భువనేశ్వర్ : ‘మేం ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు. 147 అసెంబ్లీ, 21 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఒడిశా రాష్ట్ర బీజేపీ అధికారంగా ప్రకటించింది.
త్వరలో జరగనున్న పార్లమెంట్, అంసెబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పలు పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. సీట్లను పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో ఒడిశా అధికార పార్టీ బిజు జనతా దళ్ - బీజేపీల మధ్య పొత్తు ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది.
ఆ ప్రచారంపై ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. అనంతరం, రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్నికల గురించి మాట్లాడారు. కేంద్రం పెద్దలతో జరిగిన సమావేశంలో ఒడిసా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా చర్చించామే తప్పా అలయన్స్ గురించి, లేదంటే సీట్ల పంపకం గురించి ప్రస్తావించ లేదని అన్నారు.
#BJP will fight alone in both #LokSabha and #Odisha assembly polls: State BJP president Manmohan Samal
Does that mean talks derailed ? pic.twitter.com/4N7qxH4jDA
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2024
అంతేకాదు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా గెలిచి సామర్ధ్యం ఉందని స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెల్లడించారు.
కుదరని సయోధ్య
పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీజేపీ-బీజేడీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదలేదని తెలిపాయి. ఎన్నికలకు ముందు పొత్తుకు ఇరు పార్టీలు పరస్పరం అంగీకరించినప్పటికీ సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా..అందులో 100 సీట్లకు పైగా పోటీ చేయాలని అధికార పార్టీ బీజేడీ ప్రయత్నించగా, అందుకు బీజేపీ ఒప్పుకోలేదు.
రాష్ట్ర బీజేపీకే తీవ్ర నష్టం
ప్రస్తుతం అధికార బీజేడీ 114 అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్య వహిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు అంగీకరించిన బీజేడీ మొత్తం 112 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అందుకు కమలం నేతలు అంగీకరించలేదు. ‘బీజేడీ మాకు ఆమోదయోగ్యం కాని విధంగా 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీ నిర్ణయం మా పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతుందని’ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ప్రతిపాదన తిరస్కరించిన బీజేడీ
మరోవైపు, పొత్తులో భాగంగా ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాల్లో 14 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ.. బీజేడీతో చర్చలు జరిపింది. అందుకు బీజేడీ తిరస్కరించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.
ఢిల్లీలో మూడు రోజుల మకాం
ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ఒడిశా బీజేపీ నేతలు మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయ్ పాల్ సింగ్ తోమర్ నివాసంలో పలువురు కేంద్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జుయల్ ఓరమ్, తోమర్ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత, బీజేడీతో పొత్తుపై చర్చ జరిగిందని, అయితే ఏమీ ఖరారు కాలేదని తేలింది.
మోదీ పర్యటనతో మారిన రాజకీయం
ఒడిశా బీజేపీ నాయకులు బీజేడీతో పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ మార్చి 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత రాష్ట్ర రాజకీయం పూర్తిగా మారిపోయింది. మోదీ పర్యటన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగాయి. అదే సమయంలో రాష్ట్ర, ప్రజల ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేడీ సూచించింది.
11ఏళ్ల పొత్తులో
గతంలో ఒడిశాలో బీజేపీ-బీజేడీలు (1998 - 2009) సుమారు 11 ఏళ్ల పాటు పొత్తులో ఉన్నాయి. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ ఎన్నికలలో కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. 1998లో జనతాదళ్ విడిపోయినప్పుడు, పట్నాయక్ తన సొంత పార్టీని స్థాపించి, ఉక్కు, గనుల మంత్రిగా వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరారు.
2000లో తొలిసారి
2000లో తొలిసారి, 2004లో రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అంతకుముందు బీజేడీ, బీజేపీల మధ్య సీట్ల షేరింగ్ రేషియో 4:3గా ఉంది. బీజేడీ 84 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 63 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో 48.7 శాతం ఓట్లతో 21 సీట్లలో 17 స్థానాలను కూటమి గెలుచుకుంది. కూటమి మళ్లీ 1999లో 19 స్థానాలకు మెరుగైంది. ఇది 2004లో 18కి కొద్దిగా తగ్గింది. మళ్లీ ఇప్పుడు బీజేడీ- బీజేపీల మధ్య పొత్తు అంశం తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment