joke
-
పిడుగులున్నారు... హై‘టేక్ కేర్’..!
సోషల్ మీడియాలో తిరుగుతోన్న ఓ జోక్ చూడండి. ఏడేళ్ల పిల్లాడు ఫొటో దిగడానికి వాళ్ల నాన్నతో కలిసి స్టూడియోకి వెళ్లాడు. పిల్లాడు కుదురుగా కూచుంటాడో లేదోనని కంగారు పడుతున్న వాళ్ల నాన్నని చూసి ఫొటోగ్రాఫర్ ‘‘మై హు“ నా.. ’’ అన్నట్టు కళ్లతో సైగ చేస్తూ.. చిరునవ్వుతో పిల్లాడితో ఇలా అన్నాడు.‘‘ఇటు చూడమ్మా.. కెమెరానే చూడాలి.. ఫ్లాష్ వస్తుంది.. కళ్లు మూయకూడదు. ఇలా అలా కదలకూడదు. చూడు కెమెరాలోంచి పిట్టలొస్తాయి....’’ తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ ఏడేళ్ల్ల పిల్లాడి జవాబు ఇది.. ‘‘ఏం కతలు పడుతున్నావా.. సరిగా ఫోకస్ చెయ్యి..పోట్రెయిట్ మోడ్ యూస్ చెయ్యి. ఐఎస్ఓ 200 కంటే తక్కువ పెట్టు. హై రెజల్యూషన్ పిక్ కావాలి. ఫేస్బుక్ ప్రొఫైల్ కోసం. ముచ్చట్లాపి సరిగ్గా తియ్యి.. పిచ్చుకలెలా వస్తాయి కెమెరాలోంచి ఏం మీ అయ్యగూడు పెట్టిండా కెమెరాలోపల...’’– ఫొటోగ్రాఫర్ ఫేస్ ఫీలింగ్స్... పిల్లాడి నాన్న కళ్లలో భయం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా... పిల్లలు పిడుగులవుతున్నారు.. నిన్నటి చందమామ కథలు ఇకవారి దగ్గర నడవవు.సమస్త ప్రపంచం, టెక్నాలజీ వారి చేతిలోకి వచ్చింది.ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మామూలే.. ఓ చిన్నారి.. ఏవో చిన్నచిన్న వస్తువులతో రోబో వంటి ఆకృతిని తయారు చేసింది. సముద్రాలెన్ని, ఖండాలెన్ని, వాటి పేర్లేమిటన్న పాఠాలనూ అప్పజెప్తోంది. మరో చిన్నారి ఉన్నట్టుండి చక్కగా బొమ్మలు వేయడం మొదలుపెట్టేసింది. ఇంకో చిన్నారి పేపర్‌ను మడిచి విభిన్న ఆకృతులను (ఒరిగామి) తయారు చేస్తోంది. ఇవేవీ బడిలో చెప్పినవి కాదు. తల్లిదండ్రులు నేర్పినవీ కాదు.. మరెక్కడివి? యూట్యూబ్‌లో ఎడ్యుకేషన్ వీడియోలు చూశారు. తామూ సొంతంగా ఏదో చేయాలనుకున్నారు. అంతే.. ఇలాంటి చిన్నారులెందరో ‘టెక్నాలజీ’ గురువుకు ఏకలవ్య శిష్యులు. రోజూ మూడు గంటలు సోషల్ మీడియాలో... గత ఏడాది మన దేశంలో పిల్లల సోషల్ మీడియా అలవాట్లపై సర్వే జరిగింది. అందులో 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 60 శాతం మంది రోజూ 3 గంటలకుపైనే సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు తేలింది. ► 13–17 ఏళ్ల మధ్య టీనేజర్లలో 95 శాతం 8–12 మధ్య పిల్లల్లో 40 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ► పిల్లల్లో 15 శాతం మంది రోజూ 6 గంటలకుపైగా ఫోన్ తో గడిపితే.. 46 శాతం మంది మూడు నుంచి ఆరు గంటల వరకు వాడుతున్నారు. మరో 39 శాతం మంది గంట నుంచి 3 గంటల వరకు వినియోగిస్తున్నారు. ► 18 ఏళ్లలోపువారు ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేయాలని 73 శాతం తల్లిదండ్రులు సర్వేలో పేర్కొనడం గమనార్హం. టెక్... కిక్... ప్రముఖ ప్యూ రీసెర్చ్ సంస్థ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. టీనేజ్ పిల్లలు తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 49 శాతం మంది తాము సాధించినది చెప్పుకొంటుంటే.. 44 శాతం మంది కుటుంబానికి సంబంధించిన పోస్టులు..విహార యాత్రలు, సంబరాలు, ఫంక్షన్లు వంటివి చేస్తున్నారు. ► 34 శాతం మంది తమ ఎమోషన్లను సోషల్‌మీడియాలో పంచుకుంటుంటే.. అందులో పర్సన ల్ విషయాలనూ ప్రస్తావిస్తున్నవారు 13 శాతం ఉన్నారు. ► మతపరమైన అంశాలపై 11 శాతం, రాజకీయ అంశాలపై 9 శాతం టీనేజర్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఎడ్యుకేషన్, సోషల్, ఎంటర్టెయిన్మెంట్ వంటి ఇతర అంశాలపై 28 శాతం మంది పోస్టులు పెడుతున్నారు. డిజిటల్ ఏజ్ తగ్గుతోంది... ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాల ప్రకారం.. పిల్లల చేతికి ‘టెక్’ అందుతున్న వయసు క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆధారిత పరికరాల విస్తృతే దీనికి కారణం. ఆడుతూ, పాడుతూ నేర్చుకునే క్రమంలో.. ఇటు ఇళ్లలో, అటు స్కూళ్లలో కూడా డిజిటల్ పరికరాల వినియోగం బాగా పెరిగింది. నడక నేర్చుకునే కంటే ముందే.. ‘ఫోన్ ’ను ఆపరేట్ చేయడం, గేమ్స్ ఆడటం నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. కరోనా లాగా స్పీడ్‌గా... కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏడాదికిపైగా లాక్డౌన్లు పెట్టాయి. పెద్దవాళ్లకు కాస్త వెసులుబాటు ఇచ్చినా.. పిల్లల బడులైతే ఏడాదిన్నర పాటు నడవలేదు. ఇంట్లోంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఏదీ ఆగలేదు. ఆన్ లైన్ క్లాసులతో పిల్లల చదువులు భేషుగ్గా సాగాయి. సరికొత్త బోధన దిశగా అడుగులు పడ్డాయి. అదే సమయంలో పిల్లలు తోటివారితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం ద్వారా ఒంటరితనాన్ని అధిగమించగలిగారు... అక్కడ నుంచి సోషల్ మీడియా వేగంగా అంటుకుంది. నిపుణుల అబ్జర్వేషన్ ఇదీ.. ► టెక్నాలజీ చిన్నారులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు అద్భుత అవకాశాలను ఇస్తోంది. ఎడ్యుకేషన్ యాప్స్, వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్ వంటివి కొత్త, కఠినమైన అంశాలను కూడా అరటిపండు ఒలిచి నోటికి అందించినట్టుగా అతి సులువుగా, సొంతంగా నేర్చుకోగలిగిన సామర్థ్యాన్ని ఇస్తున్నాయి. ► విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉండటంతో పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచుతోంది. ఏదైనా ఓ అంశానికి సంబంధించిన కొత్త కొత్త సంగతులను శోధించి తెలుసుకునే అవకాశాలు ఉంటున్నాయి. ► టెక్నాలజీ పిల్లల్లో చిన్ననాటి నుంచే సృజనాత్మకతకు పదును పెడుతోంది. కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయగలిగే సామర్థ్యాన్ని ఇస్తోంది. ► సొంతంగా కంటెంట్‌ను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా పంచుకోగలగడంతో పిల్లల్లో వినూత్న ఆలోచనలకు, ఆత్మవిశ్వాసం పెరగడానికి తోడ్పడుతోంది. ► పజిల్స్‌ను పరిష్కరించడం, ఎడ్యుకేషన్ సంబంధిత గేమ్స్ ఆడటం ద్వారా.. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం అలవడుతోంది. ఏదైనా సమస్యకు కొత్త తరహాలో, సులువైన పరిష్కారం కనుగొనే దిశలో ఏకాగ్రత పెంపొందుతోంది. ► ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విభిన్న నేపథ్యాలున్న పిల్లలను కలిసే అవకాశంతో సామాజిక సంబంధాలపై, భిన్నమైన ప్రాంతాల్లో పరిస్థితులపై అవగాహన ఏర్పడుతోంది. విభిన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ఎలా స్నేహం చేయాలనే సామర్థ్యం సమకూరుతోంది. వారి సూచన ఇదీ... ఇదే సమయంలో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాల అతి వినియోగం కాస్త చేటుకూ దారితీస్తోంది. పిల్లల శారీరక, మానసిక అంశాలపై ముఖ్యంగా భావోద్వేగాలపై ప్రభావం చూపుతోంది. చిన్నవయసులోనే టెక్నాలజీ వాడకంతో దుష్ప్రభావాలపైనా చాలా అధ్యయనాలు జరిగాయి. ఇబ్బందికరమైన, తప్పుడు సమాచారం, సైబర్ బుల్లీయింగ్ వంటివి పిల్లల మానసిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతున్న ఘటనలూ ఉన్నాయి. రూపాయికి బొమ్మా బొరుసు రెండూ ఉన్నట్టే.. టెక్నాలజీ వెంట మంచి, చెడు రెండూ వస్తున్నాయి. తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే చాలు. - సరికొండ చలపతి -
వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర అపుడే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రానున్న వీకెండ్లో శుక్రవారానికే నా మైండ్ స్లో డౌన్ అయిపోతోందనుకుంట. అందుకే చిన్న జోక్‌ను అర్థం చేసుకోవడానికి కూడా నిమిషం టైం పట్టిందంటూ ఆయన ట్విట్ చేశారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) వీకెండ్లో జ్యూస్ అని పలకడానికి కూడా బద్ధకం ..కేవలం ‘జూ’ తో సరిపెడతాం అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక పిక్‌ను ఆయన పోస్ట్ చేశారు. విత్ ఐస్.. జ్యూస్, వితౌట్ ఐస్ జూ , జూ + ఐస్.. ఇలా.. పలు రకాలుగా నర్మగర్భంగా ఉన్న ఈ జోక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇంకో సంగతి కూడా తన ఫ్యాన్స్‌తో షేర్ చేశారు. ‘జోక్ అర్థమయ్యాక బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకి మా ఆవిడ కుర్చీలోంచి జంప్ చేసింది’’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఇక దీనికి యథావిధిగా పలు మీమ్స్, కమెంట్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.(Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) Maybe it’s Friday & my mind is slowing down for the oncoming weekend because it took me a minute to get the joke. When I did, I laughed out so loudly my wife jumped out of her chair… pic.twitter.com/4SfjHQ8xMt — anand mahindra (@anandmahindra) August 12, 2022 pic.twitter.com/5M8mNg2s5F — sanjay kumawat (@ShoryaSanju) August 12, 2022 pic.twitter.com/8gQst5XDHc — SHIVANG (@its_shivang) August 12, 2022 -
World Funniest Joke: మామూలు జోక్ కాదు.. ఇది జోకులకే జోక్!
ఏదైనా జోక్ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్‌లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్న డౌట్ వస్తుంది కదా.. రిచర్డ్ వైస్మాన్ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు. ‘మీకు ఇష్టమైన జోకులను పెట్టండి. నచ్చిన వాటికి ఓటేయండి’అంటూ ఓ వెబ్సైట్లో ప్రకటన పెట్టాడు. ఇలా మొత్తంగా 40 వేల జోకులు పోగయ్యాయి. సుమారు 20 లక్షల మంది తమకు నచ్చిన జోక్‌కు రేటింగ్ ఇచ్చారు. అందులో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గుర్పాల్ గోస్సాల్ అనే సైకియాట్రిస్ట్ పెట్టిన జోక్ అత్యంత హాస్యభరితమైన జోక్‌గా నిలిచింది. మరి ఆ జోక్ ఏంటో చూద్దామా.. చదవండి👉🏼క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..! ఓ రోజు ఇద్దరు వేటగాళ్లు అడవికి వెళ్లారు. అందులో ఒకడు సడన్‌గా స్పృహ తప్పి పడిపోయాడు. కళ్లు తేలేసేశాడు.. ఊపిరి కూడా తీసుకుంటున్నట్లు కనపడలేదు. దీంతో చనిపోయేడామో అని రెండోవాడికి డౌట్ వచ్చింది.. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ‘నా స్నేహితుడు చనిపోయాడు. నేనిప్పుడు ఏం చేయాలి’అని టెన్షన్ పడుతూ అడిగాడు. అటు వైపు ఆపరేటర్.. ‘నేను మీకు సాయం చేస్తాను. మీరు కూల్ అవ్వండి. ముందు మీ స్నేహితుడు నిజంగానే చనిపోయాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి’అని చెప్పాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం.. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం.. ‘చనిపోయాడు.. కన్ఫర్మ్.. ఇప్పుడు నేనేం చేయాలి’అని ఆ వేటగాడు రొప్పుతూ మళ్లీ అడిగాడు.. సైంటిఫిక్‌గానూ ఇదే బెస్ట్ జోక్! మంచి జోక్‌లకు సంబంధించి.. ఆశ్చర్యం కలిగించడం, ఒత్తిడిని దూరం చేయడం వంటి కొన్ని ప్రమాణాలు ఉంటాయని, అవన్నీ ఈ జోక్‌లో ఉన్నాయని సైకాలజిస్టు రిచర్డ్ వైస్మాన్ చెప్పారు. 103 పదాలు ఉండే జోక్‌లు ఎక్కువగా నచ్చుతాయని.. ఈ జోక్‌లో 102 పదాలు (ఇంగ్లిష్‌లో) ఉన్నా యని వివరించారు. మరో చిత్రమేమిటంటే.. ఏటా అక్టోబర్ 7న, అదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జోకులు ఎక్కువగా నవ్విస్తాయని తమ సర్వేలో తేలినట్టు పరిశోధకులు చెప్తున్నారు. చదవండి👉🏼కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స... చిగురిస్తున్న కొత్త ఆశ -
చైనాపై జోక్.. నోరు జారి నాలిక కర్చుకున్నాడు
JPMorgan CEO Comments On China: ‘కమ్యూనిస్ట్ పార్టీ కంటే మా బ్యాంక్ దీర్ఘకాలం కొనసాగుతుంది.. కావాలంటే పందెం’ అంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ఆపై నాలిక కర్చుకున్నాడు. భారీ నష్టం జరగక ముందే తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మంగళవారం బోస్టన్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్లో డిమోన్ మాట్లాడుతూ.. నేను హాంకాంగ్‌లో ఉన్నా. అప్పుడు ఓ జోక్ చేశా. కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాలు చేస్తోంది. జేపీ మోర్గాన్ కూడా అంతే. కానీ, మేం వాళ్ల (కమ్యూనిస్ట్ పార్టీ) కంటే ఎక్కువ కాలం ఉంటామని పందెం కాస్తాను. ఇదే మాట నేను చైనాలో చెప్పలేను. అయినా వాళ్లు నా మాటలు వింటున్నారు’’ అంటూ మంగళవారం బోస్టన్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన జేపీ మోర్గాన్ చేజ్.. ఆగష్టులో చైనా రెగ్యులేటరీ నుంచి నుంచి సెక్యూరిటీ బ్రోకరేజ్‌కు అనుమతులు దక్కించుకుంది. తద్వారా చైనా నేలపై ఆధిపత్యం ఆలోచనకు అడుగేసింది. ఈ తరుణంలో డిమోన్ తాజా వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు కమ్యూనిస్ట్ పార్టీని ఆగ్రహానికి గురి చేయడంతో పాటు చైనాలో అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ కొంప ముంచే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అయ్యింది. అందుకే 18 గంటలు గడవకముందే డిమోన్ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. దీంతో వ్యవహారం సర్దుమణిగినట్లేనని అంతా భావిస్తున్నారు. మరోవైపు డిమోన్‌కు ఇలా నోరు జారడం కొత్తేం కాదు. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మీదే ఏకంగా కామెంట్లు చేశాడు. ట్రంప్ కంటే తానే దమ్మునోడినని, అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఓడించి తీరతానని కామెంట్లు చేశాడు. ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని క్షమాపణలు చెప్పాడు. చదవండి: జేపీ మోర్గాన్ వర్సెస్ ఎలన్ మస్క్.. సిల్లీ కామెడీ! -
జోక్ చేశాడని హత్య చేశారు!
లక్నో: కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయినా నోయిడా బిజినెస్ మ్యాన్ ఆదిత్య సోని మృతదేహం సోమవారం గ్యాంగ్ కాలువ సమీపంలో కనిపించింది. ఈ నెల 5న ఆదిత్య తన నివాసం నుంచి ఢిల్లీలోని ఓ బంధువును కలవడానికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం గ్యాంగ్ కెనాల్ వద్ద ఆదిత్య మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో ఇందుకు కారణమయిన పంకజ్, దేవ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు ఆదిత్య స్నేహితులు కావడం విశేషం. పోలీసుల విచారణలో ఆదిత్యను హత్య చేయడానికి గల కారణం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. వివరాలు ‘ఆదిత్య మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడు మాటల మధ్యలో ఆదిత్య ఓ జోక్ చేశాడు. దాని గురించి మా ముగ్గిరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మేం ఆదిత్య మీద కర్రలతో దాడి చేసి చంపేశాం. అతడి సెల్‌ఫోన్, బంగారం తీసుకుని ఆదిత్య శవాన్ని గ్యాంగ్ కెనాల్ సమీపంలోని ఓ డంప్‌యార్డ్‌లో పడేశాం’ అని తెలిపారు. పంకజ్, దేవ్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. -
రజనీకాంత్‌కి కరోనా
‘‘రజనీకాంత్‌ని మేం దేవుడిలా భావిస్తాం, ఆయన గురించి సరదాగా జోకులు వేసినా ఊరుకోం, నీది చాలా బ్యాడ్ టేస్ట్ కాబట్టే ఇలాంటి పిచ్చి జోక్ వేశావ్, కరోనా అనేది కామెడీ కాదు, ఇలాంటి జోక్ వేయడం భారతీయ సంస్కృతి కాదు. ఇంకోసారి ఇలా చేశావంటే జాగ్రత్త’’ అంటూ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ పై నెటిజన్లు మండిపడ్డారు. శనివారం రోహిత్ పై తిట్ల వర్షం కురిపించారు రజనీ అభిమానులు. దానికి కారణం ‘రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనానే క్వారంటైన్లో ఉంది’ అని తన ఇన్ స్టాగ్రామ్‌లో రోహిత్ పెట్టిన పోస్ట్. రజనీకి కరోనా వస్తే అదే నిర్భందంలో ఉండాలి తప్ప రజనీకేం కాదు అనేది అతని పోస్ట్ అర్థం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సూపర్ స్టార్‌పై వేసిన ఈ జోక్ ఆయన అభిమానులకు మింగుడుపడక, రోహిత్ రాయ్ పై మండిపడ్డారు. ‘‘నవ్వించడానికి చేశాను. అయితే అది ఇలా అవుతుందనుకోలేదు. క్షమించండి. కానీ ఇది చెత్త జోక్ అని నేను అనుకోవడంలేదు. ఇది టిపికల్ రజనీ సార్ జోక్. ఒకర్ని కామెంట్ చేసే ముందు అసలు వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో ఒకసారి ఆలోచించాలి. మీరందరూ నన్ను బాధపెట్టడానికి మెసేజులు పోస్ట్ చేస్తున్నట్లు మిమ్మల్నందర్నీ బాధపెట్టడానికి నేను ఆ జోక్ వేయలేదు’’ అని రోహిత్ రాయ్ పోస్ట్ చేశాడు. ఉద్దేశం ఏదైనా ఎవరిపై జోక్ వేస్తున్నామనేది ముఖ్యం అని కొందరు అంటున్నారు. -
టీడీపీది కార్పొరేట్ దీక్ష
సాక్షి, కడప కార్పొరేషన్ : ‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని చెప్పారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం శనివారం స్థానిక పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్ఆర్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని భావించి వైఎస్ జగన్ గుంటూరులో ఏడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. హోదా వద్దు ప్యాకేజీ చాలునని మోదీ, అరుణ్‌జైట్లీకి సన్మానాలు చేసిన చంద్రబాబుకు హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ఆర్సీపీకి మైలేజీ వస్తుందనే కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నట్లు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ పార్లమెంటులో ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదన్నారు. హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ నాయకులు అవి ఆమోదం పొందవని దుష్ప్రచారం చేశారన్నారు. నిన్న వారి రాజీనామాలు ఆమోదమయ్యాయని, ఇప్పుడు టీడీపీ వారు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ చేస్తోంది కార్పొరేట్ దీక్ష అని వైఎస్సార్సీప నేతలు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమబాబు, సుధాకర్‌రెడ్డి, తుమ్మలకుంట శివశంకర్, ఆర్వీఎస్రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్, మాజీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, చల్లా రాజశేఖర్, బంగారు నాగయ్య, నాగేంద్రారెడ్డి, బోలా పద్మావతి, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, రఘునాథరెడ్డి, ఉత్తమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే చాలా నష్టం: ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ప్రజలకు చాలా నష్టమని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఛంబల్‌లోయ దొంగలముఠా తరహాలో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. ఏడేళ్లుగా రాజ్యసభలో ఉండి ఉక్కు పరిశ్రమపై మాట్లాడని సీఎం రమేష్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. జిలాకు అన్యాయం చేస్తున్నారు: గోవిందరెడ్డి జిల్లా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని చంద్రబాబుకు కోపమని, అందుకే అభివృద్ధి జరక్కుండా పట్టుబట్టి అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆరోపించారు. జిల్లాలో రెండు ఉక్కు పరిశ్రమలు నెలకొల్పాలని వైఎస్ కలలుగన్నారని, బ్రహ్మణి శంకుస్థాపన సమయంలో టీడీపీ వాళ్ల కళ్లు పడితే దిష్టి తగులుతుందనే బూడిద గుమ్మడికాయ కొట్టారన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకూడదని చంద్రబాబు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని వార్తలు రాశాయని గుర్తు చేశారు. కలిసిరమ్మంటే ఎగతాళి చేశారు: నారాయణ ఉక్కు పరిశ్రమ కోసం చేసే పోరాటానికి కలిసి రావాలని టీడీపీ నాయకులను కోరితే ఉక్కు పరిశ్రమ సాధ్యమేనా, పోరాటాలు చేస్తే ఫ్యాక్టరీ వస్తదా అని ఎగతాళి చేశారని ఉక్కు సాధన ఐక్యవేదిక కన్వీనర్ బి. నారాయణ అన్నారు. వారికి సిగ్గూ, శరం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ఉద్యమంలోకి రావాలన్నారు. టీడీపీ వాళ్లు ఏం చేస్తున్నారో, వారికైనా అర్థమవుతుందా.: మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏం చేస్తున్నారో, వారికైనా అర్థమవుతుందా...అని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఎద్దేవా చేశా రు. ఆనాడు ప్యాకేజీయే బాగుంది అన్నవారు నేడు ప్రాణాలైనా అర్పిస్తామంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదమన్నారు.వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు నలిగిపోయారు:రఘురామిరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నలిగిపోయారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే తెల్లారినట్లు చంద్రబాబు హోదా, ఉక్కు ఫ్యాక్టరీ అంటున్నారని ఎద్దేవాచేశారు. జిల్లాకు 19 సార్లు వచ్చిన సీఎం ఒక్కసారైనా ఉక్కుఫ్యాక్టరీ గురించి మాట్లాడారా అని నిలదీశారు. చంద్రబాబు ఉండగా ఉక్కు పరిశ్రమ రాదని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ది చెందింది సీఎం రమేష్, శ్రీనివాసులరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, మేడా మల్లికార్జునరెడ్డిలేనన్నారు. రోజుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టి టీడీపీ చేస్తున్నది కార్పొరేట్ దీక్ష అని విమర్శించారు. సీఎం రమేష్‌కు దమ్ముంటే కడప పార్లమెంటుకు పోటీ చేయాలని సవాల్ విసిరారు. డిపాజిట్ తెచ్చుకుంటే తాను ముక్కు, చెవులు కోసుకుంటానన్నారు. వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేసిన వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఘనాపాటి: రవీంద్రనాథ్‌రెడ్డి కళ్లార్పకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాల్లో అయితే ఇలాంటి వారి నాలుక కోయడంగానీ, ఉరితీయడం గానీ చేస్తారన్నారు. వైఎస్ ఎవరి అంచనాలకు అందని విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించారన్నారు. కొప్పర్తి వద్ద రెండో ఉక్కు పరిశ్రమ కోసమే మద్దిమడుగు రిజర్వాయర్ ఏర్పాటు చేశారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశాయన్నారు. సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అని, ఎంతసేపు ఆయన సంపాదించేవాడేగానీ, సాధించేవాడు కాదని ఎద్దేవా చేశారు. 300 షుగర్ ఉన్న ఆయన నాలుగురోజులైనా ఇంత చెలాకీగా ఎలా ఉన్నారో అర్థం కాలేదన్నారు. బెంగళూరులో బీటెక్ రవి చేసే ఘనకార్యాలేంటో ప్రజలకు తెలుసన్నారు. -
జస్ట్ రూ. 200లకే ఇవాంకకు ఆధార్!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన వ్యక్తిగత సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ హైదారాబాద్ పర్యటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జీఈఎస్ సందర్భంగా వచ్చిన ఆమె కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన హడావుడి.. ప్రత్యేక ఆకర్షణలు... ఇలా ప్రతీ విషయం గురించి మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఆమె ఇండియాకు వచ్చిన కారణం ఇదేనంటూ ఓ జోక్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. ఆధార్ కార్డు కోసం ఇండియాకు వచ్చిన ఇవాంక పేరుతో ప్రముఖ కమెడియన్, మిమిక్రీ కళాకారుడు జోస్ కోవాకో ఓ వీడియో పోస్టు చేశాడు. పెయిడ్ మీడియా దీనిని ప్రసారం చేయలేదని.. ఇవాంక రాకకు అసలు కారణం ఇదేనన్న సందేశం అతను ఉంచాడు. ఇక వీడియోలో.. ఆధార్ అందుకోసమే వచ్చానంటూ ప్రతినిధులతో చెప్పటం.. మాకు ఆ అవకాశం లేదని భారతీయ అధికారి ఒకరు చెప్పటం.. కారు ఎక్కే సమయంలో ఆధార్ సెంటర్ కు వెళ్లమని ఇవాంక డ్రైవర్‌ను కోరటం... మీకోసం 200 రూపాయలకే నేను చేస్తానని చెప్పటం ఆ వీడియోలో చూడొచ్చు. ఇది కేవలం హస్యం కోసం చేశానని.. నేరం కాదని అతను అంటున్నాడు. ఇక జోస్ ట్వీట్‌కు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చిపడుతున్నాయి. చివరకు స్పందించిన యూఐడీఏ... ఆమె మన భారత దేశానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి దరఖాస్తు చేసుకోవటానికి వీల్లేదంటూ బదులు కూడా ఇచ్చింది. -
200లకే ఇవాంకకు ఆధార్!
-
నవ్విస్తే విజయం మీదే!
న్యూయార్క్: నవ్వడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండట మే కాదు.. ఆయుష్షు కూడా పెరుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. అయితే హాస్య చతురత కేవలం ఆయుష్షును మాత్రమే కాదు, వ్యక్తిలో పోటీతత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ.. ఉన్నతస్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందట. సాధారణంగా ఆఫీసులో వాతావరణం గంభీరంగా ఉంటుంది. బాస్ ఏమంటారోనని ఉద్యోగులు పెద్దగా మాట్లాడుకోరు.. జోకులు వేసుకోరు. కానీ.. ఆఫీసులో జోకులు వేస్తూ సరదాగా గడిపేవారు బాగా పని చేయడంతోపాటు.. పోటీతత్వాన్ని కలిగి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. వార్టన్ స్కూల్ అండ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు సరదాగా, గంభీరంగా 457మందిపై ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహించింది. కొన్ని జోకులను వారికి చెప్పి ప్రేక్షకులకు చెప్పమన్నారు. అయితే హాస్యచతురత ఉన్నవాళ్లు చెప్పిన జోకులకు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. కొందరు వేసిన జోకులకు ఎవరూ నవ్వలేదట. తర్వాత వారిని విశ్లేషిస్తే.. బాగా నవ్వించిన వారిలో ఆత్మస్థైర్యం, పోటీతత్వం ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు.. అందులో చాలా మంది గ్రూపు లీడర్లుగా ఎన్నికైనవారున్నారట. -
ఇదియొక చమత్కారం
అక్షర తూణీరం చాలా ఏళ్ల క్రితం పరిచయం ఉన్న ఒక ఎమ్మెల్యేగారిని అభినందిస్తూ ‘‘మీరు సభాపతి అవుతారనిపిస్తోందండీ!’’ అన్నాను. ఆయన వెంటనే, ‘‘వద్దండీ! సభలో హాయిగా కునుకు తీయడానికి ఉండదు’’ అంటూ కంగారు పడ్డారు. సెమినార్లలో, పునశ్చరణ తరగతులలో అధికారులు నిద్ర ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. గడచిన రోజు ప్రపంచ నిద్రా దినోత్సవం. నిద్రాప్రియులు ఇప్పుడు జాగృతమై ఉంటారు. వారందరికీ శుభాకాంక్షలు. నిద్ర ఒక యోగం. ఒక భోగం. కొందరికి నిద్ర పట్టదు. కొందరు నిద్రని పట్టించుకోరు. జపాన్‌లో ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు అందర్నీ ‘సుఖ నిద్రా ప్రాప్తిరస్తు’ అని దీవిస్తాడు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం ఉండి వాటికి తోడు చీకూ చింతా లేకుండా ఉండేవాడే సుఖ నిద్రపోగలడు. ఆ దీవెన వెనుక ఇంతటి అంతరార్థం ఉంది. ‘‘నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’’ అనే చంద్రబాబు నినాదం చాలా ఫేమస్. అందరూ నిద్రలో ఉండగా మనకు అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. అప్పట్నించీ దేశం అలాగే మగత నిద్రట్లో ఉండిపోయిందని కొందరు మేధావులు అంటూంటారు. నిద్ర ఒక మానసిక స్థితి- కాదు ఇదొక శారీరక అవసరం. కాదు, ఇదొక దినచర్య. కాదు, ఇదొక చమత్కారం. నిద్రలో సుఖం ఉంది. నిద్రలో బంగారు కలలున్నాయి. కలల్లో అనేక తీరని కోరికలు తీరతాయి. ‘‘నిజానికి జీవితం యావత్తూ ఒక కలే!’’ అంటూ శంకరాచార్యులు మిధ్యావాదాన్ని ప్రతిపాదించారు. ఇది పెట్టుబడిదారుల కుట్ర అన్నాడు కారల్‌మార్క్స్. ‘‘వైకుంఠంలో విష్ణుమూర్తి కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ అయ్యది యోగనిద్ర’’ అంటారు విశ్వనాథ. త్రేతాయుగంలోనే రెండు మహానిద్రలు గుర్తించారు. సంవత్సరంలో సగకాలం ఏకధాటిగా నిద్రపోయే కుంభకర్ణుడు, భర్త వనవాస సమయం మొత్తాన్ని నిద్రలో సద్వినియోగం చేసుకున్న ఊర్మిళాదేవి ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నారు. దీంతో నిద్రకి పురాణ గౌరవం దక్కింది. జంతువులు, పక్షులు, చెట్లు సైతం హాయిగా నిద్రపోతాయి. చెట్లకొమ్మలకు వేలాడుతూ గబ్బిలం నిద్రలో రిలాక్స్ అవుతుంది. గుర్రం నిలబడే నిద్రపోగలదు. ‘‘ఏనుగు నిద్రపోదు. సింహం కల్లోకి వస్తుందని భయం’’ అంటారు. అంతా వట్టిది. ఇదొక అతిశయోక్తి. దీన్ని కవిసమయం అంటారు. చాలా ఏళ్ల క్రితం పరిచయం ఉన్న ఒక ఎమ్మెల్యేగారిని అభినందిస్తూ ‘‘మీరు సభాపతి అవుతారనిపిస్తోందండీ!’’ అన్నాను. ఆయన వెంటనే, ‘‘వద్దండీ! సభలో హాయిగా కునుకు తీయడానికి ఉండదు’’ అంటూ కంగారు పడ్డారు. సెమినార్లలో, పునశ్చరణ తరగతులలో అధికారులు నిద్ర ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో వీడియో కవరేజీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు కోడికునుకులు తీస్తూనే సంగతులను ఆకళింపు చేసుకోగలరు. ఎన్టీఆర్ కునుకుల రాముడిగా ప్రసిద్ధి గానీ, కొంచెం జోగుతూనే సినిమా కథలు విని తీర్పులిచ్చేవారు. ఒకసారి కథంతా విని ‘‘బావుంది బ్రదర్! వెరీఫైన్. కానీ అక్కడక్కడ జంప్‌లు ఉన్నాయి. చెక్ చేసుకోండి!’’ అని సూచించారు. వెంటనే కవిగారు, ‘‘చిత్తం, తవరి కునుకులన్నీ జంపులే కదండీ’’ అన్నారు, వినయంగా. ‘‘మంచి అబ్జర్వేషన్ బ్రదర్’’ అంటూ మెచ్చుకున్నారు. నిద్ర విషయంలో మహర్జాతకుడాయన. నాకు నాలుగు వేల ఆరొందల యాభయ్రూపాయల అప్పుంటేనే నిద్ర పట్టడం లేదు. ఆ విజయ్ మాల్యాకి ఎలా పడుతోందండీ అని అడిగాడొక బక్కరైతు. ఎందుకు పట్టదు? ఆయనకి అప్పులిచ్చిన వాళ్లు తలొక వాయిద్యం వాయిస్తూ, లోగొంతులో జోల పాటలు పాడుతూ ఉంటే మహా బాగా పడుతుంది అన్నాడు సందేహం విన్న పెద్ద మనిషి. మనది వేదాలు వెలసిన నేల. హాయిగా నిద్రపోవడం మన జన్మహక్కు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?
న్యూఢిల్లీ: 'సాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో అంతర్థానమయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తే పలు దేశాలతో మనకున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయి' అని చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో చదువుకున్నాం. నాటి జవహర్ లాల్ ప్రభుత్వం నుంచి నేటి మోదీ సర్కార్ దాకా అందరికి అందరూ ఇదే విషయాన్ని చెబుతూవచ్చారు. కాలం సమీపించడంతో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గతం చేసింది. అయితే ముందునుంచీ భయపడ్డట్లు దీనిపై ఇటు రష్యాగానీ, అటు జపాన్ గానీ ఒక్కమాటైనా మాట్లాడలేదు. వాళ్లతో భారత్ సంబంధాలు తెగిపోనూలేదు. అంటే ఇన్నాళ్లూ నేతాజీ విషయంలో ప్రభుత్వాలు చెప్పినవన్నీ అబద్ధాలా? నేతాజీ అంతర్థానం, దాని వెనకున్న రహస్యం పెద్ద జోకా?' అంటూ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీశారు బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ బతృహరి మహతాబ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు చెప్పే తీర్మానంలో భాగంగా శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఎంపీ మహతాబ్.. నేతాజీ అంతర్థానం, రహస్య ఫైళ్ల వెల్లడిలో ప్రభుత్వాలు అనుసరించిన తీరును ఘాటుగా విమర్శించారు. విడతల వారీగా ప్రభుత్వం వెల్లడిస్తోన్న రహస్య ఫైళ్లలో కొత్త విషయాలేవీ లేవని, అందులో ఉన్నదంతా దేశప్రజలకు ఇదివరకే తెలుసునని, గొప్ప యోధుడి విషయంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవపట్టించడం దారుణమని మహతాబ్ అన్నారు. అటల్ బిహారీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన ఎం కె ముఖర్జీ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. నేతాజీ అంతర్థానం అయ్యారని భావిస్తున్న ప్రాంతంలో విమాన ప్రమాదమేదీ జరగలేదని ఆ కమిటీ పేర్కొందని, మిగతా ఫైళ్లు మాత్రం ప్రమాదం జరిగిందని నివేదించడం గమనార్హమన్న ఆయన.. ఇప్పటికైనా ఈ విషయంలో అన్ని విషయాలు వెల్లడైనట్టా? లేక ఇంకేవైనా రహస్యాలను ప్రభుత్వం దాచిపెడుతోందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో మాట్లాడుతున్న బీజేడీ ఎంపీ బతృహరి మహతాబ్. -
అరువు తెచ్చుకున్న హాస్యం!
కథ బలహీనంగా ఉన్నా, కథనం పేలవంగా ఉన్నా... హాస్యం సినిమాని నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే రచయితలు, దర్శకులు కామెడీ పైన బాగా ఆధారపడుతున్నారు. అలా అని అసలు కథే లేకుండా కామెడీతో సరిపెట్టుకోమంటే ఒప్పుకోరు ప్రేక్షకులు. అందుకే కాస్త బలమున్న కథకు, మంచి కామెడీని అద్ది అందించే ప్రయత్నం చేసు ్తన్నారు దర్శకులు. అలాంటి ఓ ప్రయత్నమే ‘అహ నా పెళ్లంట’! ఇదే పేరుతో గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జంధ్యాల తీసిన చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. మళ్లీ అదే పేరుతో 2011లో దర్శకుడు వీరభద్రమ్ ఓ చిత్రాన్ని తీశారు. అల్లరి నరేశ్ హీరో. హాస్య చిత్రమే అయినా... చక్కని కథా బలం, మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇందులో. అయితే అవేవీ ఒరిజినల్ కాదు. ఒక కొరియన్ సినిమా నుంచి కొట్టుకొచ్చినవి! అల్లరి నరేశ్ ఓ పెద్ద కంపెనీలో పని చేస్తుంటాడు. చేతినిండా డబ్బు... అందమైన గాళ్‌ఫ్రెండ్... జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుం టున్న సమయంలో ఓ రోజు... పార్టీలో బాగా తాగి ఇంటికి వెళ్లి పడుకుంటాడు. ఉదయం లేచేసరికి పక్కన హీరోయిన్ ఉంటుంది. తను ఎవరో, అక్కడికెలా వచ్చిందో అర్థంకాదు. ఆమెనడిగితే తనకూ తెలియదంటుంది. అవమానంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాతి రోజు హీరోయిన్ అన్నలు నరేశ్‌ని వెతుక్కుంటూ వస్తారు. తమ చెల్లెలిని పెళ్లి చేసుకొమ్మని కొడతారు. తెలిసి చేయలేదని ఎంత చెప్పినా వినరు. దాంతో హీరోయిన్ని కలిసి, వైద్య పరీక్షలు చేసుకొమ్మని కోర తాడు నరేశ్. టెస్ట్ చేస్తే ఇద్దరి మధ్య ఏం జరగలేదని తెలుస్తుంది. ఆ విషయం అన్నలకు చెప్పడానికి ఊరు వెళ్తారు. అప్పటికే వాళ్లిద్దరికీ పెళ్లి కుదిరిపోతుంది. ఆ పెళ్లి చెడగొట్టుకుని ఎలాగైనా తన గాళ్ప్రెండ్ను పెళ్లి చేసుకోవాలని నరేశ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో తనలాంటి మంచి కుర్రాడు తమ చెల్లెలికి భర్త కావాలన్న ఉద్దేశంతో హీరోయిన్ అన్నలే ఇదంతా ప్లాన్ చేశారని తెలీడం, గాళ్‌ఫ్రెండ్ కూడా మంచిది కాదని తెలీడం, హీరోయిన్ పట్ల ప్రేమ పుట్టడం, ఆమెనే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇదీ ‘అహ నా పెళ్లంట’ కథ. ఈ కథ తాము వండిందే అని చిత్ర దర్శకుడు తన పేరు వేసుకున్నా, అది ఏమాత్రం నిజం కాదు. ఆల్రెడీ కొరియన్వాళ్లు వండినదాన్ని తెచ్చి ప్లేటులో పెట్టి మన ప్రేక్షకులకు వడ్డించేశారంతే. ‘గమునియ్ యాంగ్ వాంగ్’ అనే కొరియన్ సినిమాని 2002లో ‘మ్యారీయింగ్ ద మాఫియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఒరిజినల్ చూసి ఇన్‌స్పయిర్ అయ్యారో, అనువాదం చూసి ముచ్చటపడ్డారో తెలియదు కానీ... అమాంతం ఎత్తుకొచ్చి‘అహనా పెళ్లంట’గా తీసేశారు. కథతో పాటు కథనాన్నీ మొహ మాటపడకుండా దింపేశారు. మోగుతున్న అలారాన్ని ఆపి, లేచి, కళ్లజోడు పెట్టుకుని, తన కాలు అనుకుని హీరోయిన్ కాలుని గోకుతాడు హీరో. అప్పుడే తన పక్కన ఒకమ్మాయి పడుకుని ఉందని తెలుస్తుంది. దీన్ని అచ్చంగా తీసేశారు. చివరికి అక్కడి హీరోకి కళ్లజోడు ఉందని ఇక్కడ కూడా వాడటం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ అన్నలు హీరోని ముప్పు తిప్పలు పెట్టడం, వాళ్లతో హీరో తన కుటుంబానికి మీటింగ్ ఏర్పాటు చేయడం, హీరో హీరోయిన్లు దగ్గరయ్యే సమయానికి గాళ్‌ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేయడం లాంటి సన్నివేశాలన్నీ మనవాళ్లు బయటకు చెప్పని మాతృకలో ఉన్నవే. హీరోయిన్ తండ్రికి చెస్ ఆడే అలవాటుంటుంది. అది పెట్ట డానికి కారణం... ఒరిజినల్లో హీరోయిన్ తండ్రికి రాళ్లతో ఆడే ఒక రకమైన ఆట అంటే ఇష్టం కావడమే. ఇలా చాలా సీన్లు దించేశారు. పలు చోట్ల సంభాషణలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే తెలుగులో దర్శకుడు కామెడీ డోస్ బాగా పెంచారు. నరేశ్‌కి బాస్‌గా బ్రహ్మా నందం క్యారెక్టర్ని హైలైట్ చేసి కడుపుబ్బ నవ్వించారు. హీరో మంచితనాన్ని హీరో యిన్ అర్థం చేసుకునే సన్నివేశాల్ని ఆకట్టు కునేలా తీశారు. అలాగే క్యారెక్టరయి జేషన్సలోనూ మార్పు చేశారు. మాతృకలో హీరోయిన్ తండ్రి, అన్నలు గ్యాంగ్స్టర్స్ అయినా కామెడీగా కనిపిస్తారు. కానీ తెలుగులో వాళ్లను సీరియస్‌గా చేశారు. నాగినీడుతో తండ్రి, శ్రీహరితో పెద్దన్నయ్య పాత్రలు చేయించారు. దాంతో పాత్రలు బరువెక్కి ఆకట్టుకున్నాయి. ఈ విధంగా కొన్ని మార్పులైతే చేశారు. కాకపోతే ముఖ్యమైన సన్నివేశాలన్నీ మాత్రం ఎత్తుకొచ్చారు. ఏదైతేనేం, సినిమా హిట్టు కాబట్టి కాపీ సంగతి మర్చిపోవడమే! -
జోకు పేల్చినందుకు.. 55 లక్షల జరిమానా!
విమానాశ్రయంలో బాంబు ఉందంటూ జోకు వేసిన వెనెజులాకు చెందిన ఈ వైద్యుడు ఆనక భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మానుయెల్ ఆల్బర్టో ఆల్వరాడో (60) అనే ఇతడు అక్టోబర్ 22న కొలంబియాకు వెళ్లేందుకని అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఎందుకు బుద్ధిపుట్టిందో గానీ.. విమానాశ్రయ సిబ్బంది ముందు ఓ మాంచి జోకు పేల్చాలని అనుకున్నాడు. ఇంకేం.. తన లగేజీలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఓ గేటు దగ్గర గార్డుతో జోకాడు. కానీ దీనిని ఆ గార్డు సీరియస్‌గా తీసుకోవడంతో ఇక ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఐదు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలను నిలిపివేశారు. డాగ్‌స్క్వాడ్, భద్రతా సిబ్బంది బిలబిలమంటూ రంగంలోకి దిగారు. విమానాశ్రయమంతా జల్లెడపట్టారు. మొత్తం మీద మూడు గంటలపాటు విమానాశ్రయం స్తంభించిపోయింది. చివరకు బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్న అధికారులు చెత్త జోకుతో తిప్పలు పెట్టినందుకు ఈయనను అరెస్టు చేశారు. దీంతో మూర్ఖత్వంతో చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతూ ఇతడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పా డు. నేర చరిత్ర లేకపోవడంతో కోర్టూ క్షమించింది. కానీ.. 89 వేల డాలర్లు(రూ.55 లక్షలు) జరిమానా వడ్డించింది. ఇందులో ఐదు ఎయిర్‌లైన్స్ సంస్థలకు రూ.51 లక్షలు, మిగతా మొత్తం మియామీ పోలీసులకు చెల్లించాలని ఆదేశించింది. -
విమానంలో జోక్.. రూ. 54 లక్షల ఫైన్
మియామి: విమానంలో పరిహాసమాడినందుకు ఓ ప్రయాణికుడికి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. జోక్ చేసి విమాన రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు వెనిజులా వైద్యుడు మాన్యుల్ అల్బర్టో ఆల్వారాడో(60) అనే వ్యక్తికి మియామి కోర్టు 89,000 డాలర్ల (సుమారు రూ.5429000) జరిమానా వేసింది. గత అక్టోబర్ లో మియామి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కిన తర్వాత ఆల్వారాడో తన లగేజీలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పరిహాసమాడాడు. ఇది నిజమని నమ్మిన అధికారులు సెక్యురిటీ అలర్ట్ జారీ చేశారు. ఫలితంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిహాసమాడాడని తర్వాత అతడు వెల్లడించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. చేసిన పనికి సిగ్గుపడుతూ క్షమాపణ చెప్పడంతో చివరకు జరిమానాతో సరిపెట్టారు. -
నేను ఆడంగినా?
మగోడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మనం ఎలాంటి కాలంలో నివసిస్తున్నామా అని. ఒకప్పుడు ఏ అలవాటు లేని వాళ్లను చాలా గౌరవంగా చూసేవాళ్లు. వారి గురించి పదిమందికి గొప్పగా చెప్పేవాళ్లు. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎన్ని దురలవాట్లు ఉంటే అంత గొప్ప మగవాడు అనుకుంటున్నారు. అలాంటి వారితోనే మర్యాదగా మాట్లాడుతున్నారు. తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే మొదటి నుంచి నేను మద్యం, సిగరెట్...మొదలైన అలవాట్లకు చాలా దూరం. ఫ్రెండ్స్ ఎన్నోసార్లు ఈ దురలవాట్లను నాకు అంటించాలని ప్రయత్నించారు. భగవంతుడి దయ వల్ల ఏ దురలవాటు నా దరి చేరలేదు.ఏ దురలవాటూ లేకపోవడంతో నాకు గర్వంగా కూడా ఉండేది. ‘‘ఇతను స్వాతిముత్యం’’ అని నా గురించి ఎవరైనా అన్నప్పుడు సంతోషంగా ఉండేది. ఇటీవల జరిగిన ఒక సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. నేను మా ఆవిడ కలిసి ఒక ఫంక్షన్‌కు వెళ్లాం. ఫంక్షన్ అయిపోయిన తరువాత మగాళ్లు కొందరు మందు కొడుతున్నారు. ‘‘మీ ఆయన వెళ్లాడా?’’ అని అడిగింది ఒక ఆవిడ. ఈ ప్రశ్నకు మామూలుగానైతే- ‘‘ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవు’’ అని కాస్త గర్వంగా చెప్పాలి. మా ఆవిడ మాత్రం ముఖం అదోలా పెట్టి- ‘‘మా ఆయన అతి జాగ్రత్త మనిషి. టీ తాగాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎవరితోనూ పెద్దగా కలవరు. ఒక్కరోజు మందు కొడితే ఈయన సొమ్మేదో పోయినట్లు దూరంగా ఉంటారు...’’ అని చెప్పుకుంటూ పోతోంది. ‘‘మా ఆయన కూడా అంతే. మా ఆయనే ఆడంగి అనుకుంటే ఆయన కంటే పెద్ద ఆడంగిలా ఉన్నాడు మీ ఆయన!’’ అంటూ ఆ దూరపు బంధువుఅదేదో పెద్దజోక్లా విరబడి నవ్వింది. ఈ సంభాషణ విని నా గుండెలో రాయి పడినట్లుగా విలవిలలాడిపోయాను. మీరైన చెప్పండి. ఇది సమంజసమా?! -జిఆర్, కొత్తపేట -
ఇంగ్లండ్ ఆటతీరుపై ఇయాన్ బోథమ్ ఆగ్రహం!
లండన్: ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు ఓ జోక్ తలపించిందని ఆదేశ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన తీరు ఆగ్రహం తెప్పించిందని ఆయన అన్నారు. ప్రపంచ కప్ కు ఆరునెలల ముందు ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉందని బోథమ్ మండిపడ్డారు. ఇలా దారుణమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ కు బదులు 'ఎగ్ కప్' గెలుచుకుంటే అదృష్టమే అని వ్యాఖ్యలు చేశారు. పరాజయాల నుంచి ఇంగ్లాండ్ గుణపాఠం నేర్చుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిన తప్పులే మళ్లీ.. మళ్లీ చేస్తుండటం తనను నిరాశకు గురిచేస్తోందని బోథమ్ అన్నారు. -
హ్యూమరం: కాలి కింది గొయ్యి
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు పౌరసంఘం సన్మానం. సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, ‘‘గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ గోతి అన్నారు పెద్దలు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే కాలం పోయింది. నూతులు ఎండిపోయి గోతులే మిగిలాయి. వెనుకటికి రోడ్డుకి మధ్య గొయ్యి ఉండేది. ఇప్పుడు గొయ్యికి గొయ్యికి మధ్య రోడ్డు మిగిలింది. నా దారి రహదారి అని ఎవరూ డైలాగ్ చెప్పకుండా చేసిన అధికారులకు అభినందనలు’’ అన్నాడు. ఎముకల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు లేచి, ‘‘వెన్నెముకతో జీవించడం నాగరికతకే విరుద్ధమని అధికారులు భావిస్తున్నందుకు మా సంఘం హర్షం వెలిబుచ్చుతూ ఉంది. గోతుల్లో పడ్డవాడెవడూ వెన్నెముకతో బయటపడడు. ఎవడికీ ఏమీ విరగకపోతే మా ఆదాయం పెరిగేదెలా? బోన్ ఈజ్ బూన్, ప్రాక్టీస్ మేక్స్ ఏ డాక్టర్ మిలియనీర్’’ అన్నాడు. మందుల షాపు సంఘం పెద్దమనిషి లేచి, ‘‘మందు తాగి బండెక్కినవాడు నాలుగైదు గోతుల్లో పడి లేచేసరికి కిక్కు దిగిపోయి మళ్లీ నాలుగు పెగ్గులు బిగించి ఇంటికెళుతున్నాడు. ఈ రకంగా మా ఆదాయమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతున్నారు’’ అన్నాడు. కళ్ల డాక్టర్ల ప్రతినిధి లేచి, ‘‘కళ్లుండి కూడా లోకంలో ఎందరో గుడ్డివాళ్లుగా బతుకుతున్న కాలంలో మేము సేవలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. పడటం కూడా అడ్డదిడ్డంగా కాకుండా సక్రమంగా గోతిలో పడేలా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అద్దాలకు గిరాకీ పెరిగింది’’ అన్నాడు. రాజకీయ నాయకుల ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఇంతకాలం మేం మాత్రమే ప్రజలకు గోతులు తీస్తామని అందరూ ఆడిపోసుకున్నారు. అది తప్పని నిరూపించిన అధికారులకు కృతజ్ఞతలు. ప్రజలారా! గొయ్యిలో పడటం మీకు కొత్తేమీ కాదు. పడ్డవాడు చెడ్డవాడు కాడు. ఒక గొయ్యి పూడ్చితే వంద గోతులు పుట్టడమే ప్రజాస్వామ్యం. పూడ్చడం మానేసి గోతిలోనే జీవించడం నేర్చుకోండి. జీవితమే గొయ్యి అయినప్పుడు నుయ్యి కోసం ఎదురుచూడటం దండగ. చేదుకునేవాడు లేనప్పుడు ఈదడం నేర్చుకోండి. గోతిలో పడిన ప్రతివాడికి ఒక తాడు, సబ్బు ఉచితం’’ అని వాగ్దానం చేశాడు. చివరగా స్వచ్ఛంద సంస్థలవాళ్లు వచ్చి గోతి బాధితులకు వీల్ చెయిర్లు పంపిణీ చేశారు. మట్టి అంటకుండా గొయ్యి తవ్వడం ఎలా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అధికారులకు గోతివీరులు అని బిరుదునిచ్చి, ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడకుండా జాగ్రత్తలు చెప్పి హెచ్చరించారు. సభ ముగిసిన తరువాత ప్రజలు బయలుదేరారు. అదృష్టం బావున్నవాళ్లు ఇళ్లకు! గొయ్యిని తప్పించుకోలేనివాళ్లు ఆస్పత్రులకు చేరారు. - జి.ఆర్.మహర్షి