హ్యూమరం: కాలి కింది గొయ్యి
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు పౌరసంఘం సన్మానం. సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, ‘‘గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ గోతి అన్నారు పెద్దలు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే కాలం పోయింది. నూతులు ఎండిపోయి గోతులే మిగిలాయి. వెనుకటికి రోడ్డుకి మధ్య గొయ్యి ఉండేది. ఇప్పుడు గొయ్యికి గొయ్యికి మధ్య రోడ్డు మిగిలింది. నా దారి రహదారి అని ఎవరూ డైలాగ్ చెప్పకుండా చేసిన అధికారులకు అభినందనలు’’ అన్నాడు.
ఎముకల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు లేచి, ‘‘వెన్నెముకతో జీవించడం నాగరికతకే విరుద్ధమని అధికారులు భావిస్తున్నందుకు మా సంఘం హర్షం వెలిబుచ్చుతూ ఉంది. గోతుల్లో పడ్డవాడెవడూ వెన్నెముకతో బయటపడడు. ఎవడికీ ఏమీ విరగకపోతే మా ఆదాయం పెరిగేదెలా? బోన్ ఈజ్ బూన్, ప్రాక్టీస్ మేక్స్ ఏ డాక్టర్ మిలియనీర్’’ అన్నాడు.
మందుల షాపు సంఘం పెద్దమనిషి లేచి, ‘‘మందు తాగి బండెక్కినవాడు నాలుగైదు గోతుల్లో పడి లేచేసరికి కిక్కు దిగిపోయి మళ్లీ నాలుగు పెగ్గులు బిగించి ఇంటికెళుతున్నాడు. ఈ రకంగా మా ఆదాయమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతున్నారు’’ అన్నాడు.
కళ్ల డాక్టర్ల ప్రతినిధి లేచి, ‘‘కళ్లుండి కూడా లోకంలో ఎందరో గుడ్డివాళ్లుగా బతుకుతున్న కాలంలో మేము సేవలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. పడటం కూడా అడ్డదిడ్డంగా కాకుండా సక్రమంగా గోతిలో పడేలా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అద్దాలకు గిరాకీ పెరిగింది’’ అన్నాడు.
రాజకీయ నాయకుల ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఇంతకాలం మేం మాత్రమే ప్రజలకు గోతులు తీస్తామని అందరూ ఆడిపోసుకున్నారు. అది తప్పని నిరూపించిన అధికారులకు కృతజ్ఞతలు. ప్రజలారా! గొయ్యిలో పడటం మీకు కొత్తేమీ కాదు. పడ్డవాడు చెడ్డవాడు కాడు. ఒక గొయ్యి పూడ్చితే వంద గోతులు పుట్టడమే ప్రజాస్వామ్యం. పూడ్చడం మానేసి గోతిలోనే జీవించడం నేర్చుకోండి. జీవితమే గొయ్యి అయినప్పుడు నుయ్యి కోసం ఎదురుచూడటం దండగ. చేదుకునేవాడు లేనప్పుడు ఈదడం నేర్చుకోండి. గోతిలో పడిన ప్రతివాడికి ఒక తాడు, సబ్బు ఉచితం’’ అని వాగ్దానం చేశాడు.
చివరగా స్వచ్ఛంద సంస్థలవాళ్లు వచ్చి గోతి బాధితులకు వీల్ చెయిర్లు పంపిణీ చేశారు. మట్టి అంటకుండా గొయ్యి తవ్వడం ఎలా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అధికారులకు గోతివీరులు అని బిరుదునిచ్చి, ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడకుండా జాగ్రత్తలు చెప్పి హెచ్చరించారు.
సభ ముగిసిన తరువాత ప్రజలు బయలుదేరారు. అదృష్టం బావున్నవాళ్లు ఇళ్లకు! గొయ్యిని తప్పించుకోలేనివాళ్లు ఆస్పత్రులకు చేరారు.
- జి.ఆర్.మహర్షి