
న్యూఢిల్లీ: ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేయడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Stand-up comedian Kunal Kamra) ఘాటుగా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన దరిమిలా, జరిగిన పరిణామాల నేపధ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్టూడియో కూల్చివేతలకు ఉపక్రమించింది. దీనిని కునాల్ కమ్రా ఖండించారు. శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేతలకు పాల్పడటం తగదని, చట్టం అందరికీ సమానంగా వర్తించదా? అని కమ్రా ప్రశ్నించారు.
స్టూడియోను కూల్చివేయడం అర్థరహితం
సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో కునాల్ కమ్రా స్పందిస్తూ వినోద వేదిక అనేది వినోదించడానికి మాత్రమే ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని, దీనికి ప్రతిగా స్టూడియోను కూల్చివేయడం అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ వెన్యూ(Entertainment venue) అనేది అన్ని రకాల ప్రదర్శనలకు కేటాయించిన స్థలమని, తాను చేసే కామెడీకి స్టూడియో బాధ్యత వహించదన్నారు. ఒక హాస్యనటుడి మాటలకు స్పందిస్తూ స్టూడియోపై దాడి చేయడం అనేది.. టమోటాలతో వెళుతున్న లారీని బోల్తా కొట్టించినంత తెలివితక్కువ పని అని, తాను వడ్డించిన బటర్ చికెన్ వారికి నచ్చకపోవడం తన తప్పుకాదని కమ్రా పేర్కొన్నారు.
పోలీసులకు, కోర్టుకు సహకరించడానికి సిద్ధం
కొందరు రాజకీయ నేతలు తనను బెదిరిస్తున్నారని, అయితే వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ధనవంతుల మీద అభిమానం పెంచుకోవడానికి మాత్రమే లేదన్నారు. రాజకీయ నేతపై వేసిన జోక్‌ను వారు తీసుకోలేకపోవడం అనేది తన స్వభావాన్ని మార్చబోదన్నారు. తనకు తెలిసినంతవరకు నేతలను, లేదా సర్కస్‌గా మారిన రాజకీయ వ్యవస్థను ఎగతాళి చేయడం చట్ట విరుద్ధం కాదని కుమ్రా అన్నారు. తనపై తీసుకునే చట్టబద్ధమైన చర్య విషయంలో పోలీసులకు, కోర్టులకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఒక జోక్‌కు మనస్తాపం చెంది, విధ్వంసానికి దిగడం సరైన ప్రతిస్పందన కాదన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా స్టూడియోను కూల్చివేసినవారి విషయంలోనూ చట్టం సమానంగా వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు హాబిటాట్ స్టూడియో(Habitat Studio), యూనికాంటినెంటల్ హోటల్‌పై దాడికి దిగిన తరువాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్టూడియో కూల్చివేతలు చేపట్టింది. హోటల్ బేస్‌మెంట్‌లో నిర్మించిన తాత్కాలిక షెడ్ , ఇతర నిర్మాణాలను కూల్చివేసినట్లు బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
‘తమిళనాడుకు రండి’: శివసేన మద్దతుదారునితో కమ్రా
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న తరుణంలో శివసేన మద్దతుదారుడొకరు ఆయనను హెచ్చరిస్తున్నట్లు ఉన్న ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్‌గా మారింది. 53 సెకన్ల ఈ ఆడియో క్లిప్‌లో కాల్ చేసిన వ్యక్తి కమెడియన్ కమ్రాను దూషిస్తూ, ముంబైలోని స్టూడియోకు జరిగినట్లే మీకూ జరుగుతుందని హెచ్చరించడం వినిపిస్తుంది.
ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను జగదీశ్ శర్మ(Jagdish Sharma)గా పరిచయం చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ తాము ముంబైలోని హోటల్, స్టూడియోలపై ఏమి చేసామో చూడండి. మీరు ఎక్కడ కనిపించినా మీకు కూడా ఇలాంటి గతి పడుతుంది అని హెచ్చరించాడు. దీనికి స్పందించిన కమ్రా తాను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నానని జగదీశ్ శర్మకు తెలిపారు. వెంటనే అతను ఆ దక్షిణ రాష్ట్రాన్ని సందర్శించి కొడతానని మరోమారు హెచ్చరించాడు. తరువాత అతను ‘ఎక్కడికి రావాలి?’ అని అడగగా, కమ్రా తాను తమిళనాడులో ఉన్నానని పునరుద్ఘాటించారు. తరువాత అతను ‘మా సార్‌తో ఒక్క నిమిషం మాట్లాడండి’ అని అంటాడు. ఆ తర్వాత కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది.
ఇది కూడా చదవండి: అస్సలు పశ్చాత్తాప పడను: షిండే వ్యాఖ్యల కేసులో కునాల్ కమ్రా
Comments
Please login to add a commentAdd a comment