
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్
స్టోరీ...
వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది.
భారీగా పెరుగుదల...!
వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం.
పండుగల సీజన్‌లోనే పెంచాల్సింది..!
అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్‌లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది.
భయపడుతున్న కంపెనీలు...
కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్‌లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
టీవీలకు సుంకాల దెబ్బ...
ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment