క్రెడిట్ కార్డు...జర జాగ్రత్త బాసూ.. | Basu to promote credit card ... .. | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డు...జర జాగ్రత్త బాసూ..

Published Fri, Jun 20 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

క్రెడిట్ కార్డు...జర జాగ్రత్త బాసూ..

క్రెడిట్ కార్డు...జర జాగ్రత్త బాసూ..

చాలా రోజుల నుంచి ప్రయత్నించగా.. ప్రయత్నించగా శీనుకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. హుషారుగా ఎల్‌ఈడీ టీవీ కొనేద్దామని షాపింగ్‌కి బైల్దేరాడు. తీరా తీసుకున్న తర్వాత తెలిసింది.. కార్డు లిమిట్ అంత లేదని. సరే, లిమిట్‌లోనే వేరేది తీసుకుందామని ఇంకో షాపుకి వెడితే అక్కడ సదరు బ్యాంకు క్రెడిట్ కార్డు పనిచేయదన్నారు. మొత్తానికి అది చెల్లుబాటయ్యే షాపులో ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. కట్టేందుకు యాభై రోజుల దాకా టైం ఉంటుంది కదా అనుకున్నాడు. తీరా చూస్తే మరో  పదిహేను రోజుల్లో కట్టాలంటూ రెండురోజులకే బిల్లు వచ్చేసింది. కొన్నవాటితో పాటు సర్‌చార్జీలంటూ కొంత మొత్తం ఎక్స్‌ట్రా ఉంది. మినిమం బ్యాలెన్స్ అయినా కట్టకపోతే పెనాల్టీలు గట్రా వాటి గురించి చాంతాడంత లిస్టు కూడా దాంతో పాటు పంపింది కంపెనీ. దీంతో నెలాఖరులో ఇంత పెద్ద మొత్తం ఎలా కట్టాలిరా బాబూ అంటూ తలపట్టుకున్నాడు శీను. అసలు లొసుగులు ఇంకా ఏమేం ఉన్నాయో తెలుసుకునేందుకు అప్పుడు ఉపక్రమించాడు. ఇలా.. ఇలాంటి వాటి గురించి ఆఖర్న తెలుసుకోవడం కాకుండా ముందుగానే జాగ్రత్తపడితే శీనులా చివర్లో ఇబ్బంది పడనక్కర్లేదు. దాని గురించే ఈ కథనం..
 
 వడ్డీ రేట్లు..

 క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన కీలకాంశాల్లో వడ్డీ రేటు కూడా ఒకటి. గడువులోగా కట్టేసిన పక్షంలో వడ్డీ రేట్లతో సమస్యేమీ ఉండదు. కానీ ఎప్పుడైనా సమస్య ఎదురై, డిఫాల్ట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్యాంకును బట్టి నెలకు దాదాపు 1.99 శాతం నుంచి 3 శాతం పైన ఉంటున్నాయి. నెలవారీగా కాస్త తక్కువే అన్నట్లుగా అనిపించినా.. వార్షికంగా చూస్తే ఇవి 36 శాతం పైగా ఉంటాయి.

క్రెడిట్ లిమిట్..

కార్డు హోల్డరు ఎంత మేర రుణం తీసుకోవచ్చనేది తెలియజేసేదే క్రెడిట్ లిమిట్. కార్డు హోల్డరు చెల్లింపు సామర్ధ్యం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తుంది బ్యాంకు. సాధ్యమైనంత వరకూ ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్నది చూసి తీసుకోవడం మంచిది. ఒకవేళ ప్రారంభంలో తక్కువ లిమిట్ ఇచ్చినా.. కొన్నాళ్ల పాటు కొనుగోళ్లు, చెల్లింపుల ట్రాక్ రికార్డును చూసి బ్యాంకులు లిమిట్‌ని పెంచే అవకాశం ఉంది.  
 
వార్షిక ఫీజులు.. చార్జీలు..

ఏవో కొన్ని మినహా.. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై వార్షిక ఫీజులు, రెన్యువల్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఇవి రూ. 500 నుంచి ఉంటున్నాయి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లును బ్యాంకుకు వెళ్లి కట్టినా.. అదనంగా మరికొంత సమర్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాహనంలో ఇంధనం కొంటే సర్‌చార్జీ అని, ఏదైనా కొనుగోలును ఈఎంఐ కింద మార్చుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులని, నగదు విత్‌డ్రా చేసుకుంటే ఇంత చార్జీ అని రకరకాలు ఉంటాయి. ఇవే కాకుండా, లేట్ పేమెంట్ల వంటి వాటి వ్యవహారంలో పెనాల్టీలు ఏ స్థాయిలో ఉంటాయో కూడా తెలుసుకోవాలి.

 గ్రేస్ పీరియడ్..

క్రెడిట్ కార్డుపై చేసే లావాదేవీలకు సంబంధించి చెల్లింపులు జరిపేందుకు బ్యాంకులు కొంత సమయం ఇస్తుంటాయి. దీన్ని గ్రేస్ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇది 20-50 రోజుల దాకా ఉంటోంది. బిల్లు వచ్చాక చెల్లించడానికి ఎన్ని రోజుల వ్యవధి ఉంటుంది, అసలు బిల్లింగ్ తేదీలు, చెల్లింపు తేదీలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఎక్కువ కాలం గ్రేస్ పీరియడ్ ఉండే క్రెడిట్ కార్డును చూసి తీసుకుంటే మంచిది.
 
రివార్డులు..

సాధారణంగా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినందుకుగాను కొన్ని రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. ఈ పాయింట్లతో సినిమా టికెట్ల నుంచి వివిధ వస్తువుల దాకా కొనుక్కోవచ్చు. మీరు తీసుకునే క్రెడిట్ కార్డుకు బ్యాంకు ఎలాంటి రివార్డులు అందిస్తోందో తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.
 
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్..

ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్న పక్షంలో అధిక వడ్డీ రేటు కార్డులో బ్యాలెన్స్‌ని తక్కువ వడ్డీ రేటు ఉండే కార్డుకు మార్చుకోవచ్చు. ఇలాంటప్పుడు చార్జీలెంత ఉంటున్నాయో చూసుకోవాలి.
 
 గరిష్ట ప్రయోజనం..

 క్రెడిట్ కార్డుతో గరిష్టంగా గ్రేస్ పీరియడ్‌ను ఉపయోగించుకునేందుకు ఒక మార్గం ఉంది. సాధారణంగా ప్రతి కార్డుకు రెండు బిల్లింగ్ తేదీలు కూడా ఉంటాయి. ఈ బిల్లింగ్ డేట్‌ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అత్యధికంగా గ్రేస్ పీరియడ్ దక్కించుకోవచ్చు. ఉదాహరణకు, బిల్లింగ్ తేదీ (అంటే.. మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంటును బ్యాంకు సిద్ధం చేసే తేదీ) ప్రతి నెలా పదో తారీఖు, గ్రేస్ పీరియడ్ గరిష్టంగా నలభై అయిదు రోజులు అనుకుందాం. ఆ రోజున జనరేట్ అయ్యే బిల్లును దాదాపు ఇరవై అయిదో తారీఖు ప్రాంతంలో కట్టాల్సి రావొచ్చు. దీని వల్ల పదో తారీఖుకు ఒక రెండు రోజుల ముందు కొనుగోళ్లు చేసినా.. అవి అదే నెల బిల్లులో ప్రతిఫలిస్తాయి. ఫలితంగా గ్రేస్ పీరియడ్ సుమారు పదిహేను రోజులు మాత్రమే లభిస్తుంది. అదే.. రెండు, మూడు రోజులు ఆగి పదో తారీఖు దాటాక  కొనుగోలు చేసినట్లయితే, సదరు వ్యయం ఆ పై నెల స్టేట్‌మెంట్‌లో వస్తుంది. స్టేట్‌మెంట్ జనరేట్ అయిన తర్వాత సుమారు పదిహేను రోజుల సమయం చిక్కుతుంది. అంటే దాదాపు నలభై రోజుల పైగా గ్రేస్ పీరియడ్ లభించినట్లవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement