white goods
-
ఫ్రిజ్.. ఏసీ.. మైక్రోవేవ్.. దీర్ఘాయుష్మాన్‌భవ!
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్ నడుస్తోంది. వైట్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు సేల్స్ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్ టైమ్’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.రేటు ఎంత ఎక్కువైతే.... వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్లైతే మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్ బెకో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.ఎల్జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్ మెషీన్ ఇన్వర్టర్ మోటార్‌పై శాంసంగ్, హయర్ 20 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తుండగా... వోల్టాస్ బెకో, గోద్రెజ్ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన విడిభాగాలపైనే... చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్ ప్యానెల్ టీవీ సెట్లపై చాలా బ్రాండ్లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.⇒ అధిక వారంటీ వ్యవధి వల్ల అప్‌గ్రేడ్ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. ⇒ యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్ స్టోర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. -
ఇన్స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీ
న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తిని ఇన్స్టాల్ (ఏర్పాటు చేయడం/పనిచేయించడం) చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌గూడ్స్ (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది. అంతే కానీ కొనుగోలు చేసిన తేదీని వారంటీ/గ్యారంటీకి పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వారంటీ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల సంఘాలు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్‌పూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, డైకిన్, సోనీ, హిటాచి, ఐఎఫ్బీ, గోద్రేజ్, హయర్, యూరేకా ఫోర్బ్స్, లైడ్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ లేఖ రాశారు. ఉత్పత్తిని వినియోగించని కాలానికి వారంటీని అమలు చేయడం అనుచిత వాణిజ్య విధానంగా ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019’ స్పష్టం చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఫ్రిజ్‌లు, ఏసీలు.. కొంటున్నారా? గ్యారెంటీపై ప్రభుత్వం కీలక సూచన!
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వైట్‌గూడ్స్‌పై ఇచ్చే గ్యారెంటీ లేదా వారంటీకి సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వాటి తయారీ, విక్రయ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఆయా ఉపకరణాల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వంటి ఉపకరణాలపై వారంటీ లేదా గ్యారంటీని అవి కొనుగోలు చేసిన తేదీ నుంచి వర్తింపజేస్తారు. అలా కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని పరిశ్రమలు, రిటైల్ అసోసియేషన్లు, వైట్ గూడ్స్ తయారీదారులకు ప్రభుత్వ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక లేఖలో సూచించారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలను సాధారణంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులే ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేసే వరకు వినియోగదారులు ఆ వస్తువులను ఉపయోగించలేరు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వినియోగదారులు ఉత్పత్తిని ఉపయోగించలేనప్పుడు వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిని ఏర్పరుస్తుంది. కొనుగోలు తేదీ నుంచి వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వలన వినియోగదారు సాధారణంగా ఆనందించే మొత్తం వారంటీ వ్యవధిలో తగ్గింపునకు దారి తీస్తుంది. ఈ-కామర్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల విషయంలో ఈ సమస్య మరింతగా పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి డెలివరీలో అదనపు సమయం ఉంటుంది. -
టీవీల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీలతో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 10 శాతం దాకా పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విక్రేతల నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల రేట్లు రెట్టింపయ్యాయని, అలాగే ముడి చమురు రేట్లు పెరగడంతో ప్లాస్టిక్ ధర సైతం పెరిగిందని తయారీ సంస్థలు వెల్లడించాయి. ధరల పెంపు అనివార్యమంటూ ఎల్జీ, ప్యానసోనిక్, థామ్సన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ‘కమోడిటీల రేట్లు పెరగడం వల్ల సమీప భవిష్యత్‌లో మా ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. జనవరిలో 6–7 శాతంతో మొదలుకుని ఆ తర్వాత 10–11 శాతం దాకా పెరగవచ్చు‘ అని ప్యానసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా జనవరి 1 నుంచి ఉపకరణాల రేట్లను కనీసం 7–8 శాతం మేర పెంచనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (హోమ్ అప్లయెన్సెస్ విభాగం) విజయ్ బాబు చెప్పారు. ఆలోచనలో సోనీ.. మిగతా సంస్థలకు భిన్నంగా సోనీ ఇండియా మాత్రం ఇంకా పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ‘రోజురోజుకు మారిపోతున్న సరఫరా వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, పెంపు ఎంత మేర ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు‘ అని సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ విధానం నేథ్యంలో ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, అయితే ఫ్యాక్టరీలు ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చేయకపోతుండటంతో సరఫరా పరిమితంగానే ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయని వివరించారు. టీవీ ఓపెన్‌సెల్ కొరత తీవ్రంగా ఉందని, దీంతో వాటి ధర 200 శాతం పైగా ఎగిసిందని భారత్‌లో థామ్సన్, కొడక్ ఉత్పత్తులను విక్రయించే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో ప్రత్యామ్నాయంగా ప్యానెళ్ల తయారీ లేకపోవడంతో అంతా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన తెలిపారు. జనవరి నుంచి థామ్సన్, కోడక్ తమ ఆండ్రాయిడ్ టీవీల రేట్లను 20% మేర పెంచే అవకాశం ఉందని వివరించారు. డిమాండ్‌కు దెబ్బ.. బ్రాండ్లు రేట్లను పెంచిన పక్షంలో వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘కమోడిటీల ధరలు 20–25 శాతం పెరగడం, కంటెయినర్ల కొరతతో సముద్ర.. విమాన రవాణా చార్జీలు 5–6 రెట్లు పెరిగిపోవడంతో ఉపకరణాల ముడి వస్తువుల వ్యయాలపై భారీగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనితో సమీప భవిష్యత్‌లో బ్రాండ్లు తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం దాకా పెంచే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్ దెబ్బతినే ముప్పు ఉంది‘ అని పేర్కొన్నారు. అయితే, పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గట్లుగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, ఫలితంగా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సీఈఏఎంఏ, ఫ్రాస్ట్ అండ్ సలివాన్ సంయుక్త నివేదిక ప్రకారం 2018–19లో కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ పరిమాణం రూ. 76,400 కోట్లుగా నమోదైంది. -
భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ల ధరలు!
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్సీడీ/ఎల్ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది. భారీగా పెరుగుదల...! వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం. పండుగల సీజన్లోనే పెంచాల్సింది..! అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది. భయపడుతున్న కంపెనీలు... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టీవీలకు సుంకాల దెబ్బ... ఎల్ఈడీ/ఎల్సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. -
కస్టమర్లకు ఫెస్టివల్ చీర్ : వాటిపై ధరల తగ్గింపు
న్యూఢిల్లీ : పండుగ సీజన్‌కు ముందు కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బొనాంజ అందించిన సంగతి తెలిసిందే. పలు వైట్ గూడ్స్ ఉత్పత్తులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించేసింది. దీంతో గృహోపకరణాల ధరలు 8 శాతం నుంచి 10 శాతం తగ్గబోతున్నాయి. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్స్డ్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్ల ధరలు 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. చాలా లగ్జరీ ఉత్పత్తులను దేశీయ గృహ అవసర కేటగిరీ వస్తువులుగా తీసుకొచ్చింది. ఈ ప్రయోజనాలను ప్రస్తుతం కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయించాయి. జూలై 28 నుంచి వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను 7 శాతం నుంచి 8 శాతం మధ్యలో తగ్గిస్తున్నట్టు గోద్రేజ్ అప్లియెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. మంచి రుతుపవనాలతో, డిమాండ్ కూడా పెరుగుతుందని తెలిపారు. జూలై 27 నుంచి తగ్గిన జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్నాయి. అయితే జీఎస్టీ రేట్లకు అనుగుణంగా అన్నింటిపై ఒకే విధంగా ధరలు తగ్గించకుండా.. గ్లోబల్ ధరలు పెరగడంతో మెటరీయల్ ఖర్చులు ఎగియడం, రూపాయి క్షీణించడం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని.. గృహోపకరణాలపై తగ్గింపు చేపడతామని కంపెనీ తెలిపాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇతర చిన్న చిన్న ఉపకరణాలను రెగ్యులర్ గా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ప్రతి ఇంటికి ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. కాగ, వైట్ గూడ్స్‌పై అంతకముందు 28 శాతం జీఎస్టీ విధించడంతో, వీటి ఎంఆర్పీ ధరలన్నీ అప్పట్లో 10 శాతం నుంచి 15 శాతం పెరిగాయి. త్వరలోనే దివాళి, క్రిస్టమస్ పండుగలు ఉండటంతో, కన్జ్యూమర్ డ్యూరబుల్ సంస్థలకు ఇది అత్యధిక మొత్తంలో విక్రమయ్యే కాలమని ఇండస్టి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ రేట్ల తగ్గింపు ఈ పండుగ సీజన్‌కు మరింత సహకరించనుందని పేర్కొంటున్నాయి. -
20 ఏళ్ల తర్వాత, టాటాలు రీ-ఎంట్రీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ ఏంటి అంటే? ఠక్కున టాటా గ్రూప్ అని చెప్పేస్తాం. ఈ గ్రూప్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 1998లో అప్పుడప్పుడే గృహవినియోగదారులు అలవాడు పడుతున్న వైట్ గూడ్స్‌ను అంటే రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, డిష్ వాషర్స్ను విక్రయించడం ఆపేసింది. తాజాగా ఈ మార్కెట్ జోరందుకోవడంతో, మళ్లీ వైట్ గూడ్స్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆగస్టు నుంచి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెనస్, డిష్ వాషర్స్ను ఓల్టస్ బెకో బ్రాండ్ కింద విక్రయించాలని యోచిస్తుందని గ్రూప్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దీని కోసం వెయ్యి కోట్ల పెట్టుబడులను కూడా టాటా గ్రూప్ సిద్ధం చేసిందట. ప్రస్తుతం దేశీయంగా వైట్స్ గూడ్స్‌కు రూ.35 వేల కోట్ల మార్కెట్ ఉంది. ఈ ఓల్టస్ బ్రాండ్ కిందనే 1998 వరకు టాటాలు వైట్ గూడ్స్‌ను విక్రయించేవి. ఆ అనంతరం విక్రయాలను ఆపివేసి, 2003 వరకు ఎల్జీ, శాంసంగ్‌ల కోసం రిఫ్రిజిరేటర్లను తయారు చేసే కాంట్రాక్ట్‌ను మాత్రమే ఓల్టస్ కలిగి ఉంది. ప్రస్తుతం వైట్స్ గూడ్స్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని టాటాలు నిర్ణయించారు. ఆగస్టు నుంచి దశల వారీగా వైట్ గూడ్స్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్టు ఓల్టస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ భక్షి చెప్పారు. అక్టోబర్‌లో ప్రారంభం కాబోయే పండుగ సీజన్ వరకు దేశవ్యాప్తంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్టు అంచనా వేస్తున్నారు. దీని కోసం ఓల్టస్, టర్కీకి చెందిన ఆర్సెలిక్ ఏఎస్‌లు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఉత్పత్తులను తొలుత థాయ్‌లాండ్, చైనా, టర్కీలలోని ఆర్సెలిక్ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకుంటామని, ఆ అనంతరం వచ్చే ఏడాది నుంచి గుజరాత్లో ప్రారంభించబోయే ప్లాంట్‌లో ఈ ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభిస్తామని భక్షి చెప్పారు. 2019 ద్వితీయార్థం నుంచి 10 లక్షల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, 5 లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను రూపొందిస్తామని తెలిపారు. దీని కోసం రూ.240 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ ఏసీ వ్యాపారాల్లో ఆధిపత్య స్థానంలో ఉంది. వైట్స్ గూడ్స్ రీ-లాంచింగ్‌తో ఈ మార్కెట్లోనూ ఆధిపత్యస్థానాన్ని కైవసం చేసుకోనుంది. బెకో-పార్టనర్స్ ఆఫ్ ఎవ్రీడే అనే ట్యాగ్‌లైన్‌లో ఓల్టస్ బెకో ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. ఓల్టస్ విక్రయాలను, పంపిణీని, సర్వీసులను చూసుకుంటే, ఆర్సెలిక్ టెక్నాలజీ, తయారీ సేవలను అందించనుంది. -
ఫ్లిప్ కార్ట్: 1 బిలియన్ డాలర్ల టార్గెట్
కోల్ కత్తా : ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ టార్గెట్ నిర్దేశించుకుంది. టెలివిజన్, వైట్ గూడ్స్ ఉత్పత్తుల విక్రయాల్లో 2018 మార్చి వరకు 1 బిలియన్ డాలర్ల టార్గెట్ ను అంటే 6700 కోట్ల అమ్మకాలను చేధించాలని ఫ్లిప్ కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే మూడింతలు ఎక్కువ వృద్ధి. ''టెలివిజన్, అప్లియన్స్ ఫ్లిప్ కార్ట్ లో చాలా త్వరగా వృద్ధి చెందుతున్న కేటగిరీ. ఈ ఏడాది బిగ్ బిలియన్ డే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఇండస్ట్రీ విక్రయాలు 60వేల కోట్లలో 10 శాతానికి పైగా అంటే 6700 కోట్ల విక్రయ టార్గెట్ ను మేము నిర్దేశించుకున్నాం. దేశంలో ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్న వాటిలో రెండో అతిపెద్ద విక్రయదారిమి మేమే'' అని ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద ఉపకరణాల అధినేత సందీప్ కర్వా తెలిపారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, వైట్ హౌజ్ వేర్ హౌజింగ్ ను విస్తరిస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతమున్న ఆన్ లైన్ టెలివిజన్ 8 శాతం విక్రయాలను 18 శాతానికి పెంచుకోవాలని కూడా ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. ఎయిర్ కండీషన్లను 8-9 శాతం, వాషింగ్ మిషన్లను, రిఫ్రిజిరేటర్లను 6-7 శాతం పెంచుకోనున్నట్టు తెలిపింది. వచ్చే వేసవి వరకు సొంత లేబల్ పై ఫ్లిప్ కార్ట్ ఎయిర్-కండీషనర్లను కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కొన్ని చిన్న ఉపకరణలపై ప్రైవేట్ లేబల్ ను ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లాంచ్ చేసింది. స్మార్ట్ బై బ్రాండు కింద మిక్స్డ్ గ్రైండర్, జ్యూసర్స్, ఇండక్షన్ కుక్ టాప్స్, శాండ్విచ్ కేటగిరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది.