గడువులోపు కార్డు బిల్లు చెల్లించ లేదంటే అంతే..
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్‌సీడీఆర్‌సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్‌సీడీఆర్‌సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్‌జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్‌సీడీఆర్‌సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.
ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్‌సీడీఆర్‌సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment