డిజిటల్ ఆర్థిక విప్లవంలో భారత్ ముందంజలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్‌లోనే జరిగాయి. గ్లోబల్ రెమిటెన్స్‌లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.
గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపుల పరిమాణంలో 48.5 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మొబైల్ మనీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 2023లో ప్రపంచవ్యాప్తంగా 857.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరగగా 115.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలతో భారత్ అగ్రగామిగా నిలిచిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
భారతదేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పదో వంతుగా ఉంది. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేట్ల ఆధారంగా 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు పెరుగుతుందని అంచనా. ఆర్బీఐ ప్రకారం, 2023-24లో రూ. 428 లక్షల కోట్ల విలువైన 16,400 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇవి గత ఏడు సంవత్సరాలలో పరిమాణం పరంగా 50 శాతం, విలువ పరంగా 10 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయి.
డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని, ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్) మాత్రమే కాకుండా బయోమెట్రిక్ గుర్తింపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ లాకర్స్, సమ్మతితో కూడిన డేటా షేరింగ్‌లోనూ మెరుగ్గా ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. అయితే సైబర్ భద్రత ముఖ్యమైన సవాలు అని కూడా ఎత్తి చూపింది.
Comments
Please login to add a commentAdd a comment