ఫార్మా ఎగుమతుల్లో భారత్‌ జోరు | India pharma exports set for 10x growth | Sakshi
Sakshi News home page

ఫార్మా ఎగుమతుల్లో భారత్‌ జోరు

Published Tue, Mar 4 2025 4:42 AM | Last Updated on Tue, Mar 4 2025 4:42 AM

India pharma exports set for 10x growth

ప్రపంచ సగటును మించిన వృద్ధి 

ఐపీఏ, మెకిన్సే నివేదికలో వెల్లడి

సాక్షి, బిజినెస్‌ బ్యూరో: జెనరిక్‌ ఔషధాల సరఫరాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. ఎగుమతుల పరంగా కొత్త వృద్ధి శకానికి సిద్ధంగా ఉందని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ), మెకిన్సే అండ్‌ కంపెనీ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు 5 శాతం కంటే వేగంగా ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి చెందుతూ కొత్తపుంతలు తొక్కుతోందని వివరించింది. ప్రపంచ ఫార్మా ఎగుమతులు 2011లో 424 బిలియన్‌ డాలర్ల నుంచి 2023 నాటికి 797 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. భారత్‌ విషయంలో ఇది 10 బిలియన్‌ డాలర్ల నుంచి 28 బిలియన్‌ డాలర్లుగా ఉందని నివేదిక వివరించింది. మౌలిక వసతులకు భారీ పెట్టుబడులు, వ్యయ నియంత్రణ చర్యలు, మెరుగైన నిర్వహణ, మొత్తం పరిశ్రమలో సామర్థ్యం పెరుగుదల ఇందుకు దోహదం చేసింది.  

విదేశాల్లోనూ పాగా.. 
భారత్‌ ఇప్పుడు ప్రపంచ జెనరిక్‌ ఔషధ డిమాండ్‌లో 20 శాతం సమరుస్తోంది. ఇందులో యూఎస్‌ జెనరిక్‌ ఔషధ అవసరాలలో 40 శాతం, యూకే మార్కెట్‌లో 25 శాతం వాటా భారత్‌ కైవసం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎగుమతుల విషయంలో పరిమాణం పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానం మనదే. భారత్‌కు వ్రస్తాల తర్వాత సుమారు 20 బిలియన్‌ డాలర్లతో అత్యధిక విదేశీ మారకం సమకూరుస్తున్న విభాగం ఇదే. ప్రపంచ వ్యాక్సిన్‌ డిమాండ్‌లో 60 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. 70 శాతం యాంటీ రెట్రోవైరల్‌ మందులు భారత్‌ నుంచి వెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే మందుల ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకుపైగా అధికమై ఏటా 8 శాతం వృద్ధి చెందుతోంది. యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ) తయారీలో భారత్‌ వాటా 8 శాతం ఉంది. బయోటెక్నాలజీ విభాగంలో 12వ ర్యాంకుతో పోటీపడుతోంది. ఆమోదం పొందిన బయోసిమిలర్ల సంఖ్య 2005లో 15 ఉంటే, 2023 నాటికి 138కి ఎగసింది. ఆమోదం పొందిన ఏఎన్‌డీఏల్లో టాపికల్స్, ఇంజెక్టేబుల్స్, నాసల్, ఆఫ్తాలి్మక్‌ వంటి సంక్లిష్ట డోసేజ్‌ల వాటా 2013లో 25 నుంచి 2023లో 30 శాతానికి చేరింది. 

యూఎస్‌ను మించిన కేంద్రాలు.. 
యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదించిన తయారీ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2024 నాటికి 752కి చేరుకుంది. సంఖ్య పరంగా యూఎస్‌ను మించిపోయాయి. డబ్లు్యహెచ్‌వో జీఎంపీ ధ్రువీకరణ అందుకున్న ప్లాంట్లు 2,050, అలాగే యూరోపియన్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ది క్వాలిటీ ఆఫ్‌ మెడిసిన్స్‌ (ఈడీక్యూఎం) ఆమోదం పొందిన ప్లాంట్లు 286 ఉన్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారిక చర్య సూచించిన (ఓఏఐ) కేసులు 50 శాతం తగ్గాయి. నిబంధనల తాలూకా యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) కేసులు 27 శాతం క్షీణించాయి. కారి్మక వ్యయాలు తక్కువగా ఉండడం, సామర్థ్య మెరుగుదల, డిజిటల్‌ స్వీకరణ కారణంగా భారత కంపెనీలు అమెరికా, యూరోపియన్‌ తయారీదారుల కంటే 30–35 శాతం తక్కువ ధరకే ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి.  

ప్రాధాన్య గమ్యస్థానంగా.. 
తక్కువ వ్యయానికే ఔషధాలు అందుబాటులో ఉండడంతో ప్రాధాన్య ఔట్‌సోర్సింగ్‌ గమ్యస్థానంగా భారత్‌ నిలిచింది. ఎంఆర్‌ఎన్‌ఏ, కణ, జన్యు చికిత్సలు, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌తో సహా అభివృద్ధి చెందుతున్న చికిత్సలకు ఉపయోగించే ఔషధాలు ఏటా 13–14 శాతం పెరుగుతున్నాయి. సంప్రదాయ ఔషధ వృద్ధి రేటును ఇవి అధిగమించాయి. ఏఐ, జనరేటివ్‌ ఏఐ ఆధారిత పురోగతి కారణంగా అదనపు ఆదాయాన్ని 60 బిలియన్‌ డాలర్ల నుండి 110 బిలియన్‌ డాలర్లకు పెంచగలవని నివేదిక అంచనా వేసింది. మార్జిన్‌లను 4–7 శాతం మెరుగుపరుస్తాయని, ఉత్పాదకతను 50 శాతం పెంచగలవని వెల్లడించింది. ప్రపంచ ఫార్మా సరఫరా వ్యవస్థలో భారత పాత్రను బలోపేతం చేస్తూ తమ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి అయిదు అగ్రశ్రేణి భారతీయ కాంట్రాక్ట్‌ అభివృద్ధి, తయారీ సంస్థలు (సీడీఎంఓలు) 650 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. 

వెన్నంటే సవాళ్లు..
ఔషధ రంగంలో భారత్‌ పురోగతి ఉన్నప్పటికీ.. పరిశ్రమ ఒక కీలక దశకు చేరుకున్నప్పుడు క్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదిక వివరించింది. డిజిటల్‌ పరివర్తన, స్మార్ట్‌ ఆటోమేషన్, కొత్త చికిత్సా విధానాల పెరుగుదల వంటి అంతరాయాలు ఔషధ కార్యకలాపాలను పునరి్నరి్మంచగలవని తెలిపింది. భౌగోళిక రాజకీయ మార్పులు, కొత్త పోకడలు, పెరుగుతున్న స్థిరత్వ డిమాండ్లు కూడా ముప్పును కలిగించే అవకాశం ఉందని వివరించింది. భారతీయ ఫార్మా కంపెనీలు పరిగణించవలసిన ఎనిమిది కీలక అంశాలలో లోపరహిత కార్యకలాపాలను సాధించడం, ఏఐ, డిజిటల్‌ సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, స్థిరత్వ ప్రయత్నాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ‘దశాబ్ద కాలంలో నిర్మించిన పునాది కారణంగా భారత ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ నేడు బలంగా ఉంది. అంతరాయాలు ఎదురుకానున్నందున అధిక పనితీరును నడిపించడానికి, ప్రపంచ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీలు తమ నిర్వహణ విధానాలను పునరాలోచించాలి’ అని మెకిన్సే అండ్‌ కంపెనీ భాగస్వామి విష్ణుకాంత్‌ పిట్టి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement