యత పరిస్థితి బాగుంది: గార్గ్
ఇదిలావుండగా, వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితి బాగుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. కొత్త విధానం... రూపీ–డాలర్ మార్గం ద్వారా వ్యవస్థలోకి ఆర్‌బీఐ మరో రూ.35,000 కోట్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇందుకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితికిగాను 5 బిలియన్ డాలర్లకు గురువారం వేలం జరగనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితులను ఆర్‌బీఐ ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్‌బీఐ చీఫ్ ‘పాలసీ’ చర్చలు...
Published Tue, Mar 26 2019 12:00 AM | Last Updated on Tue, Mar 26 2019 12:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment