నేను ఆడంగినా?
మగోడు
కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మనం ఎలాంటి కాలంలో నివసిస్తున్నామా అని. ఒకప్పుడు ఏ అలవాటు లేని వాళ్లను చాలా గౌరవంగా చూసేవాళ్లు. వారి గురించి పదిమందికి గొప్పగా చెప్పేవాళ్లు. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది.
ఎన్ని దురలవాట్లు ఉంటే అంత గొప్ప మగవాడు అనుకుంటున్నారు. అలాంటి వారితోనే మర్యాదగా మాట్లాడుతున్నారు. తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక నా విషయానికి వస్తే మొదటి నుంచి నేను మద్యం, సిగరెట్...మొదలైన అలవాట్లకు చాలా దూరం. ఫ్రెండ్స్ ఎన్నోసార్లు ఈ దురలవాట్లను నాకు అంటించాలని ప్రయత్నించారు. భగవంతుడి దయ వల్ల ఏ దురలవాటు నా దరి చేరలేదు.ఏ దురలవాటూ లేకపోవడంతో నాకు గర్వంగా కూడా ఉండేది. ‘‘ఇతను స్వాతిముత్యం’’ అని నా గురించి ఎవరైనా అన్నప్పుడు సంతోషంగా ఉండేది.
ఇటీవల జరిగిన ఒక సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది.
నేను మా ఆవిడ కలిసి ఒక ఫంక్షన్‌కు వెళ్లాం. ఫంక్షన్ అయిపోయిన తరువాత మగాళ్లు కొందరు మందు కొడుతున్నారు.
‘‘మీ ఆయన వెళ్లాడా?’’ అని అడిగింది ఒక ఆవిడ. ఈ ప్రశ్నకు మామూలుగానైతే-
‘‘ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవు’’ అని కాస్త గర్వంగా చెప్పాలి. మా ఆవిడ మాత్రం ముఖం అదోలా పెట్టి-
‘‘మా ఆయన అతి జాగ్రత్త మనిషి. టీ తాగాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎవరితోనూ పెద్దగా కలవరు. ఒక్కరోజు మందు కొడితే ఈయన సొమ్మేదో పోయినట్లు దూరంగా ఉంటారు...’’ అని చెప్పుకుంటూ పోతోంది.
‘‘మా ఆయన కూడా అంతే. మా ఆయనే ఆడంగి అనుకుంటే ఆయన కంటే పెద్ద ఆడంగిలా ఉన్నాడు మీ ఆయన!’’ అంటూ ఆ దూరపు బంధువుఅదేదో పెద్దజోక్‌లా విరబడి నవ్వింది. ఈ సంభాషణ విని నా గుండెలో రాయి పడినట్లుగా విలవిలలాడిపోయాను. మీరైన చెప్పండి. ఇది సమంజసమా?!
-జిఆర్, కొత్తపేట