టీడీపీది కార్పొరేట్‌ దీక్ష | Corporate Strike Follows TDP In Kapada | Sakshi
Sakshi News home page

టీడీపీది కార్పొరేట్‌ దీక్ష

Published Sun, Jun 24 2018 8:44 AM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

Corporate  Strike Follows TDP In Kapada - Sakshi

ఉక్కుధర్నాలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి , చిత్రంలో కడప పార్లమెంటరీ  జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, పార్టీనాయకులు

సాక్షి, కడప కార్పొరేషన్‌ : ‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గుర్తు చేశారు. ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే  జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని చెప్పారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం శనివారం స్థానిక పాత కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు  అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు.

హోదా వస్తే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని భావించి వైఎస్‌ జగన్‌ గుంటూరులో ఏడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. హోదా వద్దు ప్యాకేజీ చాలునని మోదీ, అరుణ్‌జైట్లీకి సన్మానాలు చేసిన చంద్రబాబుకు హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి మైలేజీ వస్తుందనే కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నట్లు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు.  సీఎం రమేష్‌ పార్లమెంటులో ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదన్నారు. హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ నాయకులు అవి ఆమోదం పొందవని దుష్ప్రచారం చేశారన్నారు.  నిన్న వారి రాజీనామాలు ఆమోదమయ్యాయని, ఇప్పుడు టీడీపీ వారు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ చేస్తోంది కార్పొరేట్‌ దీక్ష అని వైఎస్సార్‌సీప నేతలు ధ్వజమెత్తారు.  ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమబాబు, సుధాకర్‌రెడ్డి, తుమ్మలకుంట శివశంకర్, ఆర్‌వీఎస్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్, మాజీ  అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, చల్లా రాజశేఖర్,  బంగారు నాగయ్య,  నాగేంద్రారెడ్డి, బోలా పద్మావతి,  పత్తి రాజేశ్వరి,   టీపీ  వెంకటసుబ్బమ్మ, రఘునాథరెడ్డి, ఉత్తమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే చాలా నష్టం: ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి
ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ప్రజలకు చాలా నష్టమని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఛంబల్‌లోయ దొంగలముఠా తరహాలో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు.  ఏడేళ్లుగా రాజ్యసభలో ఉండి ఉక్కు పరిశ్రమపై మాట్లాడని సీఎం రమేష్‌ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 


జిలాకు అన్యాయం చేస్తున్నారు: గోవిందరెడ్డి
జిల్లా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని  చంద్రబాబుకు కోపమని, అందుకే  అభివృద్ధి జరక్కుండా  పట్టుబట్టి అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆరోపించారు. జిల్లాలో రెండు ఉక్కు పరిశ్రమలు నెలకొల్పాలని వైఎస్‌ కలలుగన్నారని, బ్రహ్మణి శంకుస్థాపన సమయంలో టీడీపీ వాళ్ల కళ్లు పడితే దిష్టి తగులుతుందనే బూడిద గుమ్మడికాయ కొట్టారన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకూడదని చంద్రబాబు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని వార్తలు రాశాయని గుర్తు చేశారు.  


కలిసిరమ్మంటే ఎగతాళి చేశారు: నారాయణ
ఉక్కు పరిశ్రమ కోసం చేసే పోరాటానికి కలిసి రావాలని టీడీపీ నాయకులను కోరితే ఉక్కు పరిశ్రమ సాధ్యమేనా, పోరాటాలు చేస్తే ఫ్యాక్టరీ వస్తదా అని ఎగతాళి చేశారని ఉక్కు సాధన ఐక్యవేదిక కన్వీనర్‌ బి. నారాయణ అన్నారు. వారికి సిగ్గూ, శరం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ఉద్యమంలోకి రావాలన్నారు.   
టీడీపీ వాళ్లు ఏం చేస్తున్నారో, వారికైనా అర్థమవుతుందా.: మల్లికార్జునరెడ్డి
తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏం చేస్తున్నారో, వారికైనా అర్థమవుతుందా...అని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఎద్దేవా చేశా రు. ఆనాడు ప్యాకేజీయే బాగుంది అన్నవారు నేడు ప్రాణాలైనా అర్పిస్తామంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదమన్నారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఈ ప్రభుత్వంలో ప్రజలు నలిగిపోయారు:రఘురామిరెడ్డి
తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నలిగిపోయారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే తెల్లారినట్లు చంద్రబాబు హోదా, ఉక్కు ఫ్యాక్టరీ అంటున్నారని ఎద్దేవాచేశారు. జిల్లాకు 19 సార్లు వచ్చిన సీఎం ఒక్కసారైనా ఉక్కుఫ్యాక్టరీ గురించి మాట్లాడారా అని నిలదీశారు. చంద్రబాబు ఉండగా ఉక్కు పరిశ్రమ రాదని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ది చెందింది సీఎం రమేష్, శ్రీనివాసులరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, మేడా మల్లికార్జునరెడ్డిలేనన్నారు. రోజుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టి టీడీపీ చేస్తున్నది కార్పొరేట్‌ దీక్ష అని విమర్శించారు.  సీఎం రమేష్‌కు దమ్ముంటే కడప పార్లమెంటుకు పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. డిపాజిట్‌ తెచ్చుకుంటే తాను ముక్కు, చెవులు కోసుకుంటానన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి ద్రోహం చేసిన వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. 

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఘనాపాటి: రవీంద్రనాథ్‌రెడ్డి
కళ్లార్పకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గల్ఫ్‌ దేశాల్లో అయితే ఇలాంటి వారి నాలుక కోయడంగానీ, ఉరితీయడం గానీ చేస్తారన్నారు.  వైఎస్‌ ఎవరి అంచనాలకు అందని విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించారన్నారు. కొప్పర్తి వద్ద రెండో ఉక్కు పరిశ్రమ కోసమే మద్దిమడుగు రిజర్వాయర్‌ ఏర్పాటు చేశారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశాయన్నారు. సీఎం రమేష్‌ చంద్రబాబుకు బినామీ అని, ఎంతసేపు ఆయన సంపాదించేవాడేగానీ, సాధించేవాడు కాదని ఎద్దేవా చేశారు. 300 షుగర్‌ ఉన్న ఆయన నాలుగురోజులైనా ఇంత చెలాకీగా ఎలా ఉన్నారో అర్థం కాలేదన్నారు. బెంగళూరులో బీటెక్‌ రవి చేసే ఘనకార్యాలేంటో ప్రజలకు తెలుసన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement