
ఈ ధోరణి అత్యంత ఆందోళనకరం
లోక్‌పాల్ ఉత్తర్వుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఒక హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిపై లోక్‌పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ధోరణి ఏమాత్రం ఆమోదనీయం కాదని పేర్కొంది. ఈ మేరకు లోక్‌పాల్ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఒక హైకోర్టు జడ్జిపై నమోదైన రెండు ఫిర్యాదులను విచారిస్తూ లోక్‌పాల్ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రకు భంగం కల్గించేలా లోక్‌పాల్ వ్యవహరిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు జడ్జి ఉదంతంలో స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌తోపాటు హైకోర్టు జడ్జిపై ఫిర్యాదుచేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
సుప్రీంకోర్టు అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. హైకోర్టు జడ్జి ఎప్పుడూ కూడా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం,2013 పరిధిలోకి రారని మెహతా వాదించారు. ఈ కేసులో హైకోర్టు జడ్జి పేరు బహిర్గతం కాకుండా చూడాలని, ఆ ఫిర్యాదుదారు పేరు, అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను రహస్యంగా ఉంచాలని లోక్‌పాల్ రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ఈ అంశంలో కోర్టుకు సాయపడతా.
హైకోర్టు జడ్జీల విషయంలో ఇలాంటివి పునరావృతంకాకుండా ఒక చట్టం ఉంటే మంచిది’’ అని ఈ అంశంలో కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కేసు తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. లోక్‌పాల్‌లో ఫిర్యాదుచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక కేసును నమోదుచేసింది. ఈ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఈ హైకోర్టు సిట్టింగ్ అడిషనల్ జడ్జిని ఈ ప్రైవేట్ సంస్థ కోరింది.
ఈ జడ్జి గతంలో లాయర్‌గా ఉన్న కాలంలో ఇదే సంస్థకు చెందిన కేసును వాదించారు. ఇప్పుడు ఆయన జడ్జీ అయ్యాక ఈ కేసులో హైకోర్టులో మరో జడ్జి, అదనపు జిల్లా జడ్జీలను ఈయన ప్రభావితం చేశారని ఫిర్యాదుదారు లోక్‌పాల్‌లో కేసు వేశారు. దీంతో లోక్‌పాల్ జనవరి 27వ తేదీన హైకోర్టు జడ్జిపై ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013లోని సెక్షన్ 20(4) ప్రకారం హైకోర్టు జడ్జిపై విచారణ చేపట్టే హక్కు తమకు ఉందని జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సారథ్యంలోని లోక్‌పాల్ బెంచ్ పేర్కొనడంతో సుప్రీంకోర్టు చివరకు ఇలా కలగజేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment