ఇందిరమ్మకు చంద్ర గ్రహణం! | The Company lunar eclipse! | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు చంద్ర గ్రహణం!

Published Sat, Sep 6 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

ఇందిరమ్మకు చంద్ర గ్రహణం!

ఇందిరమ్మకు చంద్ర గ్రహణం!

  • 30లోగా సిమెంట్ గోడౌన్‌లను మూసి వేయండి
  •  ఖర్చు తగ్గించుకునే నెపంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం  
  •  గడ్డ కట్టిన సిమెంటుపై చర్యలకు  నివేదించాలని ఆదేశం
  • ఇందిరమ్మ పథకానికి చంద్ర గ్రహణం పడుతోంది. కొత్త  పథకాలు చేపట్టని ప్రభుత్వం ఉన్న పథకాలకు మంగళం పాడే దిశగా ముందుకు సాగుతోంది. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకాన్ని అమలుచేస్తే..ఆయన మరణానంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఈ పథకంపై కక్ష కట్టాయి.
     
    బి.కొత్తకోట: ఇప్పుడు ఏకంగా ఇంటి నిర్మాణానికి కీలకమైన రాయితీ సిమెంట్ సరఫరా లేదన్న సంకేతాలిచ్చేందుకు ఇందిరమ్మ సిమెంట్ గోడౌన్‌లను మూసి వేయాలని ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలకు ఉత్తర్వులు అందాయి. దీంతో జిల్లాలోని 28 గోడౌన్‌లు మూతపడనున్నాయి.

    ఇందుకు ప్రభుత్వం పేర్కొం టున్న కారణాలు విచిత్రంగా ఉన్నాయి. ఆరు నెలలుగా గోడౌన్లల్లోని సిమెంట్ పంపిణీ కాలేదని, అలాగే జిల్లాలకు సిమెంట్ సరఫరా నిలిచిపోయిందని ఉత్తర్వుల్లో చెబుతోంది. పథకం అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం ప్రభుత్వానికే తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న సిమెంట్ నిల్వల్లో గడ్డ కట్టిన సిమెంట్‌కూ అధికారులను బాధ్యులను చేయూలని నిర్ణయించింది. సిమెంట్ కోసం కళ్లుకాయలు కాచేలా లబ్ధిదారులు ఎదురుచూసినా సిమెంట్ పంపిణీ చేయలేదు.

    అయితే ఇప్పుడు గోడౌన్లల్లో గడ్డకట్టి, పనికిరాకుండాపోయిన సిమెంట్‌ను గుర్తించి..ఇలా జరిగేందుకు ఎవరు బాధ్యులో, వారిపై చర్యలు తీసుకునేందుకు నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో 2,500 టన్నుల సిమెంట్ నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఈ సిమెంట్‌ను ఈ నెలాఖరులోగా నిర్మితకేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పంపిణీ చేసి గోడౌన్లు అన్ని మూసేయాలని, తద్వారా ప్రభుత్వంపై ఖర్చుల భారం తగ్గించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  
     
    సిమెంట్ పంపిణీ అనుమానమే?
     
    గోడౌలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఒకపై ఇందిరమ్మ లబ్ధిదారులకు రాయితీ సిమెంట్ పంపిణీ లేనట్టేనని స్పష్టమవుతోంది. ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ రాయితీ సిమెంట్‌ను అందించారు. కంపెనీల నుంచి బస్తాను రూ.153.50తో కొనుగోలు చేసి రవాణా ఖర్చులతో రూ.158కు పంపిణీ చేసేవారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విచ్చలవిడిగా ధరను పెంచే శారు. 2011లో బస్తాకు రూ.20 అదనంగా పెంచి రూ.180 చేశారు.

    2012లో బస్తాపై రూ.3.70 పైసలు పెంచి రూ.183.50 చేశారు. ఇదే ఏడాది మరోసారి రూ.5 పెంచి బస్తాను రూ.188.50 చేశారు. ఈ పరిస్థితుల్లో 2013 అక్టోబర్‌లో అనూహ్యంగా ధర పెంచి బస్తాను రూ.235గా నిర్ణయించారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఈ ధరతోనే సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం గోడౌన్ల మూసివేత నిర్ణయంతో భవిష్యత్తులో లబ్ధిదారులకు సిమెంటు పంపిణీ లేనట్టేనన్న సంకేతాలు ఇస్తోంది. ఇది లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement