గతేడాది సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్‌కు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22లో అతి పెద్ద ఇన్వెస్టర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న యూఏఈ 2022–23 నాలుగో స్థానానికి చేరింది. 2021–22లో 1.03 బిలియన్ డాలర్ల చేయగా గత ఆర్థిక సంవత్సరం దానికి మూడు రెట్లు అధికంగా 3.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ ఆంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 2022–23లో 17.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అతి పెద్ద ఇన్వెస్టరుగా నిల్చింది. మారిషస్ (6.1 బిలియన్ డాలర్లు), అమెరికా (6 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులపరమైన సహకారం వేగంగా పటిష్టమవుతుండటం ఇన్వెస్ట్‌మెంట్ల రాకకు దోహదపడుతోందని శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీ పార్ట్‌నర్ రుద్ర కుమార్ పాండే తెలిపారు.
భారత్‌లో యూఏఈ ప్రధానంగా సర్వీసెస్, సముద్ర మార్గంలో రవాణా, నిర్మాణం, విద్యుత్ తదితర రంగాల్లో ఉంటున్నాయి. భారత్, యూఏఈ కుదుర్చుకున్న సమగ్ర ఎఫ్‌టీఏ గతేడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో సుంకాల సమస్య లేకుండా ఒక దేశ మార్కెట్లో మరో దేశం తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవడానికి వీలు లభించింది. అలాగే పెట్టుబడులను పెంచుకునేందుకు నిబంధనలను కూడా సడలించారు. 2000 ఏప్రిల్ నుంచి 2023 మధ్య కాలంలో భారత్‌కి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) యూఏఈ వాటా 2.5 శాతంగా ఉంది. ఈ వ్యవధిలో యూఏఈ 15.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment