న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీ వాహన విక్రయాలు మేలో జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్‌తో అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా మహీంద్రా, కియా, టయోటా, హోండా కార్స్, స్కోడా సానుకూల అమ్మకాలను సాధించాయి.
ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ద్వి చక్ర వాహన, ట్రాక్టర్స్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు.
‘‘గత ఏడాది ఇదే సమయంలో కోవిడ్ రెండో దశ కారణంగా కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ రికవరీ దశలో ఉంది. ఉత్పత్తి పెరుగుదలతో కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది’’ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
మారుతీ సుజుకీ మేనెల మొత్తం అమ్మకాలు 1,61,413 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే మేలో విక్రయించిన 46,555 యూనిట్లతో పోలిస్తే 224 % అధికంగా ఉంది.
టాటా మోటార్స్ రికార్డు స్థాయిలో 43,341 యూనిట్ల అమ్మకాలతో 185% వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏకంగా 626% వృద్ధితో 3,454 ఈవీలను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment