Production costs
-
భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ల ధరలు!
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్సీడీ/ఎల్ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది. భారీగా పెరుగుదల...! వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం. పండుగల సీజన్లోనే పెంచాల్సింది..! అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది. భయపడుతున్న కంపెనీలు... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టీవీలకు సుంకాల దెబ్బ... ఎల్ఈడీ/ఎల్సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. -
స్వల్ప ఆదాయాలతో రైతుకు చేటు
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో తక్కువ ధరతో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించాలనేది ప్రపంచ మార్కెట్ డిజైన్‌గా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ అవసరాల కోసం కాకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం హైటెక్ టెక్నాలజీని వాడుతున్న విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. రైతుకు సబ్సిడీలు కాదు.. తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడం ద్వారా రైతులే దేశానికి సబ్సిడీలు అందిస్తున్నారు. వ్యవసాయంలోకి కార్పొరేషన్లు ప్రవేశించే కొద్ది చిన్న కమతాలు తప్పుకుంటున్నాయి. వాటిలో వచ్చే స్వల్ప ఆదాయాలు రైతుకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. న్యాయవాదిగా కూడా పనిచేస్తున్న ఒక న్యూయార్క్ రైతు కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు : నేను ఈరోజు న్యాయవాద కార్యాలయంలో పనిచేయడానికి ప్రయత్నించాను. కానీ నా మనసు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నేను చూస్తున్న పాడిపరిశ్రమ రైతుల జీవితాల్లో విధ్వంసం చుట్టూ తిరిగింది. చాలా కాలం నుండి మా ప్రాంతంలో రైతులు తమ వద్ద ఉన్న కొన్ని భూములను అమ్మివేసి మిగిలిన భూములను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? నాకు తెలీదు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన వ్యవసాయ ఉత్పాదక వ్యవస్థ ఉన్న అమెరికాలోనే వ్యవసాయ సంక్షోభం ఈ స్థితిలో అలుముకుంటున్నప్పుడు మనం కూడా ఒకసారి ఆగి మళ్లీ ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు మనం వేయవలసిన ప్రశ్న ఒక్కటే. అమెరికా వ్యవసాయ విధానం ఉద్దేశపూర్వకంగా వ్యవసాయరంగాన్ని క్షీణింపచేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉందా? ఈ అర్థంలో భారతీయ వ్యవసాయం కూడా ఆ దశలోనే ప్రయాణిస్తోందా? భారతదేశంలో భూకమతాలు చిన్నవి కాబట్టి ఆర్థికంగా లాభసాటి కావు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ సగటు వ్యవసాయ పొలం పరిమాణం 444 ఎకరాలుగా ఉంటున్న అమెరికాలో కూడా చిన్న కుటుంబ పొలాలు వైదొలగాల్సిందేనా? సగటు వ్యవసాయ భూమి పరిమాణం కనీసం 4,331 హెక్టార్లుగా ఉంటున్న ఆస్ట్రేలియాలోనూ వ్యవసాయం నష్టదాయకంగానే ఉండాల్సిందేనా? ఈ దేశాల్లో సాగుతున్న వ్యవసాయ పరిమాణాన్ని చూస్తే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు వ్యవసాయం నుంచి వైదొలగడానికి సమర్థమైన కారణం లేదు. చిన్న కమతాలు లాభదాయకం కాదు అనుకున్నట్లయితే, భారీ కమతాలు కూడా ఆర్థికంగా లాభదాయకం ఎలా కాకుండా పోతాయి? భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ రైతులకు నిజ ఆదాయాలను తోసిపుచ్చి వ్యవసాయ ఆదాయానికి వారిని దూరం చేస్తున్నారన్న వాస్తవాన్ని అంగీకరించడానికి మన విధాన నిర్ణేతలు తిరస్కరించకపోతే పరిస్థితులు ఇలా ఉండేవి కావు. మొట్టమొదటగా, మనం ఒక విషయం పట్ల స్పష్టంగా ఉందాం. అమెరికాలో ఎప్పట్నుంచో సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి దూరం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా వ్యవసాయం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అమెరికన్ వ్యవసాయ మంత్రి సోన్నీ పెరూడ్య ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా ఒక ప్రకటన చేశారు. ‘అమెరికాలో, పెద్దది మరింత పెద్దది అవుతుంది అలాగే చిన్నది అడ్రస్ లేకుండా పోతుంది’. అమెరికాలో నాటి అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ హయాంలో పనిచేసిన మాజీ అమెరికా వ్యవసాయ మంత్రి ఎర్ల్ బట్జ్ సుప్రసిద్ధ వ్యాఖ్య చేశారు. ‘మరింత ఎదగండి లేదా వెళ్లిపోండి.’ దీనితర్వాత అత్యంత జాగ్రత్తతో ‘ప్రపంచానికి తిండి పెట్టడం’ అనే పేరిట సిద్ధం చేసిన ముసాయిదాలో ‘భారీ స్థాయిలో మిగులు ఉత్పత్తి చేయండి’ అని రైతులకు పిలుపునిచ్చారు. అదనపు ఉత్పత్తి అంటే వాస్తవానికి ధరలు పడిపోవడమనే అర్థం. ఇలాంటి దూకుడు చర్య అమెరికా సన్నకారు రైతులను ఇక్కట్లలోకి నెట్టింది. ప్రభుత్వ విధానాల కారణంగానే చాలామంది వ్యవసాయ వాణిజ్యం నుంచి పక్కకు తప్పుకోవడమే కాకుండా వ్యవసాయరంగం నుంచి తీవ్ర నిరాశతో వైదొలిగారు. మరింత భారీగా పెరగండి అనే విధానం వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణ పెరిగేందుకు ఆహ్వానం మాత్రమే. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని కూడా అనుసరించాలంటూ రాసిన అలిఖిత విధానంగా కూడా మారింది. అది ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కావచ్చు లేక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) కావచ్చు ప్రపంచ వాణిజ్య విధానాలన్నీ బడా వ్యవసాయ దిగ్గజ సంస్థలు వ్యవసాయరంగంలోకి ప్రవేశించే వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. పోటీ అనేది మార్కెట్ మంత్రంగా మారినందున, అభివృద్ధి చెందుతున్న, వెనుకబడి ఉన్న దేశాల్లో తక్కువ ధరతో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించాలని నిర్బంధిస్తున్నారు. దీనివల్ల లక్షలాది సన్నకారు రైతులు వ్యవసాయం నుంచి నిష్క్రమిస్తున్నారు. దీన్ని ఇంకాస్త విపులంగా చూద్దాం. చైనాలో అతి పెద్ద పాడిపరిశ్రమ విస్తీర్ణం 2 కోట్ల 25 లక్షల ఎకరాలు. ఇది పోర్చుగల్ విస్తీర్ణంతో సమానం. వరల్డ్‌అట్లాస్.కామ్ ప్రకారం ఈ వ్యవసాయ క్షేత్రంలో లక్ష ఆవులు ఉన్నాయి. ఇక రెండో అతిపెద్ద పాడి పరిశ్రమ కోటీ 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది కూడా చైనాలోనే ఉంది. ప్రపంచంలోని పది అతిపెద్ద పాడి పరిశ్రమ సంస్థల్లో ఎనిమిది సంస్థలు ఆస్ట్రేలియాలో ఉంటున్నాయి. రీజనల్ దిగ్గజ సంస్థ అయిన ఆర్సీఈపీ ద్వారా చైనా తదితర దేశాలు భారత్‌లోకి దూరాలని తీవ్రంగా ప్రయత్నించాయంటే ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. సరైన సమయంలో భారతదేశం ఆర్సీఈపీలో చేరకూడదని నిర్ణయించుకోవడం ముదావహం. మన దేశంలో పాడిపరిశ్రమలో కోటి మంది ప్రజలు భాగం పంచుకుంటున్నారన్నది తెలిస్తే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనాల నుంచి తక్కువ ధరకు లభించే పాల ఉత్పత్తులు భారత్‌లోని కోటిమంది జీవితాలను ధ్వంసం చేసిపడేసేదని అర్థమవుతుంది. వ్యవసాయం కేసి చూస్తే గ్రామీణ భారత్‌లాగే గ్రామీణ అమెరికా కూడా తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత్‌కు లాగే అమెరికాలోని 17 రాష్ట్రాల్లో అంటే దాదాపు సగం దేశంలోని రైతు కుటుంబాల సగటు ఆదాయం సంవత్సరానికి 20 వేల రూపాయంగా మాత్రమే ఉంటోంది. అంటే అమెరికా వ్యవసాయం కూడా ఏమంత మంచిగా సాగటం లేదు. అమెరికాలో సగం పైగా రాష్ట్రాల రైతుల ఆదాయం ప్రతికూల గమనంతో ఉంది. అమెరికన్ ఫామ్ బ్యూరో ఫెడరేషన్ ప్రకారం 91 శాతం రైతులు, వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతోపాటు అక్కడి వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా రైతులు వ్యవసాయాన్నే వదిలేయాల్సి వస్తుందని భయపడుతున్నారు. 2019లో అమెరికా వ్యవసాయ రుణం 416 బిలి యన్ డాలర్లకు పెరగనుందని అంచనా. ఇది 1980ల నుంచి చూస్తే అత్యధిక మొత్తంగా చెప్పాలి. అనేక దశాబ్దాలుగా మన దేశంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు స్తంభించిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ ధరలు కిలో వంద రూపాయలకు పెరిగితేనే అల్లాడిపోతున్నాం. కానీ గత 30 సంవత్సరాలుగా అమెరికాలో రైతులు పండిం చిన పంటల ధరలు ఏమాత్రం పెరగలేదు. ఇక 5 దశాబ్దాలుగా మొక్క జొన్న ధరలు అలాగే ఉంటున్నాయి. వ్యవసాయరంగంలో అత్యున్నత సాంకేతిక జ్ఞానాన్ని వినియోగిస్తూ, తక్కిన ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడుతున్న దేశంలోనే వ్యవసాయ సంక్షోభం ఇంత తీవ్రస్థాయిలో ఉందంటే, భారతీయ వ్యవసాయరంగంలో అత్యధునాతన (తరచుగా అవాంఛిత) టెక్నాలజీని మరింతగా వాడాలని చేస్తున్న సూచనలు, సలహాలు అసందర్భపూరితమనే చెప్పాలి. టెక్నాలజీకి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ దాన్ని మరొకరి వాణిజ్య ప్రయోజనాల కోసం కాకుండా అవసరాలపై ఆధారపడి టెక్నాలజీని వినియోగించాలి. వ్యవసాయంలో పూర్తిగా హైటెక్ పద్ధతులను అవలంబిస్తున్న దేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు పట్టణ ప్రాంతాల్లో ఆత్మహత్యల కంటే 45 శాతం ఎక్కువగా ఉంటున్నాయంటే, భారతీయ వ్యవసాయాన్ని మనం పూర్తిగా పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. చిన్న కమతాలను వృద్ధి చేయడం ద్వారానే గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్లడాన్ని తగ్గించగలమా? దేశీయ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సరికొత్త వ్యూహాన్ని వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అవలంబించడం ద్వారానే మన వ్యవసాయాన్ని పర్యావరణ స్వావలంబన, ఆర్థిక లాభదాయకత వైపు తీసుకుపోవచ్చు. భారతీయ రైతులు గత రెండు దశాబ్దాలుగా అంటే 2000–01 నుంచి 2016–17 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం 14 శాతం నష్టాలను చవిచూస్తున్నారు. ఇది వినియోగదారులకు తాము చెల్లించాల్సిన దానికంటే 25 శాతం తక్కువ ధరలతో మేలు కలిగిస్తోంది. మరోమాటలో చెప్పాలంటే ఇన్నేళ్లుగా వ్యవసాయదారులు దేశానికే సబ్సిడీని అందిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్న ప్రపంచ ఆర్థిక డిజైన్ ప్రపంచ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలను పెంచుతోంది. జర్మనీ, హాలండ్, కెనడా, అమెరికా, భారతదేశంలోని వీధుల్లో రైతుల నిరసనలకు దిగుతున్నారు. ఆస్ట్రేలియా జాతీయ రైతుల సమాఖ్య అధ్యక్షుడు మెక్లాక్లాన్ కొన్నాళ్ల క్రితం ఒక రైతుల ర్యాలీలో చెప్పిన మాట ప్రపంచ వ్యాప్తంగా రైతు ఆగ్రహానికి కారణాన్ని స్పష్టం చేస్తోంది. అదేమిటంటే...‘‘తక్కిన ఆస్ట్రేలియా మొత్తానికి సబ్సిడీని అందించే పనిలో మేం అలసిపోయాం, రోగగ్రస్తులమైపోయాం’’. వ్యాసకర్త దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్ : hunger55@gmail.com. -
మారుతీ కార్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్న కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నామని పేర్కొన్న ఈ కంపెనీ ఎంత మేరకు ధరలను పెంచేది వెల్లడించలేదు. కమోడిటీ ధరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్నాయని, ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ భారాన్ని కొంత వినియోగదారులపై మోపక తప్పడం లేదని పేర్కొంది. అందుకే వివిధ మోడళ్ల కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నామని వివరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ రూ.2.53 లక్షల ఖరీదుండే ఎంట్రీలెవల్ కారు ఆల్టో800 నుంచి రూ.11.45 లక్షల ధర గల ప్రీమియమ్ క్రాసోవర్ ఎస్–క్రాస్ వరకూ విభిన్న రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కాగా, టయోటా తన వాహనాల ధరలను 4 శాతం వరకూ, ఇసుజు మోటార్స్ కంపెనీ తన వాహనాల ధరలను రూ. లక్ష వరకూ పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!
- వ్యాపార విస్తరణకు సంస్థల అడుగులు - ప్రాతీయ మార్కెట్‌పై దృష్టి - సంప్రదాయ రూట్లో పీవీఆర్, ఐనాక్స్ - భారీ డీల్స్‌తో పెరుగుతున్న కార్నివాల్ సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గింది. దీనికి తగ్గట్టే సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు ఇపుడు ఏ సినిమా అయినా సాధారణంగా రెండు మూడు భాషల్లో విడుదలవుతోంది. ఇవన్నీ కలిసి సినిమా థియేటర్లకు గిరాకీ పెంచుతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మల్టీప్లెక్స్‌లు భారీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నాయి. సినిమాల సంఖ్యకు తగ్గట్టుగా థియేటర్లు పెరగటం లేదని, ఈ లోటును భర్తీ చేయటానికి తాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలపై దృష్టి సారిస్తున్నామని మల్టీప్లెక్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో మాల్స్ కూడా భారీగా వస్తుండటంతో థియేటర్లు ఏర్పాటు చేయటమూ వాటికి పెద్ద కష్టం కావటం లేదు. ప్రాంతీయ మార్కెట్‌పై మల్టీప్లెక్స్‌ల కన్ను భవిష్యత్తు అవకాశాలన్నీ ప్రాంతీయ మార్కెట్లోనే ఉన్నాయని భావిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు.. తమ దృష్టిని జాతీయ మార్కెట్ నుంచి ప్రాంతీయ మార్కెట్‌పైకి మళ్లిస్తున్నాయి. ‘‘దేశంలో అధిక సంఖ్యలో చిన్న చిన్న పట్టణాలున్నాయి. వీటిల్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు ఈ పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది’’ అనేది మల్టీప్లెక్స్ వ్యాపారంలో అత్యధిక వాటా కలిగి ఉన్న పీవీఆర్ గ్రూప్ అభిప్రాయం. ఎక్కువ థియేటర్లున్న ఐనాక్స్, సినీ పోలిస్, కార్నివాల్ సినిమాస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది సంస్థ అభిప్రాయం. పెరగనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు: నిజానికి ఇప్పటిదాకా పీవీఆర్, సినీ పోలిస్లు సంప్రదాయ విస్తరణపైనే (మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణం) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అంతే తప్ప వేరే సంస్థను కొనుగోలు చేయటం వంటివేమీ చేయలేదు. పీవీఆర్ గత రెండేళ్ల నుంచీ ఏడాదికి 70-75 స్క్రీన్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇపుడు ఈ సంఖ్యను 100కు చేర్చే యోచనతో ఉంది. ‘‘దేశంలో సినిమా ప్రదర్శనలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంప్రదాయక విస్తరణ అత్యవసరం. దీనివల్ల కొత్త స్క్రీన్లు వస్తాయి. కార్నివాల్ సంస్థ విస్తరణను స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. మారింది కేవలం మల్టీప్లెక్స్‌ల ముందు బ్యానర్ మాత్రమే’’ అని పీవీఆర్ గ్రూప్ పేర్కొంది. కార్నివాల్ సంస్థ ఇటీవల రిలయన్స్ మీడియా వర్క్స్‌కు చెందిన ‘బిగ్ సినిమాస్’లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఆ సంస్థను చేజిక్కించుకుంది. దీనివల్ల బిగ్ సినిమాస్ థియేటర్లన్నీ ఇకపై కార్నివాల్ సినిమాస్‌గా మారతాయని, అంతేతప్ప కొత్తగా స్క్రీన్లు పెరగటం వంటిది జరగదనేది పీవీఆర్ అభిప్రాయం. మరో అగ్రశ్రేణి సంస్థ సినీపోలిస్ కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యను మరో 60కి పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘దేశంలో మల్టీప్లెక్స్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశాలున్నాయి. ఫన్ సినిమాతో ఒప్పందం చేసుకునేదాకా మేం ఒంటరిగానే వ్యాపార విస్తరణను చేపట్టాం. ప్రస్తుతం దేశంలో చాలా చైన్ మల్టీప్లెక్స్‌లు మావే. సంప్రదాయక విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. ఉనికి, లాభదాయకతపైనే వ్యాపార వృద్ధి అధారపడి ఉంటుంది’’ అని గ్రూప్ అభిప్రాయపడింది. ఈ ఏడాది కార్నివాల్ కూడా తన స్క్రీన్ల సంఖ్యను 500కు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థలు కొత్త స్క్రీన్లను మొదట కోల్‌కతా, తర్వాత బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీలలో నిర్మించనున్నాయి. మనకు థియేటర్ల సంఖ్య సమస్యేనా? ‘‘సినిమాల సంఖ్య పరంగా చూస్తే మనకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే దేశంలో ఏటా 1000కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సంవత్సరానికి 4 బిలియన్ల టికెట్లను విక్రయిస్తున్నాం. మనకు ఉన్న సమస్యల్లా వాటి ప్రదర్శనకు తగినన్ని థియేటర్లు లేకపోవటమే’’ అనేది ఐనాక్స్ గ్రూప్ మాట. 10 లక్షల జనాభాకు మనం 9 స్క్రీన్లను (2 మల్టీప్లెక్స్‌లు) మాత్రమే కలిగి ఉంటే చైనా 25 స్క్రీన్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మన దేశంలోని మొత్తం మల్టీప్లెక్స్ స్క్రీన్లు 2,050 మాత్రమే. -
చేదు గీతం
పడిపోయిన పంచదార ధర నష్టాలు దిశగా చక్కెర మిల్లులు ఉత్పత్తి ఖర్చులు రాని వైనం గగ్గోలు పెడుతున్న యాజమాన్యాలు వ్యాట్‌తో నిండా మునిగిపోతున్న పరిశ్రమ చోడవరం: జిల్లాలోని నాలుగు సుగర్ ఫ్యాక్టరీలు నష్టాలతో సతమతమవుతున్నాయి. రోజురోజుకు పంచదార ధరలు తగ్గిపోవడంతోపాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్‌కు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యాట్ చా ర్జీలు లేకపోవడంతో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చక్కెర మన రాష్ట్రంలోకి తక్కువ ధరకు దిగుమతి అవుతోంది. రాష్ట్రంలో చక్కెర కొనాలంటే క్వింటాకు రూ.150 వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పరిస్థితిలో వ్యాట్ ఛార్జి కూడా కొనుగోలుదారులపైనే ఫ్యాక్టరీలు సహకార రంగంలోని చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. రోజు రోజుకు మార్కెట్లోపంచదార ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అసలే హుదుహుద్ తుఫాన్ దెబ్బ..ఆపై తగ్గిన చెరకు దిగుబడి..గతేడాది బకాయిలు ఇప్పటికీ రైతులకు చెల్లించని కొన్ని ఫ్యాక్టరీలు.. దీనికి తోడు పిడుగులాంటి వ్యాట్‌తో జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు నష్టాల బాట పడుతున్నాయి. దీనివల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అదనంగా క్వింటా దగ్గర రూ.150 పెరుగుతోంది. అంతర్జాతీయంగా పంచదారకు డిమాండ్ తగ్గడంతో రాష్ట్రీయ చక్కెర ఎగుమతులు నామమాత్రంగాగానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం క్వింటా పంచదార ధర రూ.2450కి పడిపోయింది. 2013-14క్రషింగ్ సీజన్ ముగిసే నాటికి అంటే ఈ ఏడాది మార్చినెలలో క్వింటా రూ3050కు అమ్మగా క్రమేణా రూ. 2900, 2700లకు అమ్మింది. ఈ ధరకే ఫ్యాక్టరీలు గగ్గోలు పెడుతుంటే వారం రోజుల నుంచి ఏకంగా 2550, 2450కి ధర పడిపోవడంతో సహకార చక్కెర కర్మాగారాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. పెరిగిన ముడిసరుకుల ధరలు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులు, రైతులకు చెల్లించేధర కలుపుకుంటే క్వింటా పంచదార ఉత్పత్తికి ఫ్యాక్టరీలకు రూ.3వేలు వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం ధర చూస్తే అసలుకే ఎసరు వచ్చేటట్టు ఉంది. ఇక లాభాలు మాట దేవుడెరుగు ఉత్పత్తి వ్యయమైనా గిట్టుబాటైతే చాలని అంటున్నాయి యాజమాన్యాలు. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలే లాభనష్టాలు లేకుండా నడుస్తున్నాయి. వీటికి కూడా ఈ ఏడాది నష్టాలు తప్పవంటున్నారు. రెండునెలల కిందట సంభవించిన హుదుహుద్ తుఫాన్‌కు గోవాడ, అనకాపల్లి. ఏటికొప్పాక ఫ్యాక్టరీలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్టరీ మిల్లుహౌస్లు, గోడౌన్లలో నిల్వ ఉంచిన పంచదార బస్తాలు కూడా తడిసి నష్టాలబారిన పడ్డాయి. ఈ క్రమంలో గోవాడ ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా నష్టపోయింది. రూ.2700ధరలోనైనా ఉన్న నిల్వలను అమ్ముడుపోకపోవడం, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సుగర్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోపక్క పాత నిల్వలే ఇంకా పూర్తిగా అమ్మకం కాకపోగా ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభం కావడంతో కొత్త పంచదార కూడా గోడౌన్లకు వచ్చి చేరనుంది. తగ్గుముఖం పట్టిన పంచదార ధరతో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. -
మహీంద్రా, టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాహనాల ధరలను 1-2% వరకూ పెంచాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నందున ధరలు పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వెల్లడించాయి. వాణిజ్య వాహనాల ధరలను గత నెల నుంచే పెంచామని టాటా మోటార్స్ పేర్కొంది. ప్రయాణికుల వాహనాల ధరలను పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను 1% వరకూ పెంచింది. ఈ పెరుగుదల ఈ నెల నుంచే వర్తిస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను పాక్షికంగా తట్టుకోవడానికి ధరలను రూ.2,300 నుంచి రూ.11,500 వరకూ పెంచామని వివరించారు. ట్రాక్టర్ల ధరలను రూ.6,000 నుంచి రూ.10,000 వరకూ పెంచామని తెలిపారు. మహీంద్రా కంపెనీ స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ500, ఆల్ఫా, వంటి మోడళ్లను, అర్జున్, యువరాజ్ వంటి ట్రాక్టర్లను విక్రయిస్తోంది.