మహీంద్రా, టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాహనాల ధరలను 1-2% వరకూ పెంచాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నందున ధరలు పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వెల్లడించాయి. వాణిజ్య వాహనాల ధరలను గత నెల నుంచే పెంచామని టాటా మోటార్స్ పేర్కొంది. ప్రయాణికుల వాహనాల ధరలను పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించింది.
ఇక మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను 1% వరకూ పెంచింది. ఈ పెరుగుదల ఈ నెల నుంచే వర్తిస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను పాక్షికంగా తట్టుకోవడానికి ధరలను రూ.2,300 నుంచి రూ.11,500 వరకూ పెంచామని వివరించారు. ట్రాక్టర్ల ధరలను రూ.6,000 నుంచి రూ.10,000 వరకూ పెంచామని తెలిపారు. మహీంద్రా కంపెనీ స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ500, ఆల్ఫా, వంటి మోడళ్లను, అర్జున్, యువరాజ్ వంటి ట్రాక్టర్లను విక్రయిస్తోంది.