shipping charges
-
భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ల ధరలు!
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్సీడీ/ఎల్ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది. భారీగా పెరుగుదల...! వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం. పండుగల సీజన్లోనే పెంచాల్సింది..! అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది. భయపడుతున్న కంపెనీలు... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టీవీలకు సుంకాల దెబ్బ... ఎల్ఈడీ/ఎల్సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. -
ఇక ఇంటి ముందుకే ఇసుక !
కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం నేడోరేపో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మీకు ఇసుక అవసరం ఉందా..? ఇక దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్, ఈ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు. ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేస్తారు. సీనరేజి చార్జీలు, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు. ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేసేం దుకు నిర్ణయించిన టీ సర్కార్ ఇసుకపై కొత్త విధానం ప్రకటించనున్నట్టు తెలిసింది. దీనికి మంత్రిమండలి కూడా ఆమోదం తెలిపింది. దీనిపై నేడోరేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. స్థానికులకు సీనరేజి ఉండదు తెలంగాణ ప్రాంతంలో నదులు, వాగులు, రిజర్వాయర్లలో డీ సిల్టింగ్, ప్రైవేట్ భూముల్లో డీసిల్టింగ్ చేయడం ద్వారా ఇసుక లభ్యత ఉంటుందని తెలి పింది. ఇసుకను 5 రకాలుగా విభజించారు. అందులో ఒకటి, రెండు రకాలుగా నిర్ధ్దారించిన వాటిలో ఇసుక రీచ్‌లను స్థానిక సంస్థలకు వదిలేస్తారు. స్థానికులు వీటి నుంచి గృహావసరాలు, స్కూల్ భవనం, కమ్యూనిటీ హాల్స్‌కు ఎలాంటి సీనరేజి చెల్లించకుండా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని కమిటీ తెలిపింది. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదు. గ్రామపరిధి దాటి రవాణా చేయడానికి వీల్లేదు. కేటగిరీ 3, 4, 5లకు సంబంధించి ఇసుక తవ్వకాలకు ‘వాల్టా’ చట్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది. ఈ 3 కేటగిరీల్లో ఇసుక రీచ్‌లను గనులు, భూగర్భవనరుల శాఖ యంత్రాంగం నీటిపారుదల, రెవెన్యూ, భూగర్భ జలవనరులను సంప్రదిస్తుందని వివరించారు. జేసీల ఆధ్వర్యంలో కమిటీ తుంగభద్ర నది ఎడమవైపు, కృష్ణా, గోదావరి, రిజర్వాయర్ల బ్యాక్‌వాటర్, ఈ నదుల ఉపనదులు, రిజర్వాయర్లలో ఇసుక డీ సిల్టింగ్‌ను ఆ శాఖ గుర్తిస్తుందని మంత్రి ఉపసంఘం తెలిపింది. తరువాత సంబంధిత జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఇసుక రీచ్‌లకు సంబంధించి సాధ్యాసాధ్యాలను వాల్టా చట్టానికి లోబడి నిర్ణయిస్తుంది. వీటిలో ఇసుక తవ్వకాలు, నియంత్రణ, సరఫరా బాధ్యతను తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ)కు అప్పగించనున్నట్టు పేర్కొంది. దీని కోసం అన్ని అనుమతులను టీఎస్ఎండీసీ నుంచి తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో ‘పెసా’ చట్టం ప్రకారం ఇసుక విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం క్యూబిక్ మీటరుకు వసూలు చేస్తున్న సీనరేజి రూ. 40ను పెంచాలని ఉపసంఘం సిఫారసు చేసింది. ప్రస్తుతం పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే.. నియంత్రణ పెంచాలని నిర్ణయించింది. వేధింపుల కట్టడికే.. ఇసుక రీచ్‌ల నుంచి రవాణా చేసే సమయంలో అధికారుల వేధింపుల నుంచి తప్పించడానికి కొత్త ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు తెలిసింది. తక్కువ ధరకు ఇసుక ప్రజలకు అందించాలన్న ఉద్దేశం మేరకు ప్రభుత్వమే సరఫరా చేయనుంది, ఇసుక కావాల్సిన వ్యక్తికి సొంత రవాణా వ్యవస్థ ఉంటే, సీనరేజి చార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. ఇక గతంలో క్వారీల అనుమతి తీసుకుని డబ్బు చెల్లించకుండా, వినియోగించుకుండా ఉన్న వాటిని రద్దు చేయాలని నిర్ణయించింది. ఖరీదైన డోలమైట్, సున్నపురాయి, ఐరన్‌ఓర్, గ్రానైట్, బంగారం, వజ్రాలను బహిరంగ వేలంలో విక్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. క్వారీలకు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చే అధికారాన్ని కలెక్టర్ల నుంచి తహశీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది.