the company
-
డొకొమో ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టాటా డొకొమో పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో పేరుతో కొత్త డాంగిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అయిదు ఉపకరణాలను ఇంటర్నెట్కు అనుసంధానించవచ్చు. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. ఇందులోని పవర్‌బ్యాంక్ పోర్టబుల్ చార్జర్‌గా పనిచేస్తుంది. 32 జీబీ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌ను డాంగిల్‌కు పొందుపరిచారు. ధర రూ.2,899. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సౌకర్యం ఉందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ సంజీవ ఝా ఈ సందర్భంగా తెలిపారు. -
మహీంద్రా, టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాహనాల ధరలను 1-2% వరకూ పెంచాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నందున ధరలు పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వెల్లడించాయి. వాణిజ్య వాహనాల ధరలను గత నెల నుంచే పెంచామని టాటా మోటార్స్ పేర్కొంది. ప్రయాణికుల వాహనాల ధరలను పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను 1% వరకూ పెంచింది. ఈ పెరుగుదల ఈ నెల నుంచే వర్తిస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను పాక్షికంగా తట్టుకోవడానికి ధరలను రూ.2,300 నుంచి రూ.11,500 వరకూ పెంచామని వివరించారు. ట్రాక్టర్ల ధరలను రూ.6,000 నుంచి రూ.10,000 వరకూ పెంచామని తెలిపారు. మహీంద్రా కంపెనీ స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ500, ఆల్ఫా, వంటి మోడళ్లను, అర్జున్, యువరాజ్ వంటి ట్రాక్టర్లను విక్రయిస్తోంది. -
అక్రమాలకు ‘ఆలం’బన!
అర్హత లేని కంపెనీకి రూ.1.23 కోట్ల విలువైన టెండర్? ఇదీ జలమండలి నిర్వాకం అక్రమాలపై విజిలెన్స్ ఆరా జలమండలిని అక్రమాల జలగలు పట్టుకున్నాయ్. అవినీతే ‘ఆలం’బనగా ముందుకు సాగుతున్నాయ్. నిబంధనలు...అనుమతులతో పని లేకుండా అడ్డగోలు వ్యవహారాలకు గేట్లు ఎత్తుతున్నాయ్. ఈ కోవలోనే ఏకంగా రూ.1.23 కోట్ల విలువైన టెండర్‌ను అర్హతలేని ఓ సంస్థకు కట్టబెట్టేందుకు బోర్డు అధికారులు పావులు కదుపుతున్నారు. జలమండలిలో టెండరు నిబంధనలకు నీళ్లొదిలారు. నీటి నాణ్యతను ప్రశ్నార్థకంగా మార్చేందుకు కొందరు అధికారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కేందుకు సిద్ధమయ్యారు. పటాన్చెరు నిర్వహణ డివిజన్ (డివిజన్-8)పరిధిలో మంజీరా ఫేజ్-1, 2, 3, 4ల నుంచి నగరానికి సరఫరా చేస్తున్న నీటి శుద్ధికి ఫెర్రిక్ ఆలం సరఫరాకు రూ.1.62 కోట్ల విలువైన టెండరును ఓ అర్హత లేని కంపెనీకి కట్టబెట్టేందుకు బోర్డు అధికారులు ప్రయత్నిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఈ టెండరుకు సంబంధించి 20.6.2014న వెలువడిన పరిపాలనపరమైన అనుమతి (ఏఎస్.నెం.277 2014-15), 23.06.2014న జారీచేసిన సాంకేతిక అనుమతి (టీఎస్.నెం.24 2014-15)ని పక్కన పెట్టారు. తాజాగా ఈనెల 10న రూ.1.62 కోట్ల విలువైన టెండరును మూడు ముక్కలు చేసి, రూ.1.23 కోట్లు, రూ.21 లక్షలు, రూ.18 లక్షలుగా విభజించారు. అనుభవం, పీసీబీ గుర్తింపు, అర్హతలు లేనప్పటికీ టెండరును విభజించి అందులో రూ.1.23 కోట్ల విలువైన ఆలం సరఫరా టెండర్‌ను కట్టబెట్టేందుకు కొందరు అధికారులు లోపాయికారిగా ఆ సంస్థతో చేతులు కలిపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10న జారీ చేసిన టెండరు నోటిఫికేషన్లో సరఫరా చేయాల్సిన ఫెర్రిక్ ఆలం (గ్రేడ్-4 ఐఎస్ 299:2012) ప్రమాణాలు సైతం పేర్కొనకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం తాగునీటి శుద్ధికి వినియోగించే ఫెర్రిక్ ఆలంకు ఈ ప్రమాణాలు ఉండాలి. కానీ తాము మొగ్గుచూపుతున్న కంపెనీకోసం అధికారులు ఈ ప్రమాణాలకు నీళ్లొదలడం గమనార్హం. మరోవైపు టెండరు ఖరారుకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 94 నిబంధనలను సైతం పక్కనపెట్టినట్టు సమాచారం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ప్రమాణాల ప్రకారం లేని ఆలంతో తాగునీటిని శుద్ధిచేస్తే నీటిలోని మలినాలు తొలగక నీటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అక్రమాల జాతర ఇలా ... బోర్డులో కొందరు అధికారుల నిర్వాకంతో నిబంధనలకు గండి కొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలం టెండర్లకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో టెండరు ప్రక్రియ మొదలైనపుడే ఆర్థిక బిడ్లు(ఫైనాన్స్) తెరవకుండా జాప్యం చేశారు. తీరా ఇపుడు ఓ అర్హత లేని కంపెనీకి టెండరు దక్కేలా నిబంధనలను తారుమారు చేసి తాజా నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. ఆ సంస్థ భాగోతంగతంలో కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలోనూ వెలుగు చూసినప్పటికీ జలమండలి అధికారులు దానిపైనే వల్లమాలిన ప్రేమ కనబరుస్తున్నారు. విజిలెన్స్ ఆరా జలమండలి ఆలం సరఫరా టెండర్లలో అక్రమాలపై విజిలెన్స్ విభాగం దృష్టిసారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంలో జలమండలి సాంకేతిక, సరఫరా విభాగం ఉన్నతాధికారుల తీరుపై విచారణకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. -
ఇందిరమ్మకు చంద్ర గ్రహణం!
30లోగా సిమెంట్ గోడౌన్లను మూసి వేయండి ఖర్చు తగ్గించుకునే నెపంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గడ్డ కట్టిన సిమెంటుపై చర్యలకు నివేదించాలని ఆదేశం ఇందిరమ్మ పథకానికి చంద్ర గ్రహణం పడుతోంది. కొత్త పథకాలు చేపట్టని ప్రభుత్వం ఉన్న పథకాలకు మంగళం పాడే దిశగా ముందుకు సాగుతోంది. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకాన్ని అమలుచేస్తే..ఆయన మరణానంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఈ పథకంపై కక్ష కట్టాయి. బి.కొత్తకోట: ఇప్పుడు ఏకంగా ఇంటి నిర్మాణానికి కీలకమైన రాయితీ సిమెంట్ సరఫరా లేదన్న సంకేతాలిచ్చేందుకు ఇందిరమ్మ సిమెంట్ గోడౌన్లను మూసి వేయాలని ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలకు ఉత్తర్వులు అందాయి. దీంతో జిల్లాలోని 28 గోడౌన్లు మూతపడనున్నాయి. ఇందుకు ప్రభుత్వం పేర్కొం టున్న కారణాలు విచిత్రంగా ఉన్నాయి. ఆరు నెలలుగా గోడౌన్లల్లోని సిమెంట్ పంపిణీ కాలేదని, అలాగే జిల్లాలకు సిమెంట్ సరఫరా నిలిచిపోయిందని ఉత్తర్వుల్లో చెబుతోంది. పథకం అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం ప్రభుత్వానికే తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న సిమెంట్ నిల్వల్లో గడ్డ కట్టిన సిమెంట్కూ అధికారులను బాధ్యులను చేయూలని నిర్ణయించింది. సిమెంట్ కోసం కళ్లుకాయలు కాచేలా లబ్ధిదారులు ఎదురుచూసినా సిమెంట్ పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు గోడౌన్లల్లో గడ్డకట్టి, పనికిరాకుండాపోయిన సిమెంట్‌ను గుర్తించి..ఇలా జరిగేందుకు ఎవరు బాధ్యులో, వారిపై చర్యలు తీసుకునేందుకు నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో 2,500 టన్నుల సిమెంట్ నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఈ సిమెంట్‌ను ఈ నెలాఖరులోగా నిర్మితకేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పంపిణీ చేసి గోడౌన్లు అన్ని మూసేయాలని, తద్వారా ప్రభుత్వంపై ఖర్చుల భారం తగ్గించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సిమెంట్ పంపిణీ అనుమానమే? గోడౌలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఒకపై ఇందిరమ్మ లబ్ధిదారులకు రాయితీ సిమెంట్ పంపిణీ లేనట్టేనని స్పష్టమవుతోంది. ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ రాయితీ సిమెంట్‌ను అందించారు. కంపెనీల నుంచి బస్తాను రూ.153.50తో కొనుగోలు చేసి రవాణా ఖర్చులతో రూ.158కు పంపిణీ చేసేవారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విచ్చలవిడిగా ధరను పెంచే శారు. 2011లో బస్తాకు రూ.20 అదనంగా పెంచి రూ.180 చేశారు. 2012లో బస్తాపై రూ.3.70 పైసలు పెంచి రూ.183.50 చేశారు. ఇదే ఏడాది మరోసారి రూ.5 పెంచి బస్తాను రూ.188.50 చేశారు. ఈ పరిస్థితుల్లో 2013 అక్టోబర్‌లో అనూహ్యంగా ధర పెంచి బస్తాను రూ.235గా నిర్ణయించారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఈ ధరతోనే సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం గోడౌన్ల మూసివేత నిర్ణయంతో భవిష్యత్తులో లబ్ధిదారులకు సిమెంటు పంపిణీ లేనట్టేనన్న సంకేతాలు ఇస్తోంది. ఇది లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
ఆదాకు ఆలివ్ చిట్కా..
ఆదా, పొదుపు ఇవి సగటు జీవికే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకూ చాలా కీలకమే. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోగలమా అని కంపెనీలు నిరంతరం అన్వేషిస్తుంటాయి. పైసానే కదా అని చూసీ చూడనట్లుగా వదిలేయకుండా జాగ్రత్త పడి కోట్లు మిగుల్చుకుంటూ ఉంటాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఇదే చేసింది. ఆ కంపెనీ తమ ప్రయాణికులకిచ్చే సలాడ్‌లో ఆలివ్‌తో పాటు అయిదు వెరైటీలు ఉండేవి. ఇందుకోసం ప్రతి సలాడ్‌కి ఎనభై సెంట్లు ఖర్చయ్యేది. అయితే, చాలా మంది ఈ ఆలివ్‌ను తినకుండా వదిలేస్తుండటాన్ని గమనించి ప్రయోగాత్మకంగా సలాడ్‌లో నుంచి ఆలివ్‌ను తగ్గించారు. దీంతో సలాడ్ వ్యయం 33 శాతం మేర తగ్గి అరవై సెంట్లకి దిగొచ్చింది. ఈ రకంగా ఒకే ఒక్క ఆలివ్‌ను తగ్గించడం ద్వారా కంపెనీ ఏడాదికి 5,00,000 డాలర్లు (దాదాపు రూ. 3 కోట్లు) మిగుల్చుకుంది. అనవసర వ్యయాలు తగ్గించుకోవడానికి మిగతా వారు కూడా దీన్ని అమల్లో పెట్టొచ్చు. ఉదాహరణకు దుస్తులు మొదలు ఇంటి కొనుగోలు దాకా చాలా అంశాల్లో ఈ ఫార్ములా ప్రయత్నించవచ్చు. బాగుంది కదాని అవసరం లేకపోయినా అదనపు బెడ్రూం ఇల్లు తీసుకోకుండా ఉంటే ఆ మేరకు మిగుల్చుకున్నట్లే. అలాగని నిత్యావసరాలకు కూడా అన్వయించుకోకుండా వీలైన చోట్ల మాత్రమే ఇలాంటి ఆలివ్లను పక్కన పెడితే బోలెడంత ఆదా అయినట్లే. -
క్రెడిట్ కార్డు...జర జాగ్రత్త బాసూ..
చాలా రోజుల నుంచి ప్రయత్నించగా.. ప్రయత్నించగా శీనుకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. హుషారుగా ఎల్ఈడీ టీవీ కొనేద్దామని షాపింగ్‌కి బైల్దేరాడు. తీరా తీసుకున్న తర్వాత తెలిసింది.. కార్డు లిమిట్ అంత లేదని. సరే, లిమిట్‌లోనే వేరేది తీసుకుందామని ఇంకో షాపుకి వెడితే అక్కడ సదరు బ్యాంకు క్రెడిట్ కార్డు పనిచేయదన్నారు. మొత్తానికి అది చెల్లుబాటయ్యే షాపులో ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. కట్టేందుకు యాభై రోజుల దాకా టైం ఉంటుంది కదా అనుకున్నాడు. తీరా చూస్తే మరో పదిహేను రోజుల్లో కట్టాలంటూ రెండురోజులకే బిల్లు వచ్చేసింది. కొన్నవాటితో పాటు సర్చార్జీలంటూ కొంత మొత్తం ఎక్స్ట్రా ఉంది. మినిమం బ్యాలెన్స్ అయినా కట్టకపోతే పెనాల్టీలు గట్రా వాటి గురించి చాంతాడంత లిస్టు కూడా దాంతో పాటు పంపింది కంపెనీ. దీంతో నెలాఖరులో ఇంత పెద్ద మొత్తం ఎలా కట్టాలిరా బాబూ అంటూ తలపట్టుకున్నాడు శీను. అసలు లొసుగులు ఇంకా ఏమేం ఉన్నాయో తెలుసుకునేందుకు అప్పుడు ఉపక్రమించాడు. ఇలా.. ఇలాంటి వాటి గురించి ఆఖర్న తెలుసుకోవడం కాకుండా ముందుగానే జాగ్రత్తపడితే శీనులా చివర్లో ఇబ్బంది పడనక్కర్లేదు. దాని గురించే ఈ కథనం.. వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన కీలకాంశాల్లో వడ్డీ రేటు కూడా ఒకటి. గడువులోగా కట్టేసిన పక్షంలో వడ్డీ రేట్లతో సమస్యేమీ ఉండదు. కానీ ఎప్పుడైనా సమస్య ఎదురై, డిఫాల్ట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్యాంకును బట్టి నెలకు దాదాపు 1.99 శాతం నుంచి 3 శాతం పైన ఉంటున్నాయి. నెలవారీగా కాస్త తక్కువే అన్నట్లుగా అనిపించినా.. వార్షికంగా చూస్తే ఇవి 36 శాతం పైగా ఉంటాయి. క్రెడిట్ లిమిట్.. కార్డు హోల్డరు ఎంత మేర రుణం తీసుకోవచ్చనేది తెలియజేసేదే క్రెడిట్ లిమిట్. కార్డు హోల్డరు చెల్లింపు సామర్ధ్యం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తుంది బ్యాంకు. సాధ్యమైనంత వరకూ ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్నది చూసి తీసుకోవడం మంచిది. ఒకవేళ ప్రారంభంలో తక్కువ లిమిట్ ఇచ్చినా.. కొన్నాళ్ల పాటు కొనుగోళ్లు, చెల్లింపుల ట్రాక్ రికార్డును చూసి బ్యాంకులు లిమిట్‌ని పెంచే అవకాశం ఉంది. వార్షిక ఫీజులు.. చార్జీలు.. ఏవో కొన్ని మినహా.. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై వార్షిక ఫీజులు, రెన్యువల్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఇవి రూ. 500 నుంచి ఉంటున్నాయి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లును బ్యాంకుకు వెళ్లి కట్టినా.. అదనంగా మరికొంత సమర్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాహనంలో ఇంధనం కొంటే సర్‌చార్జీ అని, ఏదైనా కొనుగోలును ఈఎంఐ కింద మార్చుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులని, నగదు విత్‌డ్రా చేసుకుంటే ఇంత చార్జీ అని రకరకాలు ఉంటాయి. ఇవే కాకుండా, లేట్ పేమెంట్ల వంటి వాటి వ్యవహారంలో పెనాల్టీలు ఏ స్థాయిలో ఉంటాయో కూడా తెలుసుకోవాలి. గ్రేస్ పీరియడ్.. క్రెడిట్ కార్డుపై చేసే లావాదేవీలకు సంబంధించి చెల్లింపులు జరిపేందుకు బ్యాంకులు కొంత సమయం ఇస్తుంటాయి. దీన్ని గ్రేస్ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇది 20-50 రోజుల దాకా ఉంటోంది. బిల్లు వచ్చాక చెల్లించడానికి ఎన్ని రోజుల వ్యవధి ఉంటుంది, అసలు బిల్లింగ్ తేదీలు, చెల్లింపు తేదీలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఎక్కువ కాలం గ్రేస్ పీరియడ్ ఉండే క్రెడిట్ కార్డును చూసి తీసుకుంటే మంచిది. రివార్డులు.. సాధారణంగా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినందుకుగాను కొన్ని రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. ఈ పాయింట్లతో సినిమా టికెట్ల నుంచి వివిధ వస్తువుల దాకా కొనుక్కోవచ్చు. మీరు తీసుకునే క్రెడిట్ కార్డుకు బ్యాంకు ఎలాంటి రివార్డులు అందిస్తోందో తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్.. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్న పక్షంలో అధిక వడ్డీ రేటు కార్డులో బ్యాలెన్స్‌ని తక్కువ వడ్డీ రేటు ఉండే కార్డుకు మార్చుకోవచ్చు. ఇలాంటప్పుడు చార్జీలెంత ఉంటున్నాయో చూసుకోవాలి. గరిష్ట ప్రయోజనం.. క్రెడిట్ కార్డుతో గరిష్టంగా గ్రేస్ పీరియడ్‌ను ఉపయోగించుకునేందుకు ఒక మార్గం ఉంది. సాధారణంగా ప్రతి కార్డుకు రెండు బిల్లింగ్ తేదీలు కూడా ఉంటాయి. ఈ బిల్లింగ్ డేట్‌ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అత్యధికంగా గ్రేస్ పీరియడ్ దక్కించుకోవచ్చు. ఉదాహరణకు, బిల్లింగ్ తేదీ (అంటే.. మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంటును బ్యాంకు సిద్ధం చేసే తేదీ) ప్రతి నెలా పదో తారీఖు, గ్రేస్ పీరియడ్ గరిష్టంగా నలభై అయిదు రోజులు అనుకుందాం. ఆ రోజున జనరేట్ అయ్యే బిల్లును దాదాపు ఇరవై అయిదో తారీఖు ప్రాంతంలో కట్టాల్సి రావొచ్చు. దీని వల్ల పదో తారీఖుకు ఒక రెండు రోజుల ముందు కొనుగోళ్లు చేసినా.. అవి అదే నెల బిల్లులో ప్రతిఫలిస్తాయి. ఫలితంగా గ్రేస్ పీరియడ్ సుమారు పదిహేను రోజులు మాత్రమే లభిస్తుంది. అదే.. రెండు, మూడు రోజులు ఆగి పదో తారీఖు దాటాక కొనుగోలు చేసినట్లయితే, సదరు వ్యయం ఆ పై నెల స్టేట్మెంట్లో వస్తుంది. స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత సుమారు పదిహేను రోజుల సమయం చిక్కుతుంది. అంటే దాదాపు నలభై రోజుల పైగా గ్రేస్ పీరియడ్ లభించినట్లవుతుంది.