హ్యూమరం: అసెంబ్లీ పాము
అసెంబ్లీ ఆవరణలో పాము కనిపించింది. పగబట్టినవారిలా విలేకరులు వెంటపడ్డారు. పాము పారిపోయింది. విజువల్స్ దొరకనివాళ్లు బూరలు తీసి ఊదారు. బుగ్గలు వాచాయి కానీ పాము కనపడలేదు. లైవ్ చర్చావేదికలు ప్రారంభించారు. ప్రజాస్వామ్యంపై పాము పగబట్టిందని, పాము, నాయకులు, ప్రజలు వీరి మధ్య అవినాభావ సంబంధముందని ఒకాయన వాదించాడు. పాములు పగ పడతాయని, నాయకులు పొగ పెడతారని, ప్రజలకు సెగ తగులుతుందని, అందువల్ల రాబోయేది సర్పస్వామ్యమని ఆయన సూత్రీకరించారు. పాములున్న చోటకు నాయకులు వెళ్లగలరు కానీ, నాయకులున్న చోటకు పాములు రాలేవని, అది నకిలీ పామని ఇంకొకాయన చర్చించాడు.
వాస్తవానికి పాము అసలైన నాయకత్వ ప్రతీక అని, చీమలు పెట్టిన పుట్టలో అది దర్జాగా కాపురముంటూ పైగా పూజలు కూడా అందుకుంటుందని ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురువు సిద్ధాంతీకరించాడు. ప్రజలంతా సర్పదోష నివారణ పూజలు చేయించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలు సిసలైన దోషులు కాబట్టి, ఈ పూజలతో అన్నీ చక్కబడతాయని ఒక సిద్దాంతి వాదించి అక్కడికక్కడే నాగ పడగలు తయారుచేసే కుటీర పరిశ్రమను కూడా ప్రారంభించాడు.
ఇదిలావుండగా కనిపించిన పాము విషపూరితమో కాదో తెలుసుకోవడానికి డాక్టర్లతో ఒక కమిటీ వేశారు. అనుమతి లేకుండా ఫొటోలు తీసినందుకు పాము కేసు పెట్టే అవకాశముందో లేదో తెలుసుకోవడానికి లాయర్లు ఒక కమిటీగా ఏర్పడ్డారు. పాము మనిషిగా మారడం, మనిషి పాముగా మారడం ఎప్పట్నుంచో సినిమాల్లో చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ పాము మనిషిగా మారి సభలో ప్రవేశించి, అడ్డదిడ్డంగా మైకులు విరగ్గొడితే ఏం చేయాలనే విషయంపై సినిమావాళ్లతో ఒక కమిటీ ఏర్పడింది. వీటన్నిటికీ అతీతంగా అధికారులు ఒక కమిటీగా ఏర్పడి, ఆఫ్రికా దేశాల్లోని పాములపై అధ్యయనం చేయటానికి విమానమెక్కారు.
ఆయా దేశాల్లోని ఆకలి అరాచకాలకు కారణం పాములేనని తీర్మానించి, పాములు, ఆర్థిక సంక్షోభం అనే అంశంపై ఒక స్వచ్ఛంద సంస్థ నిధులు తెచ్చుకుని పని ప్రారంభించింది. పాము గ్లామర్‌ని క్యాష్ చేసుకోవడానికి స్నేకియా అనే పేరుతో ఫోన్లు తయారయ్యాయి. బుస్‌బుస్ అనే రింగ్‌టోన్ పాపులర్ అయ్యింది.
పాకడం నేర్చుకున్నవాడే జీవితంలో పైకొస్తాడు కాబట్టి పాముని హీరోగా చేస్తూ కొంతమంది పుస్తకాలు రాసి అమ్ముకున్నారు. పాములకు, తీవ్రవాదులకు సంబంధాలుంటాయని అనుమానిస్తూ ఆపరేషన్ సర్ప అని ప్రభుత్వం ఒక శాఖను నెలకొల్పి నిధులిచ్చింది. ఇదంతా చూసిన ఒక వేదాంతి అసలు పాములు మనుషులు ఎప్పుడో కలిసిపోయారని, విడదీసి చూడటం అవసరమని తీర్మానించి, టీవీ ఆఫ్ చేసి నిద్రపోయాడు.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
నీ దగ్గర రెండు ఆవులుంటే...
కమ్యూనిస్టులు - ఆవులతో యూనియన్ పెట్టించి, పార్టీ చందాగా పాలను తీసేసుకుంటారు.
కాంగ్రెస్ - నీ ఆవుల్ని నీకే రుణంగా ఇస్తున్నట్టు సభ పెట్టి పాలను పంచేస్తారు.
బీజేపీ - గో సంరక్షణ పథకం కింద ఆవుల్ని లాగేసుకుంటుంది.
తెలుగుదేశం - ఆవులిస్తే పేగుల్ని లెక్కపెట్టి, పాలను హెరిటేజ్‌కి తరలిస్తుంది.
కాంగ్రెస్ నాయకుల స్పెషాలిటీ?
మత్తుమందు లేకుండా ఆపరేషన్ చేయగల సమర్థులు!
ప్రభుత్వ పథకమంటే?
నాగలిని ఉచితంగా ఇచ్చి ఎద్దుల్ని జప్తు చేయడం!
కాంగ్రెస్ నాయకుడి కామెంట్:
మా కిరణ్‌కుమార్‌రెడ్డి బాగానే ఫైట్ చేస్తున్నాడుగానీ అదంతా గ్రాఫిక్స్ అని జనం గుర్తించారు.
రాజకీయమంటే?
చికెన్ తింటూ కోడి ప్రాణ సంరక్షణ గురించి చర్చించడం.
కత్తి నురుతూ మేకలకు ధర్మసూకా్ష్మలు వివరించడం.