
న్యూఢిల్లీ: వైట్‌గూడ్స్(White Goods) విభాగంలో (ఎలక్ట్రికల్ గృహోపకరణాలు) ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద వోల్టాస్, యూనో మిండా తదితర 18 కంపెనీలు ఎంపికయ్యాయి. ఇవన్నీ కలసి రూ.2,299 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. వైట్‌గూడ్స్ పీఎల్‌ఐ పథకం కింద గతేడాది అక్టోబర్‌లో మొత్తం 38 సంస్థలు దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. 11 దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలనకు ప్రభుత్వం పంపింది.
‘పీఎల్‌ఐ(PLI) పథకం కింద మూడో విడత ఆన్‌లైన్ అప్లికేషన్ విండోలో భాగంగా మొత్తం 38 దరఖాస్తులు అందాయి. వీటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వం 18 కంపెనీలను ఎంపిక చేసింది. వీటిల్లో ఏసీ విడిభాగాలు తయారు చేసే 10 కంపెనీలు, ఎల్‌ఈడీ లైట్లను తయారు చేసే 8 సంస్థలు ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా రూ.2,299 కోట్ల పెట్టుబడులకు అంగీకరించాయి’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. ఇప్పటికే పీఎల్‌ఐ పథకం కింద ప్రయోజనాలు పొందుతున్న మరో ఆరు సంస్థలను సైతం అధిక పెట్టుబడుల విభాగంలో ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ సంస్థలు రూ.1,217 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు పేర్కొంది. మొత్తం మీద వైట్‌గూడ్స్ రంగానికి సంబంధించిన పీఎల్‌ఐ పథకం కింద 84 కంపెనీలు రూ.10,478 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు, వీటి ద్వారా రూ.1,72,663 కోట్ల తయారీ ఏర్పాటు కానున్నట్టు వివరించింది.
ఇదీ చదవండి: ‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
కంపెనీల వివరాలు..
వోల్టాస్ కాంపోనెంట్స్ సంస్థ రూ.257 కోట్ల పెట్టుబడితో కంప్రెషర్లను తయారు చేయనుంది.
మిర్క్ ఎల్రక్టానిక్స్ సంస్థ రూ.51.5 కోట్ల పెట్టుబడితో ఏసీ మోటార్లు, హీట్ ఎక్సే్ఛంజర్లను తయారు చేయనుంది.
ఏసీ విడిభాగాల తయారీకి సంబంధించి జూపిటర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ రూ.618 కోట్లు, రామ్‌రత్న వైర్స్ రూ.253 కోట్లు, ఎస్‌ఎంఈఎల్ స్టీల్ స్ట్రక్చరల్ రూ.541 కోట్లు, నెక్ట్స్ జనరేషన్ మాన్యుఫాక్చరర్స్ రూ.121 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి.
ఎల్‌ఈడీ విభాగంలో లుమ్యాక్స్ ఇండస్ట్రీస్ రూ.60 కోట్లు, యూనో మిండియా రూ.20 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టునున్నాయి.
ఇప్పటికే పీఎల్‌ఐ పథకం కింద లబ్దిదారులుగా ఉంటూ, మరిన్ని పెట్టుబడులకు ముందుకు వచ్చిన వాటిల్లో హిందాల్కో ఇండస్ట్రీస్ (రూ.360 కోట్లు), ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా (రూ.433 కోట్లు), బ్లూస్టార్ క్లైమాటెక్ (రూ.180 కోట్లు, వోల్టాస్ (రూ.200 కోట్లు) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment