2024లో 4.15 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2024)లో ఇప్పటివరకూ 4.15 బిలియన్ డాలర్లు లభించాయి. రియల్టీ రంగ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం వార్షికంగా ఇవి 32 శాతం అధికం. పెట్టుబడుల్లో అత్యధికంగా హౌసింగ్ విభాగానికి ప్రవహించినట్లు తెలియజేసింది. 2024 ఇండియాలో పీఈ పెట్టుబడుల ట్రెండ్ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ రియల్టీలో పీఈ పెట్టుబడులు 415 కోట్ల డాలర్లను అధిగమించాయి.
వేర్‌హౌసింగ్ ఆధిపత్యం
రియల్టీ రంగ మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్‌హౌసింగ్ 45 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా.. రెసిడెన్షియల్ విభాగం 28 శాతం వాటాను ఆక్రమించింది. కార్యాలయ విభాగం 26 శాతం పెట్టుబడులను ఆకట్టుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ విభాగం రెట్టింపునకుపైగా వృద్ధితో 117.7 కోట్ల డాలర్లు అందుకుంది. గృహ కొనుగోళ్లలో వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతోంది. కాగా.. వేర్‌హౌసింగ్‌కు 187.7 కోట్ల డాలర్లు అందితే.. ఆఫీస్ ప్రాపర్టీలకు 109.8 కోట్ల డాలర్లు లభించాయి.
పదేళ్లుగా పెరుగుదల..
ప్రధానంగా భారత్‌లో గత దశాబ్ద కాలం నుంచి పెట్టుబడులు పుంజుకుంటున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్థిక సుస్థిరత, నిరవధిక వృద్ధి సహకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈకామర్స్, థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ ఊపందుకున్న నేపథ్యంలో వేర్‌హౌసింగ్‌కు భారీ డిమాండ్ నెలకొన్నట్లు వివరించారు. వెరసి వేర్‌హౌసింగ్ విభాగం అత్యధిక పెట్టుబడులకు నెలవుగా మారినట్లు తెలియజేశారు. ఈ బాటలో గృహ రంగం సైతం ప్రస్తావించదగ్గ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?
ఆఫీసులు కళకళ
పీఈ పెట్టుబడుల్లో కార్యాలయ విభాగం కొంతమేర నీరసించినప్పటికీ ఉద్యోగులు తిరిగి వర్క్‌ప్లేస్‌లకు రావడం, ఆఫీసులు పెరగడం, అద్దెలు బలపడటం వంటి అంశాలు అండగా నిలుస్తున్నట్లు శిశిర్ వివరించారు. ఇక దేశీయంగా మొత్తం రియల్టీ పీఈ పెట్టుబడుల్లో ముంబై 50 శాతం వాటాను ఆక్రమించడం గమనార్హం! మొత్తం పెట్టుబడుల్లో 42 శాతం వాటాకు సమానమైన 1.7 బిలియన్ డాలర్లు యూఏఈ నుంచి లభించాయి. దేశీ పీఈ ఇన్వెస్టర్లు 32 శాతం వాటాకు సమానమైన 1.3 బిలియన్ డాలర్లు సమకూర్చారు! సింగపూర్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి 63.37 కోట్ల డాలర్లు ప్రవహించాయి.
Comments
Please login to add a commentAdd a comment