Hyumaram
-
హ్యూమరం: అసెంబ్లీ పాము
అసెంబ్లీ ఆవరణలో పాము కనిపించింది. పగబట్టినవారిలా విలేకరులు వెంటపడ్డారు. పాము పారిపోయింది. విజువల్స్ దొరకనివాళ్లు బూరలు తీసి ఊదారు. బుగ్గలు వాచాయి కానీ పాము కనపడలేదు. లైవ్ చర్చావేదికలు ప్రారంభించారు. ప్రజాస్వామ్యంపై పాము పగబట్టిందని, పాము, నాయకులు, ప్రజలు వీరి మధ్య అవినాభావ సంబంధముందని ఒకాయన వాదించాడు. పాములు పగ పడతాయని, నాయకులు పొగ పెడతారని, ప్రజలకు సెగ తగులుతుందని, అందువల్ల రాబోయేది సర్పస్వామ్యమని ఆయన సూత్రీకరించారు. పాములున్న చోటకు నాయకులు వెళ్లగలరు కానీ, నాయకులున్న చోటకు పాములు రాలేవని, అది నకిలీ పామని ఇంకొకాయన చర్చించాడు. వాస్తవానికి పాము అసలైన నాయకత్వ ప్రతీక అని, చీమలు పెట్టిన పుట్టలో అది దర్జాగా కాపురముంటూ పైగా పూజలు కూడా అందుకుంటుందని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురువు సిద్ధాంతీకరించాడు. ప్రజలంతా సర్పదోష నివారణ పూజలు చేయించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలు సిసలైన దోషులు కాబట్టి, ఈ పూజలతో అన్నీ చక్కబడతాయని ఒక సిద్దాంతి వాదించి అక్కడికక్కడే నాగ పడగలు తయారుచేసే కుటీర పరిశ్రమను కూడా ప్రారంభించాడు. ఇదిలావుండగా కనిపించిన పాము విషపూరితమో కాదో తెలుసుకోవడానికి డాక్టర్లతో ఒక కమిటీ వేశారు. అనుమతి లేకుండా ఫొటోలు తీసినందుకు పాము కేసు పెట్టే అవకాశముందో లేదో తెలుసుకోవడానికి లాయర్లు ఒక కమిటీగా ఏర్పడ్డారు. పాము మనిషిగా మారడం, మనిషి పాముగా మారడం ఎప్పట్నుంచో సినిమాల్లో చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ పాము మనిషిగా మారి సభలో ప్రవేశించి, అడ్డదిడ్డంగా మైకులు విరగ్గొడితే ఏం చేయాలనే విషయంపై సినిమావాళ్లతో ఒక కమిటీ ఏర్పడింది. వీటన్నిటికీ అతీతంగా అధికారులు ఒక కమిటీగా ఏర్పడి, ఆఫ్రికా దేశాల్లోని పాములపై అధ్యయనం చేయటానికి విమానమెక్కారు. ఆయా దేశాల్లోని ఆకలి అరాచకాలకు కారణం పాములేనని తీర్మానించి, పాములు, ఆర్థిక సంక్షోభం అనే అంశంపై ఒక స్వచ్ఛంద సంస్థ నిధులు తెచ్చుకుని పని ప్రారంభించింది. పాము గ్లామర్‌ని క్యాష్ చేసుకోవడానికి స్నేకియా అనే పేరుతో ఫోన్లు తయారయ్యాయి. బుస్‌బుస్ అనే రింగ్‌టోన్ పాపులర్ అయ్యింది. పాకడం నేర్చుకున్నవాడే జీవితంలో పైకొస్తాడు కాబట్టి పాముని హీరోగా చేస్తూ కొంతమంది పుస్తకాలు రాసి అమ్ముకున్నారు. పాములకు, తీవ్రవాదులకు సంబంధాలుంటాయని అనుమానిస్తూ ఆపరేషన్ సర్ప అని ప్రభుత్వం ఒక శాఖను నెలకొల్పి నిధులిచ్చింది. ఇదంతా చూసిన ఒక వేదాంతి అసలు పాములు మనుషులు ఎప్పుడో కలిసిపోయారని, విడదీసి చూడటం అవసరమని తీర్మానించి, టీవీ ఆఫ్ చేసి నిద్రపోయాడు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం నీ దగ్గర రెండు ఆవులుంటే... కమ్యూనిస్టులు - ఆవులతో యూనియన్ పెట్టించి, పార్టీ చందాగా పాలను తీసేసుకుంటారు. కాంగ్రెస్ - నీ ఆవుల్ని నీకే రుణంగా ఇస్తున్నట్టు సభ పెట్టి పాలను పంచేస్తారు. బీజేపీ - గో సంరక్షణ పథకం కింద ఆవుల్ని లాగేసుకుంటుంది. తెలుగుదేశం - ఆవులిస్తే పేగుల్ని లెక్కపెట్టి, పాలను హెరిటేజ్‌కి తరలిస్తుంది. కాంగ్రెస్ నాయకుల స్పెషాలిటీ? మత్తుమందు లేకుండా ఆపరేషన్ చేయగల సమర్థులు! ప్రభుత్వ పథకమంటే? నాగలిని ఉచితంగా ఇచ్చి ఎద్దుల్ని జప్తు చేయడం! కాంగ్రెస్ నాయకుడి కామెంట్: మా కిరణ్‌కుమార్‌రెడ్డి బాగానే ఫైట్ చేస్తున్నాడుగానీ అదంతా గ్రాఫిక్స్ అని జనం గుర్తించారు. రాజకీయమంటే? చికెన్ తింటూ కోడి ప్రాణ సంరక్షణ గురించి చర్చించడం. కత్తి నురుతూ మేకలకు ధర్మసూకా్ష్మలు వివరించడం. -
హ్యూమరం: రాజకీయ నాటకం
రవీంద్రభారతిలో రాజకీయ నాటకోత్సవాలు. కిరణ్‌కుమార్‌రెడ్డిని, చంద్రబాబుని ముఖ్య అతిథులుగా పిలిచారు.చంద్రబాబు మైక్ తీసుకున్నాడు: ‘‘మొహానికి రంగేస్తే నాటకం. రంగు లేకుంటే రాజకీయం. నాటకం లేకుండా రాజకీయం లేదు. రాజకీయం లేకుండా నాటకం ఉండొచ్చు. ప్రేక్షకులున్నా లేకపోయినా నాటకం ఆగకూడదు. ఎవరి నటనకు వాళ్లే చప్పట్లు కొట్టుకుని, అవార్డులు ప్రకటించుకుంటే పాలిటిక్స్‌లో పైకొస్తాం. వెనుకటికి రోజుకో నాటకం ఆడేవాళ్లం. ఇప్పుడు గంటకో నాటకం ఆడితేనే ప్రజలకు వినోదం. రాజకీయాలు, నాటకాలు కలిసిపోయిన తరువాత జనం అసలు నాటకాలను చూడటం మానేశారు. కానీ రాజకీయం బతికున్నంతకాలం నాటకం బతికుంటుందని, ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను’’ అని ముగించాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘నాటకాల్లో చంద్రబాబు సీనియర్. ఆయన మా తండ్రిగారి హయాం నుంచి నాటకాలు ఆడుతున్నారు. అందువల్ల గత రెండేళ్ల నుంచి ఆయనతో శిక్షణ పొంది, రకరకాల నాటకాలతో జనాల్ని చల్లబరుస్తున్నాను. నా డెరైక్షన్ మేరకు ఆయన డైలాగులు చెబుతున్నాడు. ఆయన దర్శకత్వంలో నేను యాక్షన్ చేస్తున్నాను. ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్ష నేత కాపాడటమే అన్నిటికంటే గొప్ప డ్రామా’’ అన్నాడు. హఠాత్తుగా చిరంజీవి రంగప్రవేశం చేసి, ‘‘నన్ను పిలవకుండా నాటకోత్సవాలు జరపడం అన్యాయం. వాళ్లిద్దరికీ ఏది నాటకమో ఏది రాజకీయమో తెలుసు. నాకు తెలియదు. అందుకే రంగు పూసుకుని రాజకీయాల్లోకి వచ్చేసరికి రంగు పడింది. తెరపై నటిస్తే చప్పట్లు కొట్టిన జనం, రాజకీయాల్లో నటిస్తే తెర ఎందుకు దించారో తెలియదు’’ అన్నాడు. నిర్వాహకులు వచ్చి, ‘‘జనాన్ని మరిచిపోయి టూరిజానికి అలవాటు పడిన కేంద్రమంత్రి చిరంజీవి అర్జెంట్‌గా టూర్ వెళ్లాల్సి ఉన్నందువల్ల, మొదట ఏకపాత్రాభినయం చేస్తారు’’ అని ప్రకటించారు. చిరంజీవి స్టేజీమీదకొచ్చి అయిదు నిమిషాల పాటు పెదాలు కదిలించాడు. ‘సౌండ్’ అని జనం అరిచినా పట్టించుకోలేదు. ‘‘సౌండ్లు, రీసౌండ్లు ఆయనెప్పుడో మరిచిపోయి సెలైంట్‌గా మారిపోయారు. ఏం మాట్లాడితే జనంతో ఏం ప్రమాదమోనని మూకాభినయం చేసి వెళ్లిపోయారు’’ అని నిర్వాహకులు వివరణిచ్చారు. తరువాత కృష్ణుడి వేషంలో చంద్రబాబు, అర్జునుడి వేషంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. రావడం రావడమే ‘ఇచ్చోటనే...’ అని పద్యం ఎత్తుకున్నాడు చంద్రబాబు. ‘‘సార్! మీరు వేసింది కృష్ణుడి వేషం. పాడుతున్నది హరిశ్చంద్ర పద్యం’’ అని నిర్వాహకులు సరిచేయడానికి ప్రయత్నించారు. ‘‘వేషానికి తగిన పద్యం, సందర్భానికి తగినట్టు సంభాషణలు చెప్పడం నా డిక్షనరీలోనే లేదు’’ అన్నాడు బాబు. వెంటనే కిరణ్‌కుమార్‌రెడ్డి ‘ధారుణి రాజ్యసంపద’ అని ఢిల్లీకి తొడగొట్టి పద్యం పాడాడు. నిర్వాహకులొచ్చి, ‘‘వాళ్లు రోజుకో రకం నాటకం ఆడ్డం వల్ల పాత్రలు, పద్యాలు మరిచిపోయారు. ఈసారి ఎన్నికల్లో సినిమా చూపించి వాళ్ల నాటకాన్ని బంద్ చేయండి’’ అని విన్నవించుకున్నారు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం అనంతపురం సామెత: నక్కను నమ్మిన సింహం, సింహాన్ని నమ్మిన జింక రెండూ ఒకటే! పల్నాడు సామెత: సింహాన్ని భయపెట్టాలంటే ముందు తోడేలుని చంపాలి. తెలుగు తమ్ముని ఆవేదన: కోళ్లబుట్టలో చేయి పెడుతున్నాననుకుని మా చంద్రబాబు తేళ్లబుట్టలో చేయిపెట్టాడు. దురదృష్టం: పులి ఎదురైనప్పుడు బుల్లెట్ల కోసం వెతుక్కోవడం! నెల్లూరు సామెత: ఆరు నూరయ్యే వరకు నోరు మూసుకోకూడదు. చిత్తూరు సామెత: మేకను నరకడానికి ముందు మెడ నిమరాలి! -
హ్యూమరం: ఓడ మీద పిల్లి
విలేకరుల సమావేశం. మైకు తీసుకున్న చంద్రబాబు, ‘‘ఢిల్లీవాళ్లకు బుద్ధి లేదు. కాంగ్రెస్ నాయకులకు తలా తోకా లేదు’’ అని తిట్లు ఎత్తుకున్నాడు. ‘‘విభజనకు మీరు అనుకూలమా? వ్యతిరేకమా?’’ అని విలేకరులు అడిగారు. ‘‘విభజన అనే పదంలో భజన ఉంది. భక్తితో జనం పాడే పాటని భజన అంటారు. వి అంటే విక్టరీ. గతంలో నేను రెండు వేళ్లు చూపించేవాడిని. దానికి వేరే అర్థముందని తెలిసి మానేశాను. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేయడమే రాజకీయం. అన్నింట్లో వేలు పెడితే మన వేలితో మన కన్ను పొడుస్తారు.’’ ‘‘మేము అడిగిన ప్రశ్నేంటి?’’ అని విలేకరులు అడ్డు తగిలారు. ‘‘ప్రశ్నలు వేయడమే జ్ఞానమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. సమాధానం చెప్పడమే అజ్ఞానమని సామవేదం చెబుతోంది. వేదం వల్ల నిర్వేదం, నిర్వేదం వల్ల నిర్వికారం సంభవిస్తాయి. సంభవామి యుగే యుగే అంటే సంభావన లేకుండా ఏ యుగం నడవదని అర్థం. సామాన్యుడి చేతికి చిప్పనివ్వడమే అర్థశాస్త్రం. చిప్పలకు డిమాండ్ పెరిగినా, కొబ్బరి రైతుకు నష్టమొస్తే అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.’’ ‘‘మీరు సమైక్యానికి అనుకూలమా?’’ ‘‘అనుకూల ప్రతికూలతల వల్ల సానుకూలత, సమైక్యం వల్ల ఐక్యత, ఐక్యత వల్ల ఎడతెగని అనైక్యత వస్తాయి. సమంగా ఐక్యం కావడం అంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావడమే. ఓటరుకీ నాయకుడికీ మధ్య అనుసంధానమే మా పార్టీ ఎజెండా. ఎన్నికలయ్యే వరకు ఓటరే దేవుడు. తరువాత ఐదేళ్లూ నాయకుడే వినాయకుడు. జెండాలు మోసేవాడికి పదవులు రావు. పదవులొచ్చేవాడు జెండాలు మోయడు.’’ ‘‘సార్! మీరు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.’’ ‘‘నోరున్నది మాట్లాడ్డానికే. మాటలున్నది ఇతరులకి చెప్పడానికేనని అలెగ్జాండర్ గ్రాహంబెల్ అన్నాడు. అందుకే ఆయన ఫోన్ కనిపెట్టాడు. ఫోన్ వల్ల పోయే కాలం, సెల్‌ఫోన్ వల్ల పైకి పోయే కాలం దాపురించాయి. గన్ పెన్‌ల కంటే ఫోన్ గొప్పది.’’ ‘‘మీరు గోడ మీద పిల్లి.’’ ‘‘కాదు ఓడ మీద పిల్లి. ఓడకి చిల్లు పడింది. పిల్లి ఓడలో ఉన్నా మునిగిపోతుంది. నీళ్లలోకి పడినా మునిగిపోతుంది. గోడ, ఓడ ముఖ్యం కాదు. పిల్లి ఉందా లేదా అన్నది ముఖ్యం. క్యాట్ ఈజ్ ఆల్వేస్ రైట్. వంద ఎలుకల కంటే ఒక పిల్లి గొప్పది. నో లెఫ్ట్ నో రైట్ ఓన్లీ క్యాట్’’ అంటూ ఒక కర్ర తీసుకుని ‘నాకు నచ్చనివి రాస్తే బడితె పూజ’ అని గిరగిర కర్ర తిప్పాడు. ఆయన బుర్ర తిరుగుడుకి జడుసుకుని విలేకరులు బతుకు జీవుడా అంటూ పారిపోయారు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం శకునం చెప్పే బల్లి అన్ని దేశాల్ని షటప్ అని బెదిరించే అమెరికా చివరికి షట్‌డౌన్ చేసుకుంది. మన్మోహన్సింగ్ ఏం చేస్తున్నారు? ఆర్డినెన్స్‌లు చించి ఆరేస్తున్నారు. తెలుగుదేశం పరిస్థితి? ముందు గొయ్యి, వెనుక నుయ్యి, తలమీద పొయ్యి. బాబన్న కొత్త పేరు బాబూ నరేంద్ర చంద్ర మోడీ బుల్లెట్‌కి రివాల్వర్‌కి మధ్య తగాదా పెట్టడమే రాజకీయం! రాహుల్‌గాంధీ ప్రత్యేకత? పిట్ట కొంచెం కోతలు ఘనం -
హ్యూమరం: కైసే బనేగా ప్రధాని?
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం హడావుడిగా ఉంది. నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మైక్ తీసుకుని, ‘‘మిత్రులారా! ఇప్పుడు కౌన్ బనేగా ప్రధాని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పురాతన సంస్కృతిని మనం అభిమానిస్తాం కాబట్టి, మొదట ఏనుగుకి పూలమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వారినే ప్రధానిని చేద్దాం’’ అన్నాడు. మాలతో గజం ప్రవేశించింది. అందరి మెడలు నిక్కబొడుచుకున్నాయి. ఏనుగు కాసేపు ఆలోచించి, అటూ ఇటూ తిరిగింది. ‘గజరాజు జిందాబాద్’ అని అందరూ కేకలు పెట్టారు. తనకేదో అపాయం జరుగుతుందని భయపడి ఏనుగు ఘీంకరిస్తూ పారిపోయింది. ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య. ఇదంతా కాంగ్రెస్ కుట్ర. ఏనుగు పారిపోయినంత మాత్రాన ప్రజలు పారిపోరు. ప్రజాస్వామ్యం పారిపోదు. ఎలక్షన్, సెలక్షన్ వల్లే పార్టీ రిసరెక్షన్. మా నిర్ణయానికి లేదు కరెక్షన్. కాంగ్రెస్ సొత్తు కరప్షన్. ప్రజలకు మేము తప్ప లేదు మరో ఆప్షన్’’ అన్నాడు వెంకయ్యనాయుడు. రాజ్‌నాథ్‌సింగ్ లేచి, ‘‘మన దేశంలో గోచీ లేకపోయినా ప్రతివాడి దగ్గర సెల్‌ఫోన్ ఉంటుంది. ఎస్ఎంఎస్ల ద్వారా ఓటింగ్ పెడతాం. ప్రధానిగా ఎవరు ఉండాలో ఎస్.ఎం.ఎస్. పంపండి’’ అన్నాడు. సుష్మా స్వరాజ్ మైక్ తీసుకుని, ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రధానికి ఎంత మాత్రం ఉండదని మన్మోహన్సింగ్ రుజువు చేశారు. పీఎం అంటే పర్ఫెక్ట్లీ మైమ్ అని అర్థం. అందుకే ఆయన సైగలు చేస్తారు తప్ప మాట్లాడరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ మెయిల్ పంపి ప్రధానిని సెలక్ట్ చేయండి’’ అంది. బండారు దత్తాత్రేయ ఉత్సాహంగా లేచి, ‘‘కార్డులు రాయడంలో నేను రికార్డు. ఉత్తరానికి మించిన ప్రజాపత్రం లేదు. లెటరే బెటర్. అందువల్ల పోస్ట్ ద్వారా ప్రధాని పోస్టుని ఎంచుకోండి’’ అన్నాడు. గడ్కరి లేచి, ‘‘ఫేస్ వాల్యూ తెలుసుకోవాలంటే ఫేస్‌బుక్‌ని మించింది లేదు. సోషల్ నెట్వర్క్ ద్వారా పార్టీ నెట్వర్క్ తెలుసుకుందాం’’ అన్నాడు. అటుగా వెళుతున్న ఒక సామాన్యుడికి ఈ హడావుడి చూసి అనుమానమొచ్చి, ‘‘ఏం జరుగుతోంది ఇక్కడ?’’ అని అడిగాడు. ‘‘ప్రధాని ఎవరుండాలనే విషయంపై పోటీ’’ అని చెప్పాడో కార్యకర్త. ‘‘ఎన్నికలు ఇంకా రాలేదు కదా!’’ అనుమానంగా అడిగాడు సామాన్యుడు. ‘‘ఎన్నికలు వస్తే మా పార్టీ గెలిస్తే మాకు మద్దతిచ్చే పార్టీలు గెలిస్తే అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే క్లారిఫికేషన్.’’ ‘‘నిచ్చెనలు వేసి వేసి కింద నేల లేకుండా చేసుకున్నారు. ఆలూ చూలూ లేకుండా కొడుకు పేరు సోమలింగమంటే ఇదే!’’ అని గొణుక్కుంటూ సామాన్యుడు వెళ్లిపోయాడు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం రాజకీయమంటే ఎలుకల కళాశాలకు పిల్లిని ప్రిన్సిపాల్‌గా నియమించడం రుద్రాక్ష మాలల్ని పులి అమ్మడం నీతిచంద్రిక పుస్తకాన్ని నక్క రాయడం కప్పల సమూహానికి పాముతో ఉపదేశాలు వినిపించడం భవిష్యత్తు అద్భుతమని... బలికి వెళ్లే గొర్రెని నమ్మించడం హింస మానాలని సింహం సత్యాగ్రహం చేయడం నిజాయితీ గురించి తోడేలు తొడగొట్టడం -
హ్యూమరం: జనం మనం - మనం జనం
ప్రజల్ని రంజింపజేయడానికి పగటి వేషాలే కరెక్టని చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. వెంటనే పర్సనల్ మేకప్‌మ్యాన్‌ను పెట్టుకుని కృష్ణుడి వేషం వేశాడు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అని జనం ముందుకొచ్చాడు. ‘‘ఇక ఎప్పటికీ రానని హరికృష్ణ వెళ్లిపోయాడు సార్, ఆ పద్యం మనకు అనర్థం’’ అని పీఏ చెప్పాడు. ‘‘నాటకం వేరు, జీవితం వేరు. జీవితంలో నాటకం కలిస్తే రాజకీయం. నాటకంలో జీవితం కలిస్తే అరాజకీయం. ఏది నాటకమో, ఏది జీవితమో ప్రజలకు అర్థం కాకపోవటం మన అదృష్టం’’ అని విడమరిచి చెప్పాడు బాబు. జనం విజిల్స్ వేసి చప్పట్లు కొట్టారు. రెస్పాన్స్‌కు పొంగిపోయిన బాబు ఈసారి భీముడి వేషంలో వచ్చి, ‘‘ధారుణి రాజ్యసంపద మదంబున...’’ అంటూ తొడగొట్టాడు. జనం వన్స్‌మోర్ అన్నారు. ‘‘తెలుగుజాతి జోలికొస్తే తొడలు విరగ్గొడతా, తోక కోసి సున్నం పెడతా, కాళ్లు కట్టెపుల్లల్లా విరుస్తా’’ అన్నాడు బాబు. జనం ఈలపాట పాడారు. బాబు ఈసారి ఇంజనీర్ వేషంలో వచ్చి, ‘‘హైదరాబాద్‌ను నిర్మించింది నేనే. ఒకప్పుడు అక్కడేముండేది చార్మినార్, గోల్కొండ తప్ప. రోడ్లు వేయించి బిల్డింగ్లు కట్టించాను. బిల్‌క్లింటన్‌ను రప్పించాను. బిల్‌గేట్స్‌ను ఒప్పించాను’’ అన్నాడు. ‘‘ఇంజనీర్ మీరే, తెలుగువారి డాక్టర్ మీరే. అన్నిటికీమించిన యాక్టర్ మీరే’’ అని జనం అన్నారు. బాబు ఉబ్బితబ్బిబ్బయి ఈసారి మెజీషియన్ వేషంలో వచ్చాడు. ‘‘తిమ్మిని బమ్మి చేస్తా. బమ్మిని బొమ్మ చేస్తా. నీళ్లలో నిప్పు పుట్టిస్తా. ఉప్పును చూపించి అప్పు పుట్టిస్తా. చిలుకను ఉడుతగా చేస్తా. ఉడుతను ఊసరవెల్లిగా మారుస్తా’’ అంటూ చేతిలోని కర్రను అటూ ఇటూ తిప్పాడు. అరచేతిలో స్వర్గం కనిపించింది. ‘‘జనం మనం, మనం జనం. నన్ను నమ్మితే కొనగోటిపై వైకుంఠం. నమ్మకపోతే కైలాసం’’ అన్నాడు బాబు. జనం ‘‘ఆహా ఓహో’’ అన్నారు. ‘‘నా వేషాలపై మీ అభిప్రాయం?’’ అడిగాడు బాబు. ‘‘అయ్యా! మీరెన్ని వేషాలు వేసినా మీ అసలు వేషం మాకు తెలుసు. మమ్మల్ని రంజింపజేస్తున్నానని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని రంజింపజేయాలని మేము కాసేపు వేషం వేస్తున్నాం. మీకిప్పుడు కావలసింది మేకప్ కాదు ప్యాకప్’’ అన్నారు జనం. - జి.ఆర్.మహర్షి మహర్షిజం ఢిల్లీలో ఏం జరుగుతోంది? తోలు బొమ్మలాట. రాష్ట్రంలో..? కురుక్షేత్ర నాటకం. కాకపోతే నటులే తమ పాత్రల్ని మరిచిపోయారు. చిరంజీవి రోల్? ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. నో డైలాగ్స్. మన్మోహన్సింగ్? నో డైలాగ్స్. నో ఎక్స్ప్రెషన్స్. టీడీపీలో... ఏకపాత్రాభినయం. కిరణ్ పాత్ర? ఓన్లీ డైలాగ్స్. నో ఎక్స్ప్రెషన్స్. -
హ్యూమరం: వైరాగ్య కిరణం
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్: ‘‘రాష్ట్రంలో పరిస్థితులెలా ఉన్నాయి?’’ విలేకరుల ప్రశ్న. ‘‘స్థితి నుంచి పరిస్థితి, పరిస్థితి నుంచి సంకట స్థితి, దుస్థితి, చివరికి యధాతథస్థితి వస్తాయి. ఉన్న పరిస్థితులను చెడగొట్టడం, తిరిగి బాగుచేయడం. దీన్ని స్థితి స్థాపక శక్తి అంటారు. శాంతిని పాడుచేసి భద్రత కల్పించడం, భద్రత లేకుండా చేసి శాంతికోసం వెతకడం; దీన్ని లా అండ్ ఆర్డర్ అంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందుగలడందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అధిష్టానమే కదా.’’ ‘‘మేం అడిగిందేమిటి? మీరు చెప్పిందేమిటి?’’ తికమకపడ్డారు విలేకరులు. ‘‘అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది.’’ ‘‘కొంపదీసి బీజేపీలో చేరతారా ఏమిటి?’’ ‘‘ఏ పార్టీకైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్లు అనుకుంటే మనకు సెలవిప్పిస్తారు.’’ ‘‘వెకేషన్ వెళుతున్నారా?’’ ‘‘వెకేషన్, అకేషన్, సఫకేషన్, ఎలెక్ట్రిఫికేషన్... ఎవ్వనిచే జనించు అధిష్టానం.’’ ‘‘అన్నింటికీ అధిష్టానమేనా? మీరు సొంతంగా మాట్లాడరా?’’ ‘‘సొంతంగా చేస్తే పంతమంటారు. పంతంగా చేస్తే ఇంటికి పదమంటారు. ఢిల్లీ కంటే ఇల్లే పదిలం.’’ ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ ‘‘ఢిల్లీ లొల్లి.’’ ‘‘మీరూ చంద్రబాబు కుమ్మక్కయ్యారట.’’ ‘‘ఇద్దరం ఒకే పడవలో ఉన్నాం. మునగక తప్పదని నాకు తెలుసు. బాబుకి తెలిసినా గజఈతగాడిలా బస్సుయాత్రకు బయలుదేరాడు. బస్సుతో జనం కస్సుబుస్సు తగ్గేనా? అంతా బుస్సు. చత్వారమొచ్చిన తర్వాత రెండు కళ్లయినా ఒకటే, నాలుగు కళ్లయినా ఒకటే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’’ అని కిరణ్ పాట ఎత్తుకున్నాడు. ఇంతలో పీఏ వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. ‘‘ఢిల్లీకి రమ్మని పిలుపు. ఎందుకు పిలుస్తారో వాళ్లకూ తెలియదు. ఎందుకు పోతానో నాకూ తెలియదు. అయిననూ పోయి రావలె హస్తినకు.’’ ‘‘మీ సంగతి సరే. ప్రజల పరిస్థితి ఏమిటి?’’ ‘‘ఒక్కండు మీ మొర ఆలకించడు. పొగ పెట్టారు. సెగ చుట్టుకుంది. బాల్ పట్టుకుని జనం కాచుకు కూచున్నారు. ఎన్నికలొస్తే అవుట్ చేయటానికి. అవుట్లు కాల్చడానికి...’’ ‘‘ప్రజలకు మీరిచ్చే సందేశం?’’ ‘‘గెడకర్ర లేకుండా తీగపై నడవడం ప్రాక్టీస్ చేయమని!’’ - జి.ఆర్.మహర్షి మహర్షిజం తెలుగు తమ్ముడి ఆవేదన: ముందుచూపుతో ఉన్న చూపుని పోగొట్టుకున్నాడు మా చంద్రబాబు. మనదేశంలో మనుషులకే కాదు, డబ్బుకీ జబ్బు చేస్తుంది. మిణుగురులతో చీకటిని పారదోలడమే రాజకీయం. కాంగ్రెస్ నాయకుడి కామెంట్: మావాళ్లు చేపలకు వలేసి తామే వలలో చిక్కుకున్నారు. -
హ్యూమరం: కాలి కింది గొయ్యి
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు పౌరసంఘం సన్మానం. సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, ‘‘గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ గోతి అన్నారు పెద్దలు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే కాలం పోయింది. నూతులు ఎండిపోయి గోతులే మిగిలాయి. వెనుకటికి రోడ్డుకి మధ్య గొయ్యి ఉండేది. ఇప్పుడు గొయ్యికి గొయ్యికి మధ్య రోడ్డు మిగిలింది. నా దారి రహదారి అని ఎవరూ డైలాగ్ చెప్పకుండా చేసిన అధికారులకు అభినందనలు’’ అన్నాడు. ఎముకల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు లేచి, ‘‘వెన్నెముకతో జీవించడం నాగరికతకే విరుద్ధమని అధికారులు భావిస్తున్నందుకు మా సంఘం హర్షం వెలిబుచ్చుతూ ఉంది. గోతుల్లో పడ్డవాడెవడూ వెన్నెముకతో బయటపడడు. ఎవడికీ ఏమీ విరగకపోతే మా ఆదాయం పెరిగేదెలా? బోన్ ఈజ్ బూన్, ప్రాక్టీస్ మేక్స్ ఏ డాక్టర్ మిలియనీర్’’ అన్నాడు. మందుల షాపు సంఘం పెద్దమనిషి లేచి, ‘‘మందు తాగి బండెక్కినవాడు నాలుగైదు గోతుల్లో పడి లేచేసరికి కిక్కు దిగిపోయి మళ్లీ నాలుగు పెగ్గులు బిగించి ఇంటికెళుతున్నాడు. ఈ రకంగా మా ఆదాయమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతున్నారు’’ అన్నాడు. కళ్ల డాక్టర్ల ప్రతినిధి లేచి, ‘‘కళ్లుండి కూడా లోకంలో ఎందరో గుడ్డివాళ్లుగా బతుకుతున్న కాలంలో మేము సేవలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. పడటం కూడా అడ్డదిడ్డంగా కాకుండా సక్రమంగా గోతిలో పడేలా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అద్దాలకు గిరాకీ పెరిగింది’’ అన్నాడు. రాజకీయ నాయకుల ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఇంతకాలం మేం మాత్రమే ప్రజలకు గోతులు తీస్తామని అందరూ ఆడిపోసుకున్నారు. అది తప్పని నిరూపించిన అధికారులకు కృతజ్ఞతలు. ప్రజలారా! గొయ్యిలో పడటం మీకు కొత్తేమీ కాదు. పడ్డవాడు చెడ్డవాడు కాడు. ఒక గొయ్యి పూడ్చితే వంద గోతులు పుట్టడమే ప్రజాస్వామ్యం. పూడ్చడం మానేసి గోతిలోనే జీవించడం నేర్చుకోండి. జీవితమే గొయ్యి అయినప్పుడు నుయ్యి కోసం ఎదురుచూడటం దండగ. చేదుకునేవాడు లేనప్పుడు ఈదడం నేర్చుకోండి. గోతిలో పడిన ప్రతివాడికి ఒక తాడు, సబ్బు ఉచితం’’ అని వాగ్దానం చేశాడు. చివరగా స్వచ్ఛంద సంస్థలవాళ్లు వచ్చి గోతి బాధితులకు వీల్ చెయిర్లు పంపిణీ చేశారు. మట్టి అంటకుండా గొయ్యి తవ్వడం ఎలా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అధికారులకు గోతివీరులు అని బిరుదునిచ్చి, ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడకుండా జాగ్రత్తలు చెప్పి హెచ్చరించారు. సభ ముగిసిన తరువాత ప్రజలు బయలుదేరారు. అదృష్టం బావున్నవాళ్లు ఇళ్లకు! గొయ్యిని తప్పించుకోలేనివాళ్లు ఆస్పత్రులకు చేరారు. - జి.ఆర్.మహర్షి