Export growth
-
దుస్తుల ఎగుమతుల్లో 9–11 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9–11 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రధాన మార్కెట్లలో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ఇందుకు కారణమని తెలిపింది. ‘భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు అంగీకారం, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఎగుమతి ప్రోత్సాహకాలు, యూకే, ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇందుకు కారణం. అధిక రిటైల్ ఇన్వెంటరీ, కీలక మార్కెట్ల నుండి మందగించిన డిమాండ్, ఎర్ర సముద్ర సంక్షోభం, పొరుగు దేశాల నుండి పెరిగిన పోటీతో సహా సరఫరా సమస్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025–26లో టర్నోవర్‌లో 5–8 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం ఒత్తిడి, భౌగోళిక రాజకీయ సమస్యల మధ్య కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ అనిశ్చితి చుట్టూ సవాళ్లు కొనసాగుతున్నాయి. అధికం అవుతున్న కార్మిక వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పెరుగుదలతో పరిశ్రమ యొక్క నిర్వహణ మార్జిన్లు 2024–25లో 30–50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. బంగ్లాదేశ్‌లో ఇటీవలి భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్‌సహా పలు దేశాల్లో సామర్థ్యం జోడించే అవకాశం ఉంది. పీఎల్ఐ పథకం కింద తాజా సామర్థ్య జోడింపుల నుండి పొందే ప్రయోజనాలతో పాటు, పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపారల్ స్కీమ్ ద్వారా మానవ నిర్మిత ఫైబర్ ఉత్పత్తిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంతో.. ప్రపంచ దుస్తుల వ్యాపారంలో భారత్ దూసుకెళ్తుందని పరిశ్రమ భావిస్తోంది’ అని నివేదిక వివరించింది. -
పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..
భారత్ వస్తు ఎగుమతులు 2024-25 ఏడాదికిగాను 500 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.41.5 లక్షల కోట్లు) చేరవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) అంచనా వేసింది. సుమారు 400 బిలియన్ డాలర్ల విలువచేసే సేవల ఎగుమతులుతోడైతే మొత్తంగా ఎక్స్‌పోర్ట్స్ 900 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫియో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. 2023-24లో దేశం మొత్తం ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు. అంతకుముందు ఏడాది కంటే 2023-24లో వస్తు ఎగుమతులు 3% తగ్గి 437 బి.డాలర్లు (సుమారు రూ.36.27 లక్షల కోట్లు)గా నమోదైనట్లు అశ్వనీ చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సేవల ఎగుమతుల్లో ఇంజినీరింగ్, అడ్వర్టైజింగ్ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ విస్తరణ వల్ల వ్యాపార ఎగుమతులు మరింత పెరుగుతాయి. భారత్ నుంచి యూఎస్, యూరప్‌కు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, హై అండ్ మీడియం టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, డయాగ్నొస్టిక్ పరికరాలకు డిమాండ్ ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి..ఫియో వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ..‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం ద్వారా లబ్ధిపొందిన చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుతున్నాయి. 2023-24లో రెండంకెల క్షీణతను చూసిన దుస్తులు, పాదరక్షలు, డైమండ్లు, ఆభరణాల వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు ఈసారి మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నాయి. ఈసారి ఆశించిన విధంగానే రుతుపవనాలు వస్తాయి. ప్రభుత్వం తృణధాన్యాల ఎగుమతులపై ఉన్న కొన్ని పరిమితులను తొలగించవచ్చు’ అని చెప్పారు. -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్‌గా, ఆఫ్‌షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
వస్త్ర ఎగుమతులకు భారత్–యూఏఈ ఎఫ్‌టీఏ బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశం నుంచి భారీగా వస్త్ర రంగ ఎగుమతుల పురోగతికి దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ విభాగం చైర్మన్ అశోక్ రజనీ విశ్లేషించారు. ఈ ఒప్పందం వల్ల సుంకం రహిత మార్కెట్ ఏర్పడుతుందని, ఇది మన ఎగుమతుల్లో యూఏఈ వాటా మరింత పెరగడానికి దోహపడుతుందని ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అపెరల్ అండ్ టెక్స్టైల్ ఫెయిర్ (ఐఏటీఎఫ్)లో 20 మందికి పైగా దేశీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల్లో చైనా తర్వాతి స్థానంలో మనమే.. యూఏఈకి రెడిమేడ్ దుస్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని అశోక్ రజనీ తెలిపారు. ‘‘యూఏఈ సాంప్రదాయకంగా భారత వస్త్ర ఎగుమతులలో అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలూ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేయడంతో, భారత వస్త్ర ఎగుమతులకు యూఏఈలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. దీనితో దేశ వస్త్ర రంగం ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా’’ అని ఆయన వివరించారు. ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ, విస్తృత శ్రేణి సాంప్రదాయ పత్తి, ఎంఎంఎఫ్ (మాన్ మేడ్ ఫైబర్స్) వస్త్రాలలో తాజా ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా భారతదేశ అత్యుద్భుత దుస్తుల డిజైన్లు, శైలులను ప్రదర్శించాలని మన ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వివిధ రకాల ముడిసరుకు లభ్యత, ఇతర సానుకూల అంశాల పరంగా మన దేశ గార్మెంట్ పరిశ్రమ పటిష్టతను పరిగణనలోకి తీసుకుని, భారత్‌ను ఒక సోర్స్‌గా (మూల ఉత్పత్తి వనరు) మలచుకోడానికి యూఏఈ దుస్తుల బ్రాండ్లకు ఈ ఫెయిర్ భారీ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. భారత్ వస్త్ర పరిశ్రమ పటిష్టతను ఆయన వివరిస్తూ, సాంప్రదాయ దుస్తుల విభాగంలో పరిశ్రమ స్థిరపడిన తర్వాత, మరిన్ని విభాగాల్లోకి విస్తరించడానికి వ్యూహ రచన చేస్తోందన్నారు. దేశ దుస్తుల పరిశ్రమ ఇప్పుడు 16 బిలియన్ డాలర్ల సాంకేతిక వస్త్ర విభాగంలో ఎంఎంఎఫ్ కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ విలువలో ఇది దాదాపు 6 శాతమని తెలిపారు. -
త్వరలో 10 బిలియన్ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు
కోల్‌కతా: రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్ వివరించారు. ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్) 400 శాతం పెరిగాయి. ఇక భారత్ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. 750 బిలియన్ డాలర్ల టార్గెట్ సాధిస్తాం.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్ కాకుండా) 65 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్ చెప్పారు. -
ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల్లో రికార్డు
కోల్‌కతా: ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొన్నట్లు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక వ్యవహారాల మండలి (ఈఈపీసీ) చైర్మన్ మహేశ్ దేశాయ్ వెల్లడించారు. 2021 సెప్టెంబర్‌లో ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు తొమ్మిది బిలియన్ డాలర్లను దాటాయి. ఎగుమతులకు సంబంధించి మొత్తం 25 ప్రధాన దేశాలకు సంబంధించి 22 దేశాల విషయంలో మంచి సానుకూల గణాంకాలు వెలువడినట్లు వివరించారు. ఇందులో చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), జర్మనీ, టర్కీ, ఇటలీ, బ్రిటన్, మెక్సికో, వియత్నాం, సింగపూర్ వంటి దేశాలు ఉన్నాయన్నారు. మొత్తం భారత్ ఎగుమతుల్లో ఇంజనీరింగ్ ఉత్పత్తుల వాటా 26.65 శాతం. 2022 మార్చి నాటికి 105 బిలియన్ డాలర్ల లక్ష్యం 2021 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబర్ వరకూ చూస్తే, భారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 32.4 బిలియన్ డాలర్ల నుంచి 52.3 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఈఈపీసీ చైర్మన్ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో (2022 మార్చి నాటికి) 49 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, లక్ష్యం సాకారమైతే ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల విలువ 105 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరు దేశాలు, ట్రేడింగ్ బ్లాక్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వేగవంతం చేయడానికి కేంద్రం చేస్తున్న కృషిని దేశాయ్ స్వాగతించారు. అయితే ఇటువంటి ముందస్తు ఒప్పందాల వల్ల చోటుచేసుకున్న ప్రతికూల ప్రభావాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ‘‘ముందస్తు సంతకం చేసిన ఎఫ్‌టీఏ వల్ల కొరియా, జపాన్ వంటి దేశాల నుండి ఫెర్రస్, నాన్–ఫెర్రస్ రంగాలలోని కొన్ని వస్తువుల దిగుమతులు గణనీయంగా పెరిగిపోయాయి. అందువల్ల కొత్త ఎఫ్‌టీఏలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
ఎగసిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి ఎగిసింది. బుధవారం విడుదలైన వాణిజ్య గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధికం. క్రూడాయిల్, బంగారం దిగుమతులు గత నెలలో ఎగియడమే ఇందుకు కారణం. వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26 బిలియన్లు ఉండగా.. దిగుమతుల పరిమాణం 41.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2018 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కీలక రంగాల తగ్గుదల..: ఇంజనీరింగ్, వజ్రాభరణాలు, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్ ఉత్పత్తులు, ధాన్యం, కాఫీ తదితర విభాగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. దీంతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో తగ్గాయి. చమురు దిగుమతులు 9.26 శాతం పెరిగి 11.38 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురుయేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 54 శాతం ఎగిసి 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, తాజాగా పెట్రోలియం, చేతివృత్తులు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా రంగాల ఎగుమతులు మాత్రం సానుకూల వృద్ధి నమోదు చేశాయి. నిరాశపర్చే గణాంకాలు.. ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి అంత ఆశావహంగా లేదని వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) చైర్మన్ మోహిత్ సింగ్లా చెప్పారు. అయితే, సానుకూల ధోరణి కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు. టీ, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో సానుకూలత కనిపించినట్లు చెప్పారు. కార్మిక శక్తి అత్యధికంగా ఉండే అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండటంతో ఎగుమతుల గణాంకాలు నిరాశపర్చేవిగా ఉన్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. ‘నిధుల కొరతతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, రక్షణాత్మక ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా బలహీన వ్యాపార పరిస్థితులు, దేశీయంగా అనేక పరిమితులు తదితర అంశాల కారణంగా ఈ రంగాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఒక వైపు చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఇరాన్ నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో పసిడి, చమురు దిగుమతుల భారం ఎగుస్తుండటంతో వాణిజ్య లోటు మరింత పెరుగుతుండటంపై గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాల భయాలతో అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు మరింతగా దిగజారవచ్చన్నారు. రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై మరింత ఒత్తిడి పెరగవచ్చన్నారు. -
ఎగుమతులకు ప్రోత్సాహకాలు: కేంద్రం
న్యూఢిల్లీ: ఎగుమతుల వృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇక్కడ ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎగుమతుల క్షీణ రేటు తగ్గుతున్నట్లు మే గణాంకాలు వెల్లడించాయన్నారు. 2014 డిసెంబర్ తరువాత మేలో అతితక్కువగా 0.79 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నారు. ఇది సానుకూల పరిణామం అని వివరించారు. పరిస్థితి మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీ సబ్వెన్షన్ రూపంలో లేదా మరో రకంగా కానీ ఎగుమతుల వృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించాల్సిన తరుణం ఇదని కూడా ఆమె పేర్కొన్నారు.భారత్ ఎగుమతులు 18 నెలలుగా క్షీణతలో కొనసాగుతుండటం తెలిసిందే. చక్కెర ఎగుమతులపై 20% సుంకం విధింపుపై మాట్లాడుతూ, ఇది దేశీయంగా కమోడిటీ లభ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు. -
క్యూ3లో కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 2 శాతమే..
క్రిసిల్ రీసెర్చ్ అంచనాలు న్యూఢిల్లీ: పెట్టుబడుల డిమాండ్ బలహీనంగా ఉండటం, కమోడిటీల ధరలు పతనం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో బీఎఫ్ఎస్ఐ, ఆయిల్..గ్యాస్ కంపెనీలు మినహా ఇతర కార్పొరేట్ల ఆదాయాలు కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రీసెర్చ్ వెల్లడించింది. తక్కువ బేస్-ఎఫెక్ట్, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గుతుండటం తదితర అంశాలు కూడా దీనికి కారణం కాగలవని పేర్కొంది. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు 5 శాతం మేర పెరిగాయి. స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 70 శాతం వాటా ఉన్న 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు, గ్యాస్ సంస్థలను మినహాయించి) అధ్యయనం ఆధారంగా క్రిసిల్ రీసెర్చ్ ఈ నివేదిక రూపొందించింది. పట్టణ ప్రాంత వినియోగదారులపై ఆధారపడిన ఆటోమొబైల్స్, మీడియా, రిటైల్, టెలికం కంపెనీలు మెరుగ్గా రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేయొచ్చని అందులో పేర్కొంది. అమెరికాకు ఎగుమతుల వృద్ధితో మధ్య స్థాయి ఫార్మా కంపెనీల పనితీరు కూడా మెరుగుపడొచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అయితే, స్థూలంగా చూస్తే కార్పొరేట్ సంస్థలు బలహీన డిమాండ్ సెంటిమెంటుతో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ రీసెర్చ్ సీనియర్ డెరైక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. చెన్నైలో వరదలు సైతం ఐటీ, ఆటోమొబైల్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వంటి రంగాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్నారు.