భారత్ వస్తు ఎగుమతులు 2024-25 ఏడాదికిగాను 500 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.41.5 లక్షల కోట్లు) చేరవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) అంచనా వేసింది. సుమారు 400 బిలియన్ డాలర్ల విలువచేసే సేవల ఎగుమతులుతోడైతే మొత్తంగా ఎక్స్‌పోర్ట్స్ 900 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫియో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. 2023-24లో దేశం మొత్తం ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు. అంతకుముందు ఏడాది కంటే 2023-24లో వస్తు ఎగుమతులు 3% తగ్గి 437 బి.డాలర్లు (సుమారు రూ.36.27 లక్షల కోట్లు)గా నమోదైనట్లు అశ్వనీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సేవల ఎగుమతుల్లో ఇంజినీరింగ్, అడ్వర్టైజింగ్ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ విస్తరణ వల్ల వ్యాపార ఎగుమతులు మరింత పెరుగుతాయి. భారత్ నుంచి యూఎస్, యూరప్‌కు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, హై అండ్ మీడియం టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, డయాగ్నొస్టిక్ పరికరాలకు డిమాండ్ ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: స్టాక్‌మార్కెట్‌లో కొత్త ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి..
ఫియో వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ..‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకం ద్వారా లబ్ధిపొందిన చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుతున్నాయి. 2023-24లో రెండంకెల క్షీణతను చూసిన దుస్తులు, పాదరక్షలు, డైమండ్లు, ఆభరణాల వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు ఈసారి మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నాయి. ఈసారి ఆశించిన విధంగానే రుతుపవనాలు వస్తాయి. ప్రభుత్వం తృణధాన్యాల ఎగుమతులపై ఉన్న కొన్ని పరిమితులను తొలగించవచ్చు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment