అక్రమాలకు ‘ఆలం’బన! | The company is not eligible to tender for the Rs .1.23 crore? | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ‘ఆలం’బన!

Published Mon, Oct 20 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

అక్రమాలకు ‘ఆలం’బన!

అక్రమాలకు ‘ఆలం’బన!

  • అర్హత లేని కంపెనీకి  రూ.1.23 కోట్ల విలువైన టెండర్?
  •  ఇదీ జలమండలి నిర్వాకం
  •  అక్రమాలపై విజిలెన్స్ ఆరా
  • జలమండలిని అక్రమాల జలగలు పట్టుకున్నాయ్. అవినీతే ‘ఆలం’బనగా ముందుకు సాగుతున్నాయ్. నిబంధనలు...అనుమతులతో పని లేకుండా అడ్డగోలు వ్యవహారాలకు గేట్లు ఎత్తుతున్నాయ్. ఈ కోవలోనే ఏకంగా రూ.1.23 కోట్ల విలువైన టెండర్‌ను అర్హతలేని ఓ సంస్థకు కట్టబెట్టేందుకు బోర్డు అధికారులు పావులు కదుపుతున్నారు.    
     
    జలమండలిలో టెండరు నిబంధనలకు నీళ్లొదిలారు. నీటి నాణ్యతను ప్రశ్నార్థకంగా మార్చేందుకు కొందరు అధికారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కేందుకు సిద్ధమయ్యారు. పటాన్‌చెరు నిర్వహణ డివిజన్ (డివిజన్-8)పరిధిలో మంజీరా ఫేజ్-1, 2, 3, 4ల నుంచి నగరానికి సరఫరా చేస్తున్న నీటి శుద్ధికి ఫెర్రిక్ ఆలం సరఫరాకు రూ.1.62 కోట్ల విలువైన టెండరును ఓ అర్హత లేని కంపెనీకి కట్టబెట్టేందుకు బోర్డు అధికారులు ప్రయత్నిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది.

    ఈ టెండరుకు సంబంధించి 20.6.2014న వెలువడిన పరిపాలనపరమైన అనుమతి (ఏఎస్.నెం.277 2014-15), 23.06.2014న జారీచేసిన సాంకేతిక అనుమతి (టీఎస్.నెం.24 2014-15)ని పక్కన పెట్టారు. తాజాగా ఈనెల 10న రూ.1.62 కోట్ల విలువైన టెండరును మూడు ముక్కలు చేసి, రూ.1.23 కోట్లు, రూ.21 లక్షలు, రూ.18 లక్షలుగా విభజించారు. అనుభవం, పీసీబీ గుర్తింపు, అర్హతలు లేనప్పటికీ టెండరును విభజించి అందులో రూ.1.23 కోట్ల విలువైన ఆలం సరఫరా టెండర్‌ను కట్టబెట్టేందుకు కొందరు అధికారులు లోపాయికారిగా ఆ సంస్థతో   చేతులు కలిపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    10న జారీ చేసిన టెండరు నోటిఫికేషన్‌లో సరఫరా చేయాల్సిన ఫెర్రిక్ ఆలం (గ్రేడ్-4 ఐఎస్ 299:2012) ప్రమాణాలు సైతం పేర్కొనకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం తాగునీటి శుద్ధికి వినియోగించే ఫెర్రిక్ ఆలంకు ఈ ప్రమాణాలు ఉండాలి. కానీ తాము మొగ్గుచూపుతున్న కంపెనీకోసం అధికారులు ఈ ప్రమాణాలకు నీళ్లొదలడం గమనార్హం. మరోవైపు టెండరు ఖరారుకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 94 నిబంధనలను సైతం పక్కనపెట్టినట్టు సమాచారం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ప్రమాణాల ప్రకారం లేని ఆలంతో తాగునీటిని శుద్ధిచేస్తే నీటిలోని మలినాలు తొలగక నీటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
     
    అక్రమాల జాతర ఇలా ...

    బోర్డులో కొందరు అధికారుల నిర్వాకంతో నిబంధనలకు గండి కొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలం టెండర్లకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో టెండరు ప్రక్రియ మొదలైనపుడే ఆర్థిక బిడ్లు(ఫైనాన్స్) తెరవకుండా జాప్యం చేశారు. తీరా ఇపుడు ఓ అర్హత లేని కంపెనీకి టెండరు దక్కేలా నిబంధనలను తారుమారు చేసి తాజా నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. ఆ సంస్థ భాగోతంగతంలో కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలోనూ వెలుగు చూసినప్పటికీ జలమండలి అధికారులు దానిపైనే వల్లమాలిన ప్రేమ కనబరుస్తున్నారు.
     
    విజిలెన్స్ ఆరా

    జలమండలి ఆలం సరఫరా టెండర్లలో అక్రమాలపై విజిలెన్స్ విభాగం దృష్టిసారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంలో జలమండలి సాంకేతిక, సరఫరా విభాగం ఉన్నతాధికారుల తీరుపై విచారణకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement