న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశం నుంచి భారీగా వస్త్ర రంగ ఎగుమతుల పురోగతికి దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ విభాగం చైర్మన్ అశోక్ రజనీ విశ్లేషించారు. ఈ ఒప్పందం వల్ల సుంకం రహిత మార్కెట్ ఏర్పడుతుందని, ఇది మన ఎగుమతుల్లో యూఏఈ వాటా మరింత పెరగడానికి దోహపడుతుందని ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అపెరల్ అండ్ టెక్స్‌టైల్ ఫెయిర్ (ఐఏటీఎఫ్)లో 20 మందికి పైగా దేశీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.
రెడీమేడ్ దుస్తుల్లో చైనా తర్వాతి స్థానంలో మనమే..
యూఏఈకి రెడిమేడ్ దుస్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని అశోక్ రజనీ తెలిపారు. ‘‘యూఏఈ సాంప్రదాయకంగా భారత వస్త్ర ఎగుమతులలో అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలూ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేయడంతో, భారత వస్త్ర ఎగుమతులకు యూఏఈలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. దీనితో దేశ వస్త్ర రంగం ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా’’ అని ఆయన వివరించారు.
ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ, విస్తృత శ్రేణి సాంప్రదాయ పత్తి, ఎంఎంఎఫ్ (మాన్ మేడ్ ఫైబర్స్) వస్త్రాలలో తాజా ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా భారతదేశ అత్యుద్భుత దుస్తుల డిజైన్‌లు, శైలులను ప్రదర్శించాలని మన ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వివిధ రకాల ముడిసరుకు లభ్యత, ఇతర సానుకూల అంశాల పరంగా మన దేశ గార్మెంట్ పరిశ్రమ పటిష్టతను పరిగణనలోకి తీసుకుని, భారత్‌ను ఒక సోర్స్‌గా (మూల ఉత్పత్తి వనరు) మలచుకోడానికి యూఏఈ దుస్తుల బ్రాండ్‌లకు ఈ ఫెయిర్ భారీ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. భారత్ వస్త్ర పరిశ్రమ పటిష్టతను ఆయన వివరిస్తూ, సాంప్రదాయ దుస్తుల విభాగంలో పరిశ్రమ స్థిరపడిన తర్వాత, మరిన్ని విభాగాల్లోకి విస్తరించడానికి వ్యూహ రచన చేస్తోందన్నారు. దేశ దుస్తుల పరిశ్రమ ఇప్పుడు 16 బిలియన్ డాలర్ల సాంకేతిక వస్త్ర విభాగంలో ఎంఎంఎఫ్ కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ విలువలో ఇది దాదాపు 6 శాతమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment