![Ola Electric Q3 Net loss widens to Rs 564 crore Mahindra and Mahindra profit rises](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/ola.jpg.webp?itok=TvBZNdVx)
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన(ఈ2డబ్ల్యూ) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(Q3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. ఆదాయం నీరసించడం, తీవ్రతర పోటీ, సర్వీస్ సవాళ్లతో పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి.
గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 376 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,296 కోట్ల నుంచి రూ. 1,045 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 1,597 కోట్ల నుంచి రూ. 1,505 కోట్లకు తగ్గాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.33 లక్షల యూనిట్ల ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఓలా వెల్లడించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే ఇవి 37 శాతంపైగా అధికమని తెలియజేసింది. సర్వీసింగ్ సమస్యల పరిష్కారానికి రూ. 110 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఓలా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.4 శాతం నీరసించి రూ. 70 వద్ద ముగిసింది.
ఎంఅండ్‌ఎం లాభం స్పీడ్
ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 3,181 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,658 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 41,470 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 35,299 కోట్ల టర్నోవర్ నమోదైంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/mahindra_0.jpg)
ఆటో విభాగంలో అమ్మకాలు 16 శాతం పుంజుకుని 2,45,000కు చేరగా.. యూవీ విక్రయాలు 1,42,000 యూనిట్లను తాకాయి. ఈ విభాగం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 23,391 కోట్లకు చేరింది. నికర లాభం 20 శాతం బలపడి రూ. 1,438 కోట్లయ్యింది. వ్యవసాయ పరికరాల విభాగం నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 996 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం లాభంతో రూ. 3,193 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment